Jun 10,2023 06:37

ప్రభుత్వాలు జనం కళ్ళుగప్పటానికి కొత్త కొత్త రూపాలలో, మోసపూరిత పద్ధతుల్లో భారం వేస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, విద్యుత్‌ సుంకం ఇలా విడివిడిగా వడ్డిస్తున్నారు. ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల రూపంలో మరో బాదుడు. ఇది మోడీ, జగన్‌ జాయింట్‌ బాదుడు. మీ డిపాజిట్‌ చాలలేదని అదనపు డిపాజిట్‌ పేరుతో, మీ ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, ఏసీలు కొనుక్కుంటే అదనపు లోడ్‌ పేరుతో డెవలప్‌మెంట్‌ చార్జీలని నోటీసులు ఇస్తారు. ఇలా ఒకటి కాదు, జనాన్ని పలు రూపాల్లో పీల్చి పిప్పి చేస్తున్నారు. వినియోగదారులు ప్రత్యక్షంగా కట్టే బిల్లులే కాకుండా, పంచాయతీ, మున్సిపాలిటీలకు కరెంటు బిల్లు పెరిగినా పరోక్షంగా జనం కట్టాల్సిందే.

              వేసవి ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్‌ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. దానికి తోడు ఈ నెల వచ్చిన కరెంట్‌ బిల్లులు చూసి జనానికి షాక్‌ కొట్టింది. వేసవి కదా కరెంటు ఎక్కువ వాడుకున్నామేమోనని కొందరు సరిపెట్టుకున్నారు. కానీ అసలు నిజం వేరు.
            ప్రభుత్వం విద్యుత్‌ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నది. ఈ నెల ముప్పేట దాడి చేసింది. వాడుకున్న కరెంటుకి రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అసలు కంటే కొసరు చార్జీలు ఎక్కువయ్యాయి. ట్రూ అప్‌, సర్దుబాటు, ఎఫ్‌.పి.పి.సి.ఎ...ఇలా రకరకాల పేర్లతో జనాన్ని బాదేస్తున్నారు. ఏనాడో వాడుకున్న కరెంట్‌కి ఆనాడే బిల్లు కట్టేసినా, విద్యుత్‌ సంస్థలు లెక్కలు వేసుకుని మీరు చెల్లించిన బిల్లు చాలలేదు, మాకు ఖర్చులు పెరిగాయి, మళ్ళీ అదనంగా కట్టండంటూ జనం నుండి వసూలు చేయటమే ఈ సర్దుబాటు చార్జీల మర్మం. ప్రపంచంలో ఏ సరుకుకూ ఈ పద్ధతి ఉండదు. కానీ విద్యుత్‌లో మాత్రం సంస్కరణల పేరుతో ఈ సర్దుబాటు చార్జీలకు చట్టబద్ధత కల్పించారు. 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న కరెంట్‌కు ఆనాడు బిల్లులు కట్టేశారు. కానీ ప్రభుత్వం 2900 కోట్ల రూపాయలు లోటు వచ్చిందని జనం నుండి 36 నెలల పాటు వసూలు చేయటానికి విద్యుత్‌ నియంత్రణ మండలి ద్వారా అనుమతి పొందారు. ఇప్పటికి 11 నెలలు వసూలు చేశారు. ఇంకా 25 నెలలు యూనిట్‌కి సుమారు 20 పైసల చొప్పున వసూలు చేస్తారు. మళ్ళీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాడుకున్న కరెంటుకు కట్టిన బిల్లులు చాల్లేదని అదనంగా రూ.3083 కోట్లు జనం నుండి వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల బిల్లులో 2021 మే నెలలో వాడుకున్న కరెంట్‌కు యూనిట్‌ 20 పైసలు చొప్పున మళ్ళీ ఇప్పుడు వేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఎన్నో సంవత్సరాలు ఎందుకు ఆగాలి? ఏ నెలలో ఖర్చు అదనంగా అయినా, మరుసటి నెలలోనే అదనంగా వసూలు చేసే విధానం ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా దానిని అమలు చేస్తున్నది. అందుకే ఏప్రిల్‌ నెలలో వాడుకున్న కరెంటుకు లోటు వచ్చిందని ఈ నెల బిల్లులో 40 పైసలు చొప్పున యూనిట్‌కు కలిపారు. ఈ మూడు రకాల భారాలు యూనిట్‌కు 80 పైసలు చొప్పున ఈ నెల బిల్లులో అదనంగా వేశారు. ఇది అదనపు వడ్డన.
           తక్కువ కరెంట్‌ ఉపయోగించే వారిపై ఈ భారం మరింతగా పడింది. విజయవాడలో ఒక ఇంటిలో 10 యూనిట్లు వాడారు. యూనిట్‌కు రూ.1.90 పైసలు చొప్పున రూ.19 వారు వాడుకున్న అసలు కరెంట్‌ బిల్లు. రూ.30 ఫిక్స్‌డ్‌ చార్జీ, రూ. 25 కస్టమర్‌ చార్జీ, 2014-19లో వాడుకున్న కరెంట్‌ రూ.105 ట్రూఆప్‌ చార్జీ, 2021 మే నెలలో వాడిన విద్యుత్‌కు అదనంగా రూ.62 సర్దుబాటు చార్జీ, 2023 ఏప్రిల్‌లో వినియోగించిన విద్యుత్‌కు రూ.175 సర్దుబాటు చార్జీ ఈ నెల బిల్లులో వేశారు. మూడు రకాల సర్దుబాటు చార్జీలు కలిపి రూ.342. మొత్తం బిల్లు రూ.416 అయ్యింది. ఇందులో ఈ నెల వాడిన కరెంట్‌ బిల్లు రూ. 19 మాత్రమే. మొత్తం బిల్లులో 5 శాతం అసలు కరెంట్‌ బిల్లు, 13 శాతం ఇతర చార్జీలు, 82 శాతం సర్దుబాటు చార్జీలు. మొత్తం కొసరు చార్జీలు 95 శాతం వున్నాయి. ఇలా ప్రతీ బిల్లులో దొడ్డి దారిన 10-95 శాతం వరకు అదనపు భారాలే! సర్దుబాటు చార్జీలు 10-80 శాతం వరకు వేశారు.
              ప్రభుత్వాలు జనం కళ్ళుగప్పటానికి కొత్త కొత్త రూపాలలో, మోసపూరిత పద్ధతుల్లో భారం వేస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, విద్యుత్‌ సుంకం ఇలా విడివిడిగా వడ్డిస్తున్నారు. ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల రూపంలో మరో బాదుడు. ఇది మోడీ, జగన్‌ జాయింట్‌ బాదుడు. మీ డిపాజిట్‌ చాలలేదని అదనపు డిపాజిట్‌ పేరుతో, మీ ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, ఏసీలు కొనుక్కుంటే అదనపు లోడ్‌ పేరుతో డెవలప్‌మెంట్‌ చార్జీలని నోటీసులు ఇస్తారు. ఇలా ఒకటి కాదు, జనాన్ని పలు రూపాల్లో పీల్చి పిప్పి చేస్తున్నారు. వినియోగదారులు ప్రత్యక్షంగా కట్టే బిల్లులే కాకుండా, పంచాయతీ, మున్సిపాలిటీ లకు కరెంటు బిల్లు పెరిగినా పరోక్షంగా జనం కట్టాల్సిందే.
            వీటన్నిటికీ ముఖ్యమైన కారణం విద్యుత్‌ సంస్కరణల పేరుతో ఆనాడు, ఈనాడు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు చేపట్టిన విధానాలే. విద్యుత్‌ అందించే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకుని వ్యాపారసంస్థలుగా మార్చేశారు. మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా అదానీకి, కార్పొరేట్లకు విద్యుత్‌ రంగాన్ని కట్టబెట్టడానికి ఈ దోపిడీని వేగవంతం చేసింది. పైగా విద్యుత్‌ చట్టాలను సవరిస్తోంది. రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా లొంగిపోయింది. తూచా తప్పక అమలు చేస్తూ.. జనం జేబులు ఖాళీ చేస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తినే కాకుండా పంపిణీని కూడా కార్పొరేట్‌, ప్రైవేట్‌ కంపెనీలకు కేంద్రం కట్టబెడుతోంది.
            మన రాష్ట్రంలో వ్యవసాయానికి అందించే విద్యుత్‌ మొత్తం 30 సంవత్సరాల పాటు అదానీ కంపెనీ సరఫరా చేసే విధంగా ఒప్పందం చేసేసుకున్నారు. ప్రభుత్వం ధర్మల్‌ స్టేషన్లలో ఉత్పత్తిచేసే విద్యుత్తుకు అధిక భాగం బొగ్గు సరఫరా చేసేది అదానీ, ఇతర కార్పొరేట్‌ కంపెనీలే. కచ్చితంగా 20 శాతం విదేశీ బొగ్గు వాడాలని కేంద్రం షరతు పెట్టింది. విదేశాల్లోని బొగ్గు గనులు అదానీవే. బొగ్గు రవాణా చేసే నౌకాశ్రయాలు అదానీవే. సోలార్‌ ఇతర విద్యుత్‌ ఉత్పత్తి చేసే కంపెనీలు అదానీ చేతిలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లు తయారు చేసే సంస్థలను అదానీ ప్రారంభించారు.
             విద్యుత్‌ సర్దుబాటు చార్జీలకు కారణం పాలకులే. బొగ్గు, ఇంధనం రేట్లు కార్పొరేట్లు పెంచుకొని, కృత్రిమ కొరత సృష్టించి కోట్ల రూపాయలు గడించుకోవటానికి ప్రభుత్వాలు అవకాశమిస్తాయి. వేసవి లోనూ, ఇతర సమయాల్లోనూ విద్యుత్‌ అదనంగా ప్రైవేట్‌ కంపెనీల నుంచి పంపిణీ సంస్థలు కొనుగోలు చేస్తాయి. రెండు, మూడు రూపాయలకు కొనాల్సిన విద్యుత్తును యూనిట్‌కు పది నుంచి రూ.20 వరకు కొంటారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నది. పాలకులు, నేతల జేబులు నిండుతున్నాయి. ఇటీవల రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగా హిందూజా సంస్థకు రూ.1200 కోట్లు చెల్లించింది. డబ్బు లేకపోతే అప్పు తీసుకోవడానికి అనుమతించి కౌంటర్‌ గ్యారెంటీ ఇచ్చింది. ఈ రూ.1200 కోట్లు మళ్ళీ సర్దుబాటు చార్జీల రూపంలో జనం నెత్తినే వేస్తారు. వ్యవసాయానికి, ఇళ్ళకు స్మార్ట్‌మీటర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ మీటర్ల కొనుగోలులో భారీ అవినీతి చోటు చేసుకుంటున్నది. అదానీ, పాలకుల అండతో మన రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని శాసిస్తున్న మరో కంపెనీ షిరిడీ సాయి సంస్థకు ఈ మీటర్ల సరఫరా కాంట్రాక్టు దక్కిందని వార్తలు వస్తున్నాయి. నెలకు రూ.120 చొప్పున ప్రతి ఇంటికి 10 సంవత్సరాలు పాటు 120 నెలల పాటు మీటర్‌ ఖర్చు జనం దగ్గర నుండే వసూలు చేస్తారు. మళ్లీ మీటర్‌ నిర్వహణ ఖర్చు అదనం. సెల్‌ఫోన్‌ మాదిరిగానే ముందుగా డబ్బు చెల్లించి విద్యుత్‌ వాడుకునే ప్రీపెయిడ్‌ పద్ధతి రాబోతున్నది. ఏ గంటలో ఎంత కరెంట్‌ వాడారో లెక్క తెలుస్తోంది. భవిష్యత్‌లో ప్రతీ గంటకూ విడివిడిగా విద్యుత్‌ రేట్లు నిర్ణయిస్తారు. అధిక విద్యుత్‌ వాడే సమయంలో అధిక రేట్లు ఉంటాయి. ఇలా కార్పొరేట్లను బాగు చేయటానికి, పాలకుల జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ప్రజలపై వివిధ రకాల పోట్లు పొడుస్తున్నారు. వై.సి.పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ పేదల ప్రతినిధి అని చెప్పుకుంటూనే పేదలపై అధిక భారం మోపుతున్నారు. అసలైన పెత్తందారులైన అదానీ తదితర కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు.
            కార్పొరేట్లకు అనుకూలమైన ఈ విద్యుత్‌ సంస్కరణల విషయంలో ప్రధాన పార్టీలు అందరిదీ ఒకటే దారి. మోడీ, బిజెపి ఇందులో కీలక పాత్ర. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం మోడీకి దాసోహం అంటోంది. ఈ విధానాలతో రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగానూ లబ్ధి పొందుతున్నది. గతంలో తెలుగుదేశం 2000 సంవత్సరం నుండి ప్రపంచబ్యాంకు సంస్కరణల పేరుతో విద్యుత్‌ రంగాన్ని మూడు ముక్కలు చేసింది. చార్జీలు పెంచింది. ప్రజల నిరసనలను ఎదుర్కొన్నది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకిస్తున్నా, విధానాల విషయంలో వారికి తేడా లేదు. కేంద్రం విధానాలకు మద్దతు ఇవ్వటంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయి. తొలి నుండి సిపిఎం, వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు ఈ విద్యుత్‌ సంస్కరణలను, భారాలను, ప్రైవేటీకరణ ప్రమాదాన్ని వ్యతిరేకిస్తూ నికరమైన పోరాటం సాగిస్తున్నాయి. సిపిఎం విద్యుత్‌ నియంత్రణ మండలిలో ప్రభుత్వ విధానాల బండారాన్ని ఎండగడుతూ ప్రత్యామ్నాయాలను ముందు ఉంచుతున్నది. గతంలో ప్రజల నిరసనను ఎదుర్కొన్న పాలక పార్టీలు ప్రజలను మభ్యపరుస్తున్నాయి. ముక్కలు ముక్కలుగా భారాలు వేస్తున్నాయి. సంక్షేమం ముసుగులో ప్రజల కళ్ళు కప్పుతున్నాయి. సచివాలయాలు, వాలంటీర్లు, పోలీసు వ్యవస్థ ద్వారా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కుల,మత ఇతర విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ప్రజల చైతన్యాన్ని నీరుగారుస్తున్నారు. అందుకే ప్రజలు వాస్తవాలు గమనించాలి. చైతన్యవంతులు కావాలి. తక్షణ భారాలతో పాటు దీర్ఘకాలిక ప్రమాదాన్ని గుర్తించాలి. ఎదుర్కోవాలి. తక్షణం పెంచిన ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల భారాలను పూర్తిగా రద్దు చేయాలి. వినియోగించుకున్న కరెంటుపై మళ్లీ మళ్లీ భారాలు వేసే ఈ పద్ధతిని రద్దు చేయాలి. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టరాదు. నివాస గృహాలకు స్మార్ట్‌ మీటర్ల అవసరం లేదు. అదానీ, కార్పొరేట్‌ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి. ప్రైవేటీకరణ విడనాడాలి. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్‌ కొనసాగాలి. లోపాలు సవరించుకోవాలి. ఈ అంశాల సాధనకై ప్రజలందరూ ఐక్యంగా కలిసిరావాలి.

/వ్యాసకర్త : సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
సిహెచ్‌. బాబూరావు

సిహెచ్‌. బాబూరావు