Feb 14,2023 12:25
  • తెలుగు మహిళల నిరసన

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ యువకుని చేతిలో హత్యకు గురైన అంధ బాలిక మృతదేహాన్ని సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ సందర్శించారు. ఆ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ వేధింపులపై ప్రశ్నించినందుకుగాను ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరుగకుండా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. బాధితులను బెదరగొట్టేలా మహిళలను ముందు పెట్టి టిడిపి నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు ఇది వేదిక కాదని, మహిళా కమిషన్‌ను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
 

                                             వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న టిడిపి తెలుగు మహిళా నేతలు

మృతురాలిని సందర్శించేందుకు వచ్చిన వాసిరెడ్డి పద్మను తెలుగు మహిళలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మహిళల హత్యలు పెరిగిపోతున్నాయంటూ విమర్శించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు పక్కకులాగేయడంలో పద్మ అక్కడి నుండి వెళ్లారు.
 

                                                                  ద్రిగ్భాంతి కలిగించింది : చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కంటిచూపులేని బాలికను వేధించడమే కాకుండా దారుణంగా హతమార్చడం తనను ద్రిగ్భాంతి కలిగించిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన బాలిక హత్య తనను షాక్‌కు గురిచేసిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం నివాస ప్రాంతంలో రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లపై స్వైరవిహారం రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ దుస్థితికి నిదర్శమని విమర్శించారు.
 

                                                             గాల్లో దీపంలా మహిళల రక్షణ : అనిత

రాష్ట్రంలో మహిళల రక్షణ గాల్లో దీపమైందని టిడిపి మహిళా అధ్యక్షులు వంగలపూడి అనిత విమర్శించారు. ఇందుకు తాడేపల్లిలో జరిగిన దారుణమే నిదర్శమని పేర్కొన్నారు. తాడేపల్లి ఘటనపై ఆమె జూమ్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వైసిపి అధికార ప్రతినిధిలా బాలిక కుటుంబంతో బేరసారాలకు దిగారని ఆరోపించారు.
 

                                                     ఆడబిడ్డలకు కొరవడిన రక్షణ : పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కొరవడిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. అంధ యువతి హత్యకు గురైన సంఘటన తనను కలచివేసిందని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కంటి చూపు లేని యువతిని వేధింపులకు గురి చేసి కిరాతకంగా నరికి చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఎపిని మార్చేశారని, శాంతి భద్రతల వైఫల్యం, ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళా సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు గళమెత్తాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. సిఎం స్పందించకపోవడం తగదు
 

                                                      బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : ఐద్వా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాడేపల్లిలోని ఎన్‌టిఆర్‌ కాలనీలో ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో అంధురాలైన దళిత బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకపోవడం తగదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తుమందు విచ్చలవిడిగా పెరగడమే బాలిక మరణానికి కారణమని అన్నారు. మద్యం, మత్తుమందును కంట్రోల్‌ చేయలేని ప్రభుత్వం ప్రజలపై నిర్భందాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి నివాసం పక్కన కూడా మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వ యంత్రాంగం నోరు తెరిచి న్యాయం కోసం అడిగితే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు సహాయం ప్రకటించాలని, ఇల్లు కట్టించి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏ విధమైన భరోసా ప్రభుత్వం ప్రకటించకుండా బాలిక మృతదేహాన్ని తరలించడానికి సిద్ధమైన పోలీసుల వైఖరిని ఐద్వా నాయకులు శ్రీనివాసకుమారి, గిరిజ, విజయ, తెలుగు మహిళా నాయకులు ఉషారాణి తీవ్రంగా ఖండించారు.