Nov 27,2022 10:55

పువ్వు కాని పువ్వు.. గోబీ పువ్వు అని పొడుపు కథల్లో దాగి దోబూచులాడే కాలిఫ్లవర్‌ ఆరోగ్యదాయిని. దీనిలో బి, కె విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లూ, పీచు పదార్థం, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చలి కాలం మాత్రమే దొరికే ఈ కాలిఫ్లవర్‌ ఆహారంలో కూర, పచ్చడి రూపంలో చోటుచేసుకున్న వైనం మనందరికీ సుపరిచితమే. అయితే రానురాను ఎంతో ఇష్టంగా, అనేక రుచుల్లో దీనిని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆ రుచులు ఏమిటో తెలుసుకుందాం.

Varieties-with-cauliflower


                                                                       బిర్యానీ ..

కావలసినవి : బాస్మతి బియ్యం - కప్పు, క్యాలీఫ్లవర్‌, నీరు - 1-1/2 కప్పులు, నెయ్యి - 1/4 కప్పు, నూనె - తగినంత, ఉల్లిపాయలు- 3, టొమాటోలు- 2, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు - స్పూను, జీర -1/4 స్పూను, ఏలకులు - 2, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, ఉప్పు - తగినంత, జీడిపప్పు - 10, గరం మసాలా -1/2 స్పూను, జీరా పొడి -1/2 స్పూను, పుదీనా తరుగు -1/2 కప్పు, కొత్తిమీర తరుగు -1/2 కప్పు, ఉప్పు - తగినంత.
 

తయారీ :
బాండీలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, పొడవుగా కట్‌ చేసిన ఉల్లి చీలికలను, శుభ్రంచేసి చిన్న చిన్నగా విడదీసిన కాలిఫ్లవర్‌ ముక్కలను విడివిడిగా వేయించి, వేరు వేరు గిన్నెల్లో పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో అరగంట నానబెట్టిన బియ్యాన్ని దోరగా వేయించి, బియ్యాన్ని కుక్కర్‌ గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి ఉడికించాలి.
వెడల్పుగా ఉండి, అడుగు మందంగా ఉన్న పాత్రలో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన యాలుకలు, దాల్చినచెక్క, జీర, ఉల్లి తరుగు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి తరుగు వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఐదు నిమిషాలు వేగిన తరువాత గరం మసాలా, జీరా పొడి, ఉప్పు వేసి అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి నూనె అంచుల వెంబడి కనిపించినప్పుడు ముందుగా వేయించుకున్న గోబీ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, బాగా కలపాలి. దీనికి ముప్పావు వంతు ఉడికిన అన్నం కలిపి మూతపెట్టి, స్టౌ సిమ్‌లో పెట్టి, నాలుగు నిమిషాలు ఉడికిస్తే బిర్యానీ రెడీ అయినట్లే. స్టౌ ఆఫ్‌ చేసి గోల్డెన్‌ కలర్‌లో వేయించుకున్న ఉల్లి చీలికలు, జీడిపప్పు బిర్యానీపై అలంకరించి వడ్డించడమే.

 

 స్టఫ్డ్‌ పరోటా..


                                                                   స్టఫ్డ్‌ పరోటా..

కావలసినవి : గోధుమపిండి - కప్పు, తురిమిన క్యాలీఫ్లవర్‌ -100 గ్రా, ఉప్పు - తగినంత, చాట్‌ మసాలా - 1/2 స్పూను, తరిగిన వెల్లుల్లి - స్పూను, పర్చిమిర్చి తరుగు - స్పూను, కారం - 1/2 స్పూను, జీరా పొడి - 1/2 స్పూను, కొత్తిమీర తరుగు - 2 స్పూన్లు
తయారీ :
ముందుగా గోధుమపిండిని ఉప్పు, నూనె వేసి కలిపి గోరువెచ్చని నీటితో చపాతీ పిండి ముద్దలా కలుపుకుని, తడిగుడ్డ కప్పి అరగంట సేపు పక్కన ఉంచాలి.
కాలిఫ్లవర్‌ తురుములో కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక క్లాత్‌లో మూటలా గట్టిగా కట్టి నీటిని పిండేయాలి. వేరొక వెడల్పాటి గిన్నెలో కాలిఫ్లవర్‌ తురుము, ఉప్పు, కారం, చాట్‌ మసాలా, తరిగిన వెల్లుల్లి, పర్చిమిర్చి తరుగు, జీరా పొడి, కొత్తిమీర తరుగు వేసి, అన్నీ బాగా కలిసేలా కలపాలి.
చపాతీ పిండి ఉండను రౌండ్‌గా తట్టి, దాని మధ్యలో కాలిఫ్లవర్‌ మిశ్రమాన్ని ఉంచి బొటన వేలుతో తోస్తూ అంచులు కలపాలి. దానిని లోపలి పదార్థం బయటికి రాకుండా, నెమ్మదిగా చపాతీలా ఒత్తుకోవాలి. వేడిచేసిన పాన్‌ మీద రెండు వైపులా అర నిమిషం కాల్చుకున్న తరువాత వెన్న రాసి రెండువైపులా కాల్చుకుంటే స్టఫ్డ్‌ పరోటా రెడీ.

 

గోబీ 65


                                                                       గోబీ 65

కావలసినవి : బియ్యం పిండి - స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 2 స్పూన్లు, శనగ పిండి - స్పూను, ఉప్పు - తగినంత, పసుపు -1/4 స్పూను, కారం - స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, గరం మసాలా - స్పూను, నీరు
తయారీ : ముందుగా చిన్నవిగా విడదీసిన కాలిఫ్లవర్‌ ముక్కలను మరిగించిన నీటిలో రెండు నిమిషాలు ఉడికించి నీటిని పూర్తిగా వంపేయాలి. మరొక బౌల్‌లో పైన తెలిపిన పదార్థాలన్నీ నీటితో జారుగా కలపాలి. దీనిని ఉడికించిన కాలిఫ్లవర్‌ ముక్కలకు బాగా పట్టించాలి. బాండీలో నూనె వేడిచేసి కాలిఫ్లవర్‌ ముక్కలను పకోడీలా డీప్‌ ఫ్రై చేసుకుంటే గోబీ 65 రెడీ.
అడుగున మిగిలిన పిండిలో జీడిపప్పు, కరివేపాకు, నిలువుగా చీల్చిన నాలుగు పచ్చిమిర్చిలకు ఆ పిండిని పట్టించి, డీప్‌ ఫ్రై చేసుకుంటే సరి.