వాళ్లకి కావాల్సింది అదే..!
ఆదివాసులు అడవులు విడిచి పోవాలి
రైతు భూమి విడిచి పోవాలి
వ్యవసాయం కనుమరుగై పోవాలి
వాళ్లకి కావాల్సింది అదే..!
గ్రామ గ్రామాలు ఖాళీ అయిపోవాలి
కూలీలు వలసలు పోవాలి
చేనేత కార్మికులు చెదిరిపోవాలి
కార్మిక హక్కులు కాల రాయాలి
వాళ్లకి కావాల్సింది అదే..!
కడలి పుత్రులు కనుమరుగై పోవాలి
చేతి వత్తుల వారు చితికి పోవాలి
చిన్న చిల్లర వ్యాపారస్తులు
నష్టాల ఊబిలో కూరుకు పోవాలి.
వాళ్లకి కావాల్సింది అదే..!
ఉపాధికై వెతుక్కోవాలి
యువత ఉన్న ఊరు వదిలి పోవాలి
నిరుద్యోగం ఆత్మహత్యలు పెరిగి పోవాలి
వాళ్లకి కావాల్సింది అదే..!
విద్యా, వైద్యం, వ్యాపారమై పోవాలి
బాల్యం బందీ అయిపోవాలి
వికాసం క్షీణించిపోవాలి
వాళ్లకి కావాల్సింది అదే..!
అజ్ఞానం, మతత్వం పెరిగిపోవాలి
మనుషుల్లో లౌకికతత్వం తగ్గిపోవాలి
కుల, మత, ప్రాంతీయ తత్వాలు పెరిగిపోవాలి
వాళ్లకి కావాల్సింది అదే..!
ఓటుకు నోటు రాజ్యంలో
అవినీతి, కుంభకోణాలతో
స్విస్ బ్యాంకు ఖాతాలు
డబ్బులతో నిండిపోవాలి
మా ఏలుబడి దశాబ్దాల తరబడి సాగిపోవాలి
కూడు, గూడు, గుడ్డ
విద్య, వైద్యం, ఉపాధి కావాలని నిలదీస్తే..
మా పాలనపై నిందలు వేస్తే.. ఎదిరిస్తే ..ఉద్యమిస్తే ..
ఉద్యమకారులు జైల్లో మగ్గిపోవాలి
వాళ్లకి కావాల్సింది అదే..!
వాళ్లకి కావాల్సింది అదే..!
- ఎస్. కె. బాజీ సైదా
88972 82981