
'జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్' (న్యాయం ఆలస్యం చేయటం న్యాయాన్ని నిరాకరించినట్లే) అన్న నానుడి విశాఖ ఏజెన్సీలోని వాకపల్లి అత్యాచార కేసుకు వర్తిస్తుంది. దర్యాప్తు అధికారుల వైఫల్యం మూలంగా నేరం రుజువు కాలేదని తీర్పు స్పష్టం చేసింది. బాధిత ఆదివాసీ మహిళలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం నేరం జరిగిందన్న విషయాన్ని నిర్ధారించినట్టే ! గ్రేహౌండ్స్ పోలీసులపై కేసు కొట్టేసినప్పటికీ 11 మంది బాధిత మహిళలకు తగిన పరిహారం చెల్లించాలని తీర్పునివ్వడం బాధితుల వాంగ్మూలాలను కోర్టు నమ్మిందని స్పష్టమవుతోంది. ఇది బాధిత మహిళల నైతిక విజయం. కోర్టుకెక్కిన మహిళలకు తగు న్యాయం చేయలేకపోయినా వారికి అన్యాయం జరిగిందని మాత్రం న్యాయస్థానం సహా ప్రపంచం గుర్తించినట్టే. అసలు అత్యాచారమే జరగలేదని అన్ని స్థాయిల్లోని పోలీసు యంత్రాంగం, దర్యాప్తు అధికారులు, వారికి అండగా ప్రభుత్వ పెద్దలూ బుకాయించినా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మొక్కవోని పట్టుదలతో బాధిత మహిళలు పదహారేళ్లపాటు సుదీర్ఘ పోరాటం సాగించడం శ్లాఘనీయం. సాక్ష్యం చెప్పినవారిని, బాధితులకు మద్దతునిచ్చిన వ్యక్తులు, సంఘాలు, సంస్థలను పోలీసులు అదిరించి బెదిరించినా వాటిని తిప్పికొట్టి అన్ని విధాలా మహిళలకు అండదండలిచ్చి అటు ప్రజా ఉద్యమాన్ని ఇటు న్యాయ పోరాటాన్ని సాగించిన వారందరూ అభినందనీయులు.
'వాకపల్లి' విషయంలో తొలినుండీ జాప్యం, నిర్లక్ష్యం, సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం... ఇలా ఒకటేమిటి అన్ని విధాలా బాధిత మహిళలపట్ల పోలీసులు, ప్రభుత్వాధినేతలు కక్షపూరితంగా వ్యవహరించారు... కాదు కాదు నేరాన్ని కప్పిపెట్టడానికి శత విధాలా విఫలయత్నం చేశారు. నిందితులందరూ పోలీసులు కాగా కేసును పోలీసు అధికారులే దర్యాప్తు చేయడం సహజ న్యాయ సూత్రానికి సైతం విరుద్ధమైనది. వాకపల్లి మహిళలు 2007 ఆగస్టు 8న తమపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన 12 రోజులకు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన ఫలితంగానే ఆగస్టు 20న సెక్షన్ 376 (గ్యాంగ్‌రేప్) ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ చట్టం కింద పాడేరు పోలీసుస్టేషన్లో కేసు నమోదయింది. దోషుల్ని శిక్షించాలని, బాధిత మహిళలను ఆదుకోవాలంటూ ప్రజా సంఘాలు, వామపక్షాలు, మహిళా, మానవ హక్కుల సంఘాల పోరాటాలే లేకపోతే అసలు కేసు విచారణ దశకే వచ్చేది కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా లకే రాజారావు, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ బాధితులకు అండగా నిలిచారు. శాసనమండలిలో చర్చ లేవనెత్తి, వాకపల్లి విషయంలో ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టడంలో శర్మ కృతకృత్యులయారు. తుడిపేసిన సాక్ష్యాధారాలను వెలికితీయడం మొదలు బాధితుల తరఫున నికరంగా నిలిచి వాదించిన స్పెషల్ పి.పి సుంకర రాజేంద్రప్రసాద్, ఆయనకు సహకరించిన వసుధా నాగరాజ్ కృషి కొనియాడదగింది. తీవ్ర నేరాన్ని కప్పిపుచ్చి బుకాయించిన పోలీసులు, వారికి వత్తాసుగా నిలిచిన ప్రభుత్వానికీ వ్యతిరేకంగా వాకపల్లి మహిళలు వారికి అండదండలిచ్చి ఇటు ప్రజా క్షేత్రంలో అటు న్యాయస్థానాల్లో మరోవైపున కొంతైనా చట్టసభలో సాగించిన సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ తీర్పు అని చెప్పవచ్చు.
అత్యాచారానికి పాల్పడ్డ గ్రేహౌండ్స్ పోలీసులు కోర్టులో శిక్ష తప్పించుకున్నా సమాజం ముందు దోషులుగా మిగిలిపోయారు. వారు ఇప్పటికైనా పరివర్తన చెందాలి. అలాంటి విధులు నిర్వహించే పోలీసు, పారా మిలిటరీ దళాలకు చెందినవారు ఇటువంటి కీచక చర్యలకు ఎన్నడూ పాల్పడరాదు. దర్యాప్తు అధికార్లగా ఇలాంటి కేసుల్లో దర్యాప్తు ఎలా చేయరాదో అన్నదానికి ఆనందరావు, శివానందరెడ్డి ప్రతీకలుగా మిగిలారు. ఇకపై ఇలాంటి బాధ్యతల్లోకి వచ్చే వారెవరైనా ఈ ఉదంతం నుండి పాఠం నేర్వాలి. దోషులను బోనులో నిలబెట్టడానికి, బాధితులకు న్యాయం చేయడానికే దర్యాప్తు అని గుర్తెరగాలి. తీవ్రంగా నష్టపోయి, మానసిక సామాజిక క్షోభననుభవించిన బాధిత మహిళలకు ఈ తీర్పు కొంతైనా సాంత్వన కలిగించవచ్చు. ప్రజా ఉద్యమాలకు ఉద్యమకారులకు ఈ తీర్పు తప్పక ఊరటనిస్తుంది.