Nov 20,2022 08:03

మీలో ఆ మెరుపులను చూశాను
కొన్ని తెంపి నా గుమ్మంలో కట్టుకున్నా
అమ్మ చేసిన జొన్నరొట్టె
ఆకాశంలో మొలిచింది
రోజూ చూస్తూ కాలం గడుపుతున్నా..
కొన్ని మూలలు పల్కుతున్నాయి
నాలోంచి ప్రభాత గీతం పాడుతూ
మార్పు మననుంచే కోరుతూ..
ఉదయిస్తున్న మన నేత్రాల సాక్షిగా
ఒక్కొక్కరు వారి పాత మొహాలను
కోల్పోతూ రాలుస్తూ వెతుక్కుంటున్నారు
పాలపుంతలను తమలో..
ఆ కొమ్మలకు విషాద రాగాలు
పూచాయి కదా వేలాడుతూ
ఏ పరిపక్వతలనో గుంతల్లో
దాచుకున్నారు మరి!
తవ్వుకుంటున్నారు చంద్రుళ్ళను
వెన్నెల కాలువలై ప్రవహిస్తది అప్పుడు
తాగుతారు వెలుగు ద్రవాన్ని
ఇక విశ్వసిస్తారు వాస్తవాన్ని జాగరూకులై..
అప్పుడు రాలుతుంది ఆ రొట్టె
అమ్మ ఒడిలోంచి కురుస్తూ
ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ
దోసిళ్ళలో మహాప్రసాదంగా
నుదుళ్ళపై వినూత్న జీవితాలు
అని కొత్త కవిత రాస్తూ..
మానవాళి తమ లోపలి
గగనసీమను తడితో స్పృశిస్తూ
మురిసిపోతారు ముసిముసి నవ్వులతో
అందరూ ఒక సువిశాల మైదానంలో
పడుకుని ఆడుకుంటుంటారు లీలగా..
అప్పుడు క్రమంగా పడమటి కనుమలు
తూర్పు కిరణాలుగా బదిలీ అవుతూ
ఒక లేత ఎరుపురంగు సందేశాన్ని
పంపుతాయి పాడుతూ
రెప్పలపై మొక్కలను నిద్రలేపుతూ..

రఘు వగ్గు
9603245215