పక్షులు అనగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. వాటిని అల్ప ప్రాణులుగా మనం భావిస్తాం. కానీ స్వల్ప వివరాల్లోనే వాటి ఘనత ద్యోతకమవుతుంది. ఇహ వలస పక్షుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. గగన తలంలో చిత్ర విచిత్ర రూపాల్లో కనువిందు చేస్తాయి. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల నుంచి నిర్ణీత ప్రాంతాలకు చేరుకొని ఆయా ప్రాంత ప్రజల మనసు దోచుకుంటాయి. అవి అక్కడ ఉన్నంతకాలం మా సొంతం అనే భావనను కలిగించి, వారితో బంధుత్వం నెరపుతాయి. అన్నీ తెలిసిన మనమే వెళ్ళాల్సిన ప్రదేశానికి అనేక గుర్తుల ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఎక్కడెక్కడి నుంచో పక్షులు సముద్రాలు, కొండలు, గుట్టలు, లోయలు ఒకటేమిటి ఎన్నింటినో దాటుకొని ఆయా వలస ప్రాంతాలకు చేరుకుంటుంటాయి. సమృద్ధిగా ఆహారాన్ని సంపాదించుకొని, వెచ్చని వాతావరణంలో ఆశ్రయం పొంది ఆస్వాదిస్తాయి. ఇది వలస పక్షుల సీజన్.
ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల నుంచి మనదేశానికి గుంపులు గుంపులుగా వచ్చే వలస పక్షుల కోసం పక్షి పరిశీలకులు ఉత్సాహంగా ఎదురు చూస్తూంటారు. అలా ప్రయాణించి సహజంగా ఒకే మార్గం ద్వారా వాటి నిర్ణీత ప్రదేశానికి చేరుకుంటాయి. అయితే ఏటా ఒకే మార్గంలో ప్రయాణించే వలస పక్షులు కొద్ది కాలంగా దారితప్పి పోతున్నాయి.
- ఏవియన్ వాగ్రెన్సీ..
ఒక అధ్యయనంలో ఇటీవలే వలస పక్షుల వివరాలను ప్రచురించిన సైంటిఫిక్ రిపోర్ట్స్ తెలిపేదేమంటే.. వలస వెళ్ళేటప్పుడు ఇలా దారితప్పి పోవడానికి భూమి అయస్కాంత క్షేత్రం పాక్షిక కారణమని, దీనిని 'ఏవియన్ వాగ్రెన్సీ' అని పిలుస్తారని వివరించింది.
కొన్ని సమయాల్లో తుఫానులు, మేఘాలు, దట్టమైన పొగమంచు కారణంగా పక్షులు దారి తప్పుతుంటాయి. అది సహజం. అయితే 'పక్షులు వాస్తవ భూ అయస్కాంత క్షేత్రాలను చూడగలుగుతాయనే ఆధారాలున్నాయి' అని అధ్యయన సహ రచయిత, లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన మోర్గాన్ టింగ్లీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ భూ అయస్కాంత క్షేత్రం ఆధారంగా అవి ప్రయాణించడం వల్లనే తరచుగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఇలాంటి పరిస్థితికి పక్షులు లోనౌతున్నాయి. పక్షులలోని మాగెటోరెసెప్టర్‌లు (భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే పరికరాలు) ఈ భూ అయస్కాంతక్షేత్రాన్ని గుర్తించ గలుగుతాయనేది పరిశోధనలలో తేలిన విషయం.
శాస్త్రవేత్తలు1960 నుంచి 2019 మధ్య కాలంలో152 పక్షి జాతుల గురించిన వివరాలతో విడుదలైన 2.2 మిలియన్ల రికార్డులను విశ్లేషించారు. అయస్కాంత క్షేత్రంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు భూ అయస్కాంత క్షేత్రాన్ని ఆధారంగా చేసుకొని, ప్రయాణించే పక్షుల సామర్థ్యం దెబ్బతింటుంది. భూ అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు అనేక అంతర్గత, బాహ్య కారకాలకు ప్రభావితమవుతుంది. భూ అయస్కాంత క్షేత్రంలో ఈ మార్పు సంభవించినప్పుడు పక్షుల మార్గం వక్రీకరించబడుతుంది. దాంతో అవి పూర్తిగా భిన్నమైన మార్గాలలో ప్రయాణిస్తాయని డాక్టర్ టింగ్లీ చెప్పారు.
ఆ సమయంలో తగిన ఆహారం, నివాస స్థలాలను కనుగొనడం వాటికి ఒక సవాలుగా మారుతుంది. అలాంటి ప్రయాణం పక్షులకు ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే వాతావరణ మార్పుల కారణంగా సహజమైన వాటి స్థావరాలు మారిపోనూవచ్చు.. లేదా మరింత అనుకూలమైన నివాసాలను చేరేందుకు దారితీయవచ్చు. ఇది పరిధి విస్తరణకు సంబంధించినది.
వసంత ఋతువు, శరదృతువులలో పక్షుల్లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. పక్షి పిల్లలు, పెద్ద పక్షులు భూ అయస్కాంత క్షేత్రంలో వాతావరణం, ఇతర అంశాలలో జరిగే మార్పులను తట్టుకోలేవు. మార్పులు అంటే వసంత ఋతువులో సూర్యుని నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రత.. అనుకోకుండా జరిగే సన్‌స్పాట్‌ల నుండి వెలువడే రేడియేషన్ వలన పక్షులలోని మాగెటోరెసెప్టర్‌లు పనిచేయవు. దాంతో భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించలేవు. అలా వాటి వలస మార్గం నుంచి తప్పిపోతుంటాయి. ఇలాంటి సమయంలో ఎన్ని సంవత్సరాల వలస అనుభవం ఉన్నప్పటికీ ఏమాత్రం పనికిరాదు.
'సూర్యుని నుండి వెలువడే అత్యధిక ఉష్ణోగ్రతా కార్యకలాపాలు, భూ అయస్కాంత క్షేత్రంలో కలిగే మార్పుల వలన వలస సమయంలో వేరే ప్రదేశంలో పక్షులు ఆగిపోవడం, లేదా చనిపోవడం సంభవిస్తుంది' అని అధ్యయన సహ రచయిత, పోస్ట్ డాక్టొరల్ విద్యార్థి బెంజమిన్ టోనెల్లి అన్నారు.
పక్షులపై నిర్వహించబడిన ఈ అధ్యయన ఫలితాలు తిమింగలాలు, ఇతర జంతువుల (నావిగేషన్) వలసలపై పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయని' డాక్టర్ టింగ్లీ అభిప్రాయపడ్డారు.