ఇప్పుడంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు తినేవాళ్ళం అని పెద్దవారు చెబుతుంటారు. అవి ఎంత బలాన్నిస్తాయో తెలుపుతూ అందుకే మేమింకా ఆరోగ్యంగా ఉన్నామనీ అంటుంటారు. ఇవన్నీ పోషకాల గనులని ఆహార నిపుణులు చెబుతుంటే.. ఇటీవల అందరి దష్టి చిరు ధాన్యాలవైపు మళ్లింది. రాయలసీమ రాగి సంగటి, మిల్లెట్స్ జావలు ఏవైతేనేం.. వాటి ప్రాముఖ్యత మెండు. ఈ మండే ఎండల్లో సులభంగా జీర్ణమయ్యే ఆహారాలే ఆరోగ్యకరం. అందుకే మనం ఈ చిరుధాన్యాలపై శ్రద్ధ పెట్టాల్సిందే. అందుకే వాటితో జావలు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
- కొర్రలతో..
కావలసినవి : కొర్రలు - కప్పు, నీళ్ళు - 10 కప్పులు, ఉప్పు - తగినంత, చిలికిన పెరుగు - కప్పు
తయారీ : కొర్రలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం అదే నీళ్ళతో మట్టిపాత్రలో సన్నని సెగపై ఉడికించాలి. దాదాపు అరగంట సేపు ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. పాత్ర మూతిని కవర్‌చేస్తూ పలుచని కాటన్ క్లాత్‌ను కట్టాలి. ఆరుగంటల పైగా ఇలానే ఉంచితే పులిసి, జావ తాగడానికి తయారౌతుంది. మజ్జిగ కలిపి రుచికరమైన కొర్రల జావను ఆస్వాదించడమే.
కొర్రలను దోరగా వేయించి పొడిచేసి కూడా జావ తయారుచేసుకోవచ్చు.
సజ్జలు, జొన్నలు, అరికెలు, సామలు లాంటి మిల్లెట్స్‌తో పైన చెప్పిన రెండు రకాలుగానూ జావలు తయారు చేసుకోవచ్చు.
- బియ్యంతో..
కావలసినవి : ముడి బియ్యప్పిండి- 2 స్పూన్లు, నీళ్ళు - కప్పు + 1/2 కప్పు, ఉప్పు - తగినంత
తయారీ : ముందుగా కప్పు ముడి బియ్యాన్ని తీసుకొని, శుభ్రంగా కడిగి నాలుగ్గంటలు నానబెట్టాలి. తర్వాత బియ్యాన్ని వడగట్టి నీడలోనే ఒక రోజంతా ఆరనివ్వాలి. పొడిగా ఆరిపోయిన తర్వాత దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి, పిండి తయారు చేసుకోవాలి.
అర కప్పు నీటిలో బియ్యం పిండి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచాలి. ఒక గిన్నెలో నీటిని మరిగించి, ఉప్పు వేసి దానిలో ఉండలు కట్టకుండా పిండి మిశ్రమాన్ని పోసి తిప్పుతూ ఉడికించాలి. జావ కొంచెం చిక్కబడిన తరువాత దింపి చల్లార్చాలి. మజ్జిగ కలిపి తీసుకుంటే చలువ చేసే బలమైన ఆహారం ఈ జావ. ఈ జావలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మంచి కాంబినేషన్. ఇది పిల్లలు, పెద్దలు ఎంచక్కా తీసుకోవచ్చు.
- రాగి..
కావలసినవి : రాగి పిండి - కప్పు, ఉప్పు - తగినంత, నీళ్ళు - 4 కప్పులు + 11/4 లీ., పెరుగు - కప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర తరుగు - తగినంత
తయారీ : మొలకలు వచ్చిన రాగులను బాగా ఎండబెట్టి, పిండి పట్టించాలి.
ఒక వెడల్పు గిన్నెలో రాగిపిండి, నీళ్ళు ఉండలు లేకుండా కలిపి ఉప్పు వేసి, స్టౌ సిమ్‌లో ఉంచి తిప్పుతూ ఉడికించాలి. దాదాపు పదిహేను నిమిషాలకు బాగా ఉడికి ముద్దగా అవుతుంది. వేడి చల్లారాక ఒకటింపావు లీటర్ల నీటిని తీసుకున్న పాత్రలో ఈ ముద్దను పూర్తిగా మునిగేలా వేసి ఆ రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఆ ముద్దను నీటిలో కరిగేలా చేతితో కలపాలి. ఇంకా ఉండలు ఉంటే వెడల్పు నెట్ సహాయంతో ఆ ఉండలను చిదుముతూ జావను చేయాలి. తరువాత పెరుగును తరకలు లేకుండా చిలికి జావలో కలపాలి. దానిలో ఉల్లి, అల్లం, పచిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేయాలి. అంతే వేసవిలో చలువచేసే రాగి జావ రెడీ అయినట్లే. దీనిని మట్టి పాత్రలో గంట సేపు ఉంచినట్లైతే చల్లగా తాగడానికి హాయిగా ఉంటుంది.