Dec 04,2022 08:49

పచ్చదనమే పుడమికి అందం. మొక్కలను చూస్తే మనకు ఆనందం. వాటి పువ్వులు అందరికీ నేత్రానందం. నర్సరీలు నెలకొన్న తర్వాత ప్రపంచంలోని అందమైన మొక్కలన్నీ అన్ని దేశాలలో, అనేక ప్రదేశాలలో మనకు దొరుకుతున్నాయి. అలాగే కొన్ని విదేశీ మొక్కలు కడియం నర్సరీలో చోటుచేసుకున్నాయి. ఈ వారం విరితోటలో వాటి గురించి తెలుసుకుందాం.

  • పోడోకార్ఫస్‌ మార్కోఫిల్లస్‌ ప్రింగ్లెస్‌ డ్వార్ప్‌..
1

దళసరిగా, లావుగా రెండు నుంచి మూడు అంగుళాల పొడవుంటుంది. ఆకులు గడ్డిపరకల్లా ఉండి గుచ్చాలుగా మొక్క నిండుగా విచ్చుకున్నట్టు ఉంటుంది. లేత గోధుమ, లేత పసుపు, ముదురాకుపచ్చ రంగుల్లో రకాలున్నాయి. చలికాలంలో పూసల్లాంటి రంగు రంగులు పువ్వులు పూస్తాయి. మొక్క నాటిన మూడేళ్లకు పువ్వులు పూస్తాయి. లేత, ముదురు నీలం, పింక్‌, లేతాకుపచ్చ పువ్వులు వివిధ రంగుల పూసలు గుచ్చినట్టు ఉంటాయి. ఆరడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు మిశ్రమం దీనికి అనుకూలం. మలేషియాకు చెందిన మొక్క.

  • గ్జాంథోస్టెమాన్‌ క్రైసాంథస్‌..
Valasa-mokkaloccayi

గ్జాంథోస్టెమాన్‌ క్రైసాంథస్‌నే మెట్రో సిడిసన్‌ కొలీనియా, ఈశాన్య క్వీన్స్‌ల్యాండ్‌ అని కూడా పిలుస్తారు. మైర్టాసియే దీని శాస్త్రీయ నామం. ఆకులు తమలపాకు ఆకారంలో ఉంటాయి. పూలు ఒక గుచ్ఛంలా వచ్చి, దానికి సన్నని కేసరాల్లాంటి రేఖలతో అందంగా ఉంటాయి. జామ పువ్వులా ఉంటుంది. పది పదిహేను చిన్నపువ్వులు కలిపి, ఓ గుత్తిగా విచ్చుకుంటాయి. సంవత్సరం పొడుగునా పువ్వులు పూస్తాయి. ఇది ఆస్ట్రేలియాకు చెందినది. దీన్ని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. లేత పసుపు, గులాబీ, ఎరుపు రంగుల్లో పువ్వులు పూసే మొక్కల రకాలు ఉన్నాయి. సీతాకోకచిలుకలకు ప్రీతి పాత్రమైనది.

  • బహునియా కాక్సో..
3

బహూనియా కాక్సో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. డ్వార్ప్‌ రకానికి చెందిన ఈ మొక్క కుండీలో పెంచుకోవచ్చు. ముదురు కాషాయం రంగు పువ్వులు.. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. శీతాకాలంలో పువ్వులు పూస్తుంది. అన్ని రకాల నేలలోనూ పెరుగుతుంది. ఇది ఉత్తర అమెరికాకు చెందిన మొక్క.

  • యూకా గ్లోకా..
4

అరేబియన్‌ దేశాలకు చెందిన మొక్క ఇది. కాక్టస్‌ మొక్కలా కనిపించినప్పటికీ, ఆకులు సన్నగా ప్లాస్టిక్‌ పుల్లలు మాదిరిగా 10 నుంచి 15 అంగుళాలు పొడవు ఉంటాయి. చివర్లు సూదిగా మొనదేలి ఉంటాయి. అవి రక్షక పత్రాలు. నీటి అవసరం తక్కువగా ఉంటుంది. డాసిలిరిన్‌ సెర్రాటిపోలియు దీని శాస్త్రీయ నామం. గిరిజన ప్రాంతాల్లో దీన్ని వైద్యానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వివిధ ఔషధాలు తయారుచేయడానికి దీని భాగాలను వాడతారు. దాంతో దీన్ని 'అడవి శతమూలి' అని పిలుస్తారు. మధ్యలోంచి ఒక గెలలాంటి మెత్తగా దూదిలాంటి పువ్వొకటి పింకు రంగులో వస్తుంది.