ఎందుకో వర్షం చూడాలంటే ఆసక్తి
ఎండిన హృదయం నిండుతున్నట్లు
అగ్గి కాసిన ఎండలో నీరు తాగుతున్నట్లు
ఎడారిలో ఆశ మొదలైనట్లు కనిపిస్తుంది.
చుక్క చుక్క మాట్లాడుతూ పలకరిస్తుంటే
నేల హృదయం పొంగి ఆహ్వానిస్తుంది
చిటపట చినుకుల సవ్వడి చెవుల్లో పడుతుంటే
సప్త స్వరాలు పలుకుతున్నట్లు తోస్తుంది...
చెట్టుపై నిలబడిన నీటి ముత్యాలను చూస్తే
విరగగాసిన పంటను చూస్తున్న ఆనందం
గూడులోని గువ్వ తొంగి చూస్తుంటే
వసంతం వచ్చిందన్న సంతోషం కలిగిస్తుంది..
నాకెందుకో చుట్టంలాగా పలకరిస్తున్నట్లు
నాకేదో తాయిలం తీసుకొని వస్తున్నట్లు
మానసిక రోగికి మట్టివాసనతో చికిత్స చేస్తున్నట్లు
పరదేశము నుంచి వచ్చినా
చుట్టంలా నిలిచింది..
నింగికి నేలకు ప్రచారం సాగిస్తుంది
వర్షపు మేఘము
ఉరుముల శబ్దముతో బయలుదేరుతూ
మెరుపుల విద్యుత్ బల్బులను తగిలించుకొని
ఆర్భాటం చేస్తూ అవనికి దిగుతుంది
వర్షపు చుక్కలు..
ఎప్పుడూ కురిసే వర్షమే అయినా
ఏదో కొత్తదనం
మనసును తట్టి లేపి పలకరిస్తూ కనిపిస్తుంది
నాలుగు చినుకులు గుమ్మరించిన
అదొక సంతోషం
తొలకరి చినుకులే
వలపుల పలుకులు కాబోలు..
ప్రకృతి వర్షం నీటి పువ్వుల్లాగా వాలుతుంది
రెక్కలతో దిగుతున్న నీటికొండ మాదిరిగా
ఆకాశములో అలుముకున్న
పర్వత సోయగాల లాగా
గడ్డగట్టిన సముద్రంలాగా
నింగిలో మెరుస్తుంది..
తనువుపై తుంపర్లు పడుతుంటే గిలిగింతలు
తడవాలని శరీరం తొందర పెడుతుంది
ఆకాశ గంగలో మునిగితేలాలనే భావనతో
తొలకరిని దోసిట్లో పట్టి
నమస్కరించాలనిపిస్తుంది..
కొప్పుల ప్రసాద్
98850 66235