May 07,2023 07:22

వేసవి సెలవులు అనగానే పిల్లలు ఎగిరి గంతేస్తారు.. దీంతోపాటు నెలరోజుల పాటు సెలవులు కావడంతో అనేక ప్లాన్‌లతో సిద్ధంగా ఉంటారు. అయితే వాటిని ఒక క్రమపద్ధతిలో పెట్టే బాధ్యత మాత్రం పెద్దలపై ఉంటుంది. అందుకే.. ఈ సెలవులను పిల్లలు ఆనందించేలానే కాదు.. అర్థవంతంగానూ మార్చాలి.. కొత్త అనుభవాలను సొంతం చేసుకునేలా ఉండాలి.. ఇళ్లలో మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలు, ఆన్‌లైన్‌ గేములకు అతుక్కుపోయే చిన్నారులను.. ఆరుబయట ఆకాశమంత విశాల ప్రపంచాన్ని గమనించేలా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి తీరికలేక పిల్లల్ని వారి ఇష్టానికి వదిలేస్తుంటారు. అలా కాకుండా వేసవి సెలవులను మరింత వైవిధ్యంగా ఎలా గడపొచ్చో పిల్లలకు తెలిపేలా తల్లిదండ్రులు దృష్టి సారించాలి. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..

5


పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవు రోజుల్లో పిల్లలకు విజ్ఞానంతోపాటు వినోదాన్నీ అందించడం ద్వారా వారి అభిరుచిని మెరుగుపర్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల్ని వినోదాల ద్వారా కాలక్షేపం కోసం వదిలేయకుండా వారిలోని నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణ ఇప్పించడం ఎంతో అవసరం.. పెద్ద పిల్లలైతే వారు చదివే కోర్సుకు ఉపయోగపడే అదనపు స్కిల్స్‌ నేర్పించడం, క్రీడలతోపాటు అనేక రకాలుగా మన జీవితంలో ఉపయోగపడే విషయాల్ని నేర్చుకునేలా చూడడం అవసరం. ఆధునిక సమాజంలో విద్యతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాల్ని సాధించేందుకు దోహదపడుతుంది.

  • చేతిరాతను మెరుగుపరిచేలా..

మనలో చాలా మంది పాఠశాలల్లో చేతిరాత బాగాలేక టీచర్లతో చీవాట్లు తిన్నవారే. పరీక్షల్లోనూ చేతిరాతకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ పరీక్ష అయినా మనం రాసే సమాధానాలను మంచి చేతిరాతతో రాస్తే చదివేందుకు బాగుంటుంది. తద్వారా ఆయా పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశముంది. అందుకే ఈ సెలవుల్లో చేతిరాత మెరుగుపరిచే శిక్షణా తరగతులకు వెళ్లడం మంచిది. దీనికి సంబంధించిన డీవీడీలు, పుస్తకాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

  • భాషపై పట్టు పెంచడం..

ఇటీవలి కాలంలో భాషకు ప్రాముఖ్యత పెరిగింది. మన దేశంలోని ప్రధాన భాషలతో పాటు వివిధ దేశాలకు చెందిన స్థానిక భాషలకూ ప్రాముఖ్యత పెరిగింది. ఆయా భాషలు నేర్చుకున్న వారికి లక్షల్లో వేతనాలు అందుతున్నాయి. అందుకే భాష ఏదైనా అందులో పట్టు అవసరం. అది తెలుగు/ఇంగ్లీష్‌ మరేదైనా కావొచ్చు. భాషపై పట్టులేకపోతే కమ్యూనికేషన్‌ కూడా దెబ్బతింటుంది. తెలుసుకోవాల్సిన విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడానికి భాష ప్రధానమైనది. కాబట్టి వేసవి సెలవుల్లో ఏదైనా భాషపై దృష్టి పెడితే పిల్లల అభ్యున్నతికి తోడ్పడుతుంది. విషయ పరిజ్ఞానాన్ని విస్తృతపరుస్తుంది.

  • స్మార్ట్‌ఫోన్లకు దూరంగా...
2

పిల్లలు అల్లరి చేస్తున్నారని వారికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేయకండి. అదేపనిగా స్మార్ట్‌ఫోÛన్‌ చూసినట్లయితే పిల్లలకు దృష్టిలోపం, మెడ సంబంధిత సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు మొబైల్‌ ఫోన్‌ బదులు మంచి కథల పుస్తకాలు, డ్రాయింగ్‌ పుస్తకాలు కొనివ్వండి. అలాగే వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా వారితో బొమ్మలు వేయించండి. లేదా ఇతర కళలను నేర్పించండి. ముఖ్యంగా పట్టణాల్లో అయితే గార్డెనింగ్‌ చేయించండి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల సమయం గడిచిపోవడమే కాదు. ఒక ఆసక్తి, అనురక్తి కలిగే అవకాశం ఉంటుంది. విత్తనం నుంచి మొక్క రావడం, అది పెరగడం, పూయడం, కాయడం వారికో అద్భుతంగా అనిపిస్తుంది.

  • సాంకేతికతా తప్పనిసరి...

నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం లేనిదే ఏ పనీ జరుగడం లేదు. నేడు కంప్యూటర్‌ టెక్నాలజీ ప్రతి వ్యక్తికీ ప్రాథమిక అవసరం. ఇప్పటికే అనేక పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ అన్ని పరీక్షలకూ జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.

6
  • ఆటకీ టైంటేబుల్‌...

వేసవికాలంలో పిల్లలు ఆడుకునేందుకు నిర్దిష్టమైన టైంటేబుల్‌ను రూపొందించాలి. అప్పుడు పిల్లలు సమయపాలన పాటించడం అలవాటవుతుంది. నిర్దిష్ట కాలంలో ఆడుకునే వీలుంటుంది. అదే పనిగా ఎండల్లో ఆడుకోకుండా నీడ పట్టునే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు టీవీ చూడకుండా వారిని ఫిజికల్‌ గేమ్స్‌ వైపు మోటివేట్‌ చేస్తే మంచిది. అదేవిధంగా సాయంకాలాలు పిల్లలకు కరాటే, డ్రాయింగ్‌, స్విమ్మింగ్‌, క్రికెట్‌, చెస్‌, వంటి యాక్టివిటీస్‌లో శిక్షణ ఇప్పించడం వల్ల అస్సలు బోర్‌ ఫీల్‌ అవ్వరు.

  • పల్లెకు పయనించండి..

మూలాలు పల్లెల్లో ఉన్నట్లయితే వేసవి సెలవుల్లో పిల్లలను వారి అమ్మమ్మ లేదా నాయనమ్మ ఇంటికి పంపించేందుకు ప్రయత్నించండి. సిటీలోని కాలుష్యానికి దూరంగా పిల్లలు పల్లె వాతావరణంలో హాయిగా పెరుగుతారు. తద్వారా వారికి అనేక విషయాలూ తెలుస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ పద్ధతులు, మన సంస్కృతి పిల్లలకు తెలిసే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా తెల్లవారు జామునే నిద్రలేవడం అలవాటవుతుంది. కొంచెం పెద్దపిల్లలైతే పొలం పనులకు వెళ్లే తాతయ్యలతో పంపండి. వాళ్లు చేసే పనులు శ్రద్ధగా గమనిస్తారు. తద్వారా వ్యవసాయంలోని కష్టాన్నీ అర్థం చేసుకుంటారు. అవగాహనను పెంపొందించుకుంటారు. పొలం దున్నడం, నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులనూ గమనిస్తారు. ఒకవేళ అర్థంకానివి ఏవైనా ఉంటే వాటిని, ఆ పనులను ఎందుకు చేస్తున్నారో ఆయా సందర్భాల్లో వివరించే ప్రయత్నం చేయండి.

3
  • ప్రకృతిపై అవగాహన...

పల్లెటూళ్లకు, పొలాలకు వెళ్లడం ద్వారా గ్రామాల్లో ఏ పక్షలు ఎలా జీవనం సాగిస్తాయో.. ఏయే పంటలు ఎలా పండుతాయో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు.. ఏ పంటకు ఎంతకాలం పడుతుందో, ఏ మొక్కకు పూలూ, పండ్లు వస్తాయో తెలుస్తుంది. పెద్ద పెద్ద చెట్ల ఆకులను, కొమ్మలను పరిశీలించి, వాటిపై ఏయే పక్షులున్నాయో గమనించడం, వాటి కూతలను అనుకరించడం నేర్చుకుంటారు. ఇంటికొచ్చాక చూసిన వాటి వివరాలన్నీ ఒక నోట్‌బుక్‌లో రాయడం నేర్పించాలి. దీనివల్ల తెలియని వాటిని తెలుసుకునే ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా వాటి పేర్లూ పిల్లలకు పరిచయమవుతాయి.

  • ఇంటిపనుల్లో సాయం..

ఇంట్లో అమ్మా వాళ్లు వంట పనుల్లో బిజీగా ఉంటారు. వారి పనికి ఆటంకం కలగకుండా వారి ప్రతి పనీ గమనించేలా వారికి అవగాహన కల్పించాలి. ఇల్లు ఎలా ఊడుస్తున్నారో, గిన్నెలెలా కడుగుతున్నారో తెలపడంతోపాటు అవసరమైన మేరకు వారితో చేయించాలి. కూరలు, వంటలూ ఇలా అన్నింటినీ గమనించేలా.. తద్వారా వారికి కలిగే సందేహాలను నివృత్తి చేసేలా వారితో సన్నిహితంగా మెలగాలి. దీంతోపాటు అన్నం ఎంతసేపు ఉడుకుతుందో, దుంప, ఆకు, కాయగూరలు ఇలా రకరకాల వంటలు ఎలా చేస్తారో, ఎంతసేపు చేస్తారో వారికి అవగాహన కల్పించాలి.

  • అమ్మమ్మ, నానమ్మలతో...
4

అన్నం తిన్న తరువాత కాసేపు పడుకుని సాయంత్రం బయటికెళ్లి స్నేహితులతో ఆడుకోవడం అవసరమే. స్నేహాలు పెంపొందాలి. కొత్త కొత్త ఆటలను నేర్పాలి. రాత్రి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తమామలను కథలు చెప్పమనండి. పాటలు పాడే వాళ్ళను పాడమనండి. వాటన్నింటినీ పిల్లల్ని నేర్చుకోమనాలి. అన్నీ పుస్తకంలో రాసుకోమని చెప్పండి. చదివిన, విన్న కథలను, అలాగే సినిమాలను సొంత భాషలో ఇతరులకు చెప్పడం అలవాటు చేయాలి. రాసే ఆసక్తి ఉంటే రాయించడం చేయాలి. అలా చేస్తే వాళ్లు విన్న, కన్న విషయాల్ని మరింతగా అర్థం చేసుకోగల్గుతారు. అలాగే సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా విషయాల్ని చెప్పడం అలవాటవుతుంది. భాష మీద ఆసక్తి, నేర్చుకునే అలవాటు పెరుగుతుంది.

  • దండన సరికాదు..

వేసవి సెలవుల్లో పిల్లలు బోర్‌ కొడుతుందని అల్లరి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అల్లరి చేస్తున్నారు కదా అని వారిపై అదే పనిగా కోపం తెచ్చుకోవద్దు. దండించడం అసలు కూడని విషయం. వారికి అర్థమయ్యే విధంగా చెప్పి చూడండి. లేదా వారిని ఏదైనా యాక్టివిటీలో బిజీగా ఉండేలా చేయండి. అలాగే పెద్దలు రోజులో కొద్ది సమయం పిల్లలకు కేటాయించి, వారితో ముచ్చటించండి. అలాగే పిల్లలకు నచ్చిన ఆహారాన్ని తయారుచేసి, తినిపించండి. అదే క్రమంలో ఇంట్లో చేసే ఆహారాన్ని మాత్రమే తినేలా వారికి అవగాహన కల్పించాలి.

  • జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు...

సెలవుల్లో రోజుకి గంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. ఒకప్పుడు పిల్లలకు కథలు చెబుతుంటే 'ఊ' కొడుతూ పడుకునేవారు. ప్రస్తుతం కథలు చెప్పే నాయనమ్మలు లేరిప్పుడు, విని 'ఊ' కొట్టే తీరిక పిల్లలకూ లేదు. రోజంతా ఏదో హడావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతున్నారు. అయితే మార్పులు వచ్చినా పిల్లల్లో ఒకటి మాత్రం మారకుండా ఉంది. అదే కథల మీద ఆశక్తి. ఆ ఆశక్తితోనే కథలు చదివించుకుని, ఆనందపడుతున్నారు ఇప్పటి పిల్లలు. పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా మెదడును పెంచుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచి, జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో చదువును అలవర్చాలి. పిల్లలకు ఏది అలవాటు కావాలన్నా ముందు పెద్దలకు అలవాటు కావాలి. పిల్లలు ఏదైనా పెద్దల నుంచే నేర్చుకుంటారు. మరిచిపోకండి.

2
  • వ్యాయామం తప్పనిసరి..

వ్యాయామం, ఆటలు ఫిజికల్‌గా, ఫిట్‌గా ఉంచుతాయి. మన భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. అందుకే పిల్లలు రోజులో కొంత సమయం ఆటలకు కేటాయించేలా ప్లాన్‌ చేయాలి. ముఖ్యంగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, రెజ్లింగ్‌, కబడ్డీ, లాన్‌టెన్నిస్‌, క్రికెట్‌, బాక్సింగ్‌ శిక్షణ ఇప్పిస్తే మంచిది. అవకాశం లేకపోతే కనీసం ఖాళీ స్థలాల్లో రోజులో అరగంట నుంచి గంట వ్యవధిలో రన్నింగ్‌, సైక్లింగ్‌ వంటివి చేయించడం మంచిది. దీంతో పాటు స్విమ్మింగ్‌ ఎంతో ముఖ్యమైనది. స్విమ్మింగ్‌ కోసం ప్రత్యేకించి సమయం లేకపోవటంతో ఎక్కువ మంది ఈతకు దూరమవుతున్నారు. వేసవి సెలవుల్లో దగ్గరలో ఉన్న స్విమ్మింగ్‌పూల్స్‌కు తీసికెళ్లి ఈత నేర్పించడం ఎంతో అవసరం. దీనివల్ల శారీరకంగా దృఢంగా తయారవుతారు. తద్వార మానసికంగానూ బలపడతారు.

  • ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో...

ఇటీవల కాలంలో ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌కి బాగా డిమాండ్‌ పెరిగింది. సంగీతం, ఓకల్‌, ఇన్‌స్ట్రుమెంట్స్‌, కీబోర్డ్‌, గిటార్‌, డ్యాన్స్‌, పెయింటింగ్‌, క్రాఫ్ట్‌ వర్క్‌, క్లే మౌల్డింగ్‌ లాంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకుని, పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించి పై రంగాల్లో వారికి ఏది ఇష్టమైతే వాటిలో శిక్షణ ఇప్పించాలి. తద్వారా వారిలోని నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అల్లరీ తగ్గుతుంది. అంతేకాదు ఈ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో సమయమూ ఇట్టే గడిచిపోతుంది.

  • శిక్షణా శిబిరాలతో జోష్‌...
2

వేసవి క్రీడా శిబిరాలు అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇప్పటివరకూ వారిలో ఉన్న నిరాశ నిస్పృహలన్నీ తొలగిపోతాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమై సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీలతో గడిపిన బాలబాలికల్లో ఈ వేసవి సెలవులు నూతనోత్సాహం నింపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా, అర్బన్‌ ఏరియా వారికి నామమాత్ర రుసుముతో శిక్షణ ఇస్తున్నారు. దీంతో క్రీడామైదానాలు, పాఠశాలలు సందడిగా మారాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ ఎండ తీవ్రత లేని సమయాల్లో శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు.

  • వేసవిలో తల్లిదండ్రులు పాత్ర...
2

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేశారు. మరో నెల రోజుల పాటు పిల్లల స్కూలు తెరిచే వరకు తల్లిదండ్రుల వద్ద పిల్లలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వేసవికాలంలో పిల్లలు ఇంటి వద్ద ఉండటంతో ముఖ్యంగా తల్లులకు పెద్ద సవాలే చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు రోజంతా బోర్‌ కొట్టకుండా, అదేపనిగాఎండలో ఆడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే వారు రోజంతా ఇంట్లో ఉండి, అల్లరి చేయడం వల్ల తల్లులకు అసహనం వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లలతో సంయనంతొనే వ్యవహరించాలి. వారిలోని నైపుణ్యాలకు పదును పెట్టేలా.. సృజనాత్మకతను వెలికితీసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గ్రహించాలి.

  • అల్లరి పిల్లలతో జాగ్రత్త...
2

వేసవికాలం వచ్చేసింది పిల్లలు ఇంటి వద్ద ఉండాల్సిన పరిస్థితి. మరో నెల పాటు స్కూలు తెరిచే వరకూ అల్లరి పిల్లలతో తల్లిదండ్రులకు తిప్పలు తప్పవు. అయితే వారిని సరైనా దారిలో పెట్టేందుకూ కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేంటో చూద్దాం...

  1.  పిల్లలను బావుల్లో, అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపకండి.. అవసరమైతే స్వయంగా తీసుకుని వెళ్లండి.
  2.  మోటార్‌సైకిల్‌ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి. వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
  3.  మొబైల్‌ ఫోన్‌లు, ట్యాబ్‌లు వారి చేతికి ఇవ్వకండి. ఇక్కడ నిఘా పద్ధతిలో కాకుండా పర్యవేక్షణ తప్పనిసరి.
  4.  స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి.
  5.  మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకొనేలా చూడండి.
  6.  ఇంట్లో పెద్దలతో ఎక్కువ సమయం గడిపేలా చూడండి.
  7.  ఇంటి పనులు, బాధ్యతల గురించి వారికి చెప్పాలి.
  8.  ఇలా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి.
  • నైపుణ్యాన్ని పెంపొందించేందుకు..
2
  1.  పిల్లలకు చిన్న చిన్న వంటలు వండటం నేర్పించవచ్చు. మ్యాగీ, పిజ్జా, కేక్‌ బేకింగ్‌ వంటివి నేర్పిస్తే, పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు.
  2.  కార్డ్‌బోర్డ్స్‌తో రకరకాల క్రాఫ్ట్‌ తయారుచేయడం నేర్పించాలి.
  3.  వేసవిలో నీళ్లు దొరకక పక్షులు అల్లాడిపోతాయి. కాబట్టి పిల్లల చేత పక్షులకు నీళ్లతొట్టెలు పెట్టించాలి. వీధి కుక్కలు, ఇతర జంతువులకు కూడా నీళ్ల సదుపాయాన్ని అందించేలా చేయండి.
  4.  పిల్ల్లల చేతికి రంగులు ఇచ్చి, కొంత స్థలాన్ని చూపించి స్వేచ్ఛగా వదిలేయాలి. వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఇదొక అవకాశంగా మలుచుకోవాలి. వారు చూసింది చిత్రించేలా ప్రోత్సహించాలి.
  5.  వేసవి సెలవుల్లో పిక్నిక్‌కు తీసుకెళ్లడం కూడా మంచి ఆలోచన. పిల్లలు కూడా రిలాక్స్‌గా ఫీలవుతారు.
  6.  జంతుప్రదర్శనశాలకు తీసుకెళితే పిల్లలు బాగా ఎంజారు చేస్తారు. జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన కథలు, వాస్తవాలను వివరించొచ్చు.
  7.  దగ్గరలో రైతు బజార్‌కు తీసుకెళ్లాలి. కూరగాయలు, వాటి ధరలు, రైతులు వాటిని తీసుకొచ్చి అమ్మే విధానం గురించి పిల్లలు తెలుసుకుంటారు.
  8.  ఒకరోజు ఇంటి క్లీనింగ్‌ పనిని పిల్లలకు అప్పగించాలి. కిటికీలు శుభ్రం చేయడం, షెల్ఫ్‌లు దులపడం వంటి పనులన్నీ వాళ్ల చేత చేయించవచ్చు.
  9.  పిల్లల మధ్య స్టోరీ టెల్లింగ్‌ పోటీలు పెట్టాలి. కథలు బాగా చెప్పిన వారికి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలి.
  10. మయం చాలా విలువైనది.. అందుకే ఈ సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా వ్యాయామం, విద్య, వినోదం లాంటి వాటిపై పిల్లలు దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలకు వెళ్లినప్పుడే చదువుకోవాలనేది కాకుండా సెలవు రోజుల్లోనూ వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారు జీవితంలో సాధించాల్సిన వాటిపై దృష్టి సారించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనదే.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815