- చెన్నై - సూరత్ ఎక్స్‌ప్రెస్ వే రైతులకు పరిహారంలో అన్యాయం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : మార్కెట్ విలువ కోట్లల్లో ఉండగా పరిహారం మాత్రం లక్షల్లో చెల్లిస్తున్నారు. చెన్నై-సూరత్ ఎక్స్‌ప్రెస్‌వేకు భూములిచ్చిన కెర్నూలు జిల్లా రైతులకు పరిహారంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం చెన్నై రహదారిని సూరత్ రహదారితో అనుసంధానించేందుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. కర్నూలు జిల్లాలోని దిన్నెదేవరపాడు నుంచి ఆర్.కొంతలపాడు వరకు పది గ్రామాల మీదుగా 22 కిలోమీటర్ల మేర ఈ హైవే పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 400 మంది రైతుల నుంచి 321 ఎకరాలను సేకరించారు. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.మూడు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్లు ఉన్న దిన్నెదేవరపాడు, కల్లూరు, పందిపాడు, లక్ష్మీపురంలో హైవేకు భూములిచ్చిన రైతులకు రూ.21 లక్షలు మాత్రమే పరిహారంగా చెల్లిస్తున్నారు. ఎకరా రూ.రెండు కోట్లు విలువ ఉండి రెండు పంటలు పండే భూములున్న ఉల్చాల, బసాపురం, శింగవరం, ఎదురూరు, దుద్యాల, ఆర్.కొంతలపాడులో రైతులకు ఎకరాకు రూ.ఏడు లక్షలు నుంచి రూ.12.5 లక్షల పరిహారం ఇస్తున్నారు. మార్కెట్ విలువ కోట్లల్లో ఉన్న భూములకు నామమాత్రంగా పరిహారం ఇవ్వడంపై రైతు సంఘంతో కలిసి బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే ఆర్‌డిఎ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించారు.
ఇక్కడా అదే దారి...
కర్నూలు నుంచి డోర్నాల మీదుగా అమరావతికి నాలుగు లైన్ల రహదారి ఏర్పాటులో భాగంగా భూ సేకరణకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని బి.తాండ్రపాడు నుంచి గార్గేయపురం మధ్య ఐదు గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్లనుంది. రోడ్డు విస్తరణ కోసం దాదాపు 200 మంది రైతులకు చెందిన 150 ఎకరాలను సేకరించనున్నారు. ఈ భూముల విలువ ఎకరా రూ. కోటి వరకు ఉన్నా..ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.6లక్షలు మాత్రమే పరిహారం చెల్లించేలా అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
మార్కెట్ రేటు చెల్లించాలి
రైతుల నుంచి సారవంతమైన భూములను తీసుకున్న తరువాత ప్రభుత్వం మంచి పరిహారం ఇచ్చిందన్న భరోసా రైతుల్లో కల్పించాల్సిన అవసం ఉంది. లేకుంటే ప్రభుత్వంపై రైతులు నమ్మకం కోల్పోతారు. తక్కువ పరిహారం ఇవ్వడం అంటే రైతులకు అన్యాయం చేయడమే. మార్కెట్ విలువ ప్రకారమే బాధిత రైతులకు పరిహారం అందించాలి.
- రామకృష్ణ,
రైతు సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి










