Aug 27,2023 08:49

కొండ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే కొన్ని రకాల చెట్లలో కలెక్కాయల చెట్టు కూడా ఒకటి. దీనిని వాక్కాయ, కరెండకాయల చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్లు సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఈ కాయలు పుల్లగా ఉండటం వల్ల పప్పు, పులిహోర చేసుకుంటారు. వానాకాలంలో మాత్రమే లభించే ఈ కాయల్లో ఔషధ గుణాలు మెండు. 'సి' విటమిన్‌ అధికంగా ఉండే ఈ పండ్లు మూత్ర నాళాలను శుభ్రపరుస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతాయి. మధుమేహం తగ్గించి, రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడంతోపాటు గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జామ్‌, జెల్లి తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు. అందుకే ఈ పండ్లను ఎన్ని రకాలు తయారు చేసుకోవచ్చో చూద్దాం.

చెర్రీస్‌

1

కావలసినవి : నీళ్లు- అర లీటరు, సున్నం (కిళ్లీలో వాడుకునేది)- 4 స్పూన్లు, వాక్కాయలు - పావు కేజీ (గట్టిగా ఉన్నవి), పంచదార- కేజీ, ఫుడ్‌ కలర్‌- కొద్దిగా, టిష్యూ పేపర్స్‌- ఐదు.
తయారీ : వాక్కాయలకు గాటు పెట్టి, లోపల విత్తనాలు తొలగించాలి. గిన్నెలో నీళ్లు పోసి, సున్నం వేసి కలిపి, పావుగంట ఉంచాలి. సున్నం అడుగుకు చేరి, నీళ్లను మాత్రమే పైన తేరుకుంటాయి. వాటిని వడకట్టి, గిన్నెలోకి తీసుకోవాలి. ఈ నీళ్లలో కాయలను ఎనిమిది గంటలు నాననివ్వాలి. తర్వాత వీటిని మంచినీళ్లల్లో నాలుగుసార్లు, గోరువెచ్చని నీటితో చివరిగా కడగాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నెపెట్టి గ్లాసు నీళ్లు పోయాలి. కాగాక, వాక్కాయలు వేసి, ఐదు నిమిషాల పాటు ఉడికించి, తీయాలి.
మొదటి రోజు : గిన్నెలో పంచదార వేసి, పావు లీటరు నీళ్లు పోసి, పొంగు వచ్చే వరకూ మరగనివ్వాలి. పొయ్యి మీద నుంచి దించి, కాయలను వేసి తిప్పాలి. ఇలా రోజంతా ఉంచాలి. మరుసటి రోజు కాయల్ని తీయాలి. ఒక గిన్నెలో అరకప్పు పంచదార వేసి, మరగనివ్వాలి. దీన్ని దించేసి, వాక్కాయలను వేయాలి. ఇలా రెండో రోజంతా ఉంచాలి. ఇలా నాలుగు రోజులు చేయాలి.
ఐదో రోజు : గ్లాసు పాకం గిన్నెలోకి తీసి, పొయ్యి మీద పెట్టాలి. మరుగుతున్నప్పుడు ఫుడ్‌ కలర్‌ వేసి తిప్పాలి. పొంగు వచ్చాక పొయ్యి మీద నుంచి దించి, కాయలను వేసి కలుపుకోవాలి. ఇలా ఐదు రోజులు పాటు పాకంలో ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆరో రోజు టష్యూ పేపర్స్‌లోకి కాయలను తీసి, పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. ఈ కాయలను గాజు జార్‌లోకి తీసి, నిల్వ చేసుకోవాలి. అంతే వాక్కాయ చెర్రీస్‌ రెడీ. ఇవి ఆరు నెలలు నిల్వ ఉంటాయి.

చికెన్‌

3

కావలసినవి : వాక్కాయలు-10/15 కాయలు, చికెన్‌-అరకేజీ, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- 4, ఉప్పు- 2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌స్పూను, ధనియాల పొడి- టేబుల్‌ స్పూను, గరంమసాల- టేబుల్‌ స్పూను, పసుపు- స్పూను, కారం- మూడు స్పూన్లు, నూనె- రెండు స్పూన్లు, కొత్తిమీర -గుప్పెడు.
తయారీ : వాక్కాయలను కట్‌ చేసి, లోపల గింజలను తీసేసి పేస్ట్‌ చేయాలి. మరొక జార్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి, వేయించాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి వేయించాలి. పచ్చివాసన పోయాక పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఇదీ పచ్చివాసన పోయాక, చికెన్‌ వేసి, నీరంతా ఇగరనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి కలిపి, మూత పెట్టాలి. చిన్నసెగ మీద పావుగంట మగ్గనివ్వాలి. గ్లాసు నీళ్లు పోసి, కొద్దిసేపు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత వాక్కాయ పేస్ట్‌ వేసి మొత్తం కలపాలి. మూత పెట్టి, మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే వాక్కాయ చికెన్‌ రెడీ!

పచ్చడి

3

కావలసినవి : వాక్కాయలు -1/4 కేజీ, కారం - 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - 3 టేబుల్‌ స్పూన్లు, పసుపు - పావు టేబుల్‌ స్పూను, మెంతి పిండి - అర టేబుల్‌ స్పూను, ఆవ పిండి- అర టేబుల్‌ స్పూను, వేరుశనగ నూనె - అర కప్పుడు, వెల్లుల్లి రెమ్మలు - పది.
తయారీ : శుభ్రం చేసుకున్న వాక్కాయలను మధ్యకు కట్‌ చేసి, లోపల ఉన్న విత్తనాలను తీసేయాలి. ఈ ముక్కలకు తడి లేకుండా క్లాత్‌తో తుడిచి, పావుగంట సేపు ఆరబెట్టాలి. వెల్లుల్లి రెమ్మలను మిక్సీ పట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి ఆవాలను, మెంతులను విడివిడిగా చిన్న మంట మీద దోరగా వేయించి, పౌడర్‌ చేసుకోవాలి. ఒక బౌల్లో పసుపు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి ముద్ద, నూనె వేసి మొత్తం కలుపుకోవాలి. చివరిగా వాక్కాయ ముక్కలను వేసి, మరోసారి బాగా కలపాలి. మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి. అంతే వాక్కాయ పచ్చడి రెడీ!