Sep 11,2022 08:10

రాఘవయ్య పట్టణంలో ఉన్న తన కుమారుడు విజరు ఇంటికి వచ్చారు. కోడలు సుప్రజ మామయ్యకు గ్లాస్‌తో చల్లని నీరు అందించి, 'మామయ్యా కూర్చోండి! నేను టీ తెస్తాను' అంటూ కిచెన్‌లోకి వెళ్లింది. ఇంతలో మనవడు అఖిల్‌ స్కూల్‌ నుంచి వచ్చాడు. తాతయ్యని చూసి, పలకరించి పుస్తకాలు బ్యాగ్‌ అక్కడే పడేసి లోపలికి వెళ్లిపోయాడు. అఖిల్‌ మూడో తరగతి. 'నానా అఖిల్‌! రా నాపక్కన కూర్చో' అని తాత పిలుస్తున్నా బయటికి రాలేదు. ఇంతలో సుప్రజ వచ్చి, టీ అందిస్తూ 'వాడంతే మామయ్య! ఎవరితోనూ కలవడు, సెల్‌ఫోన్లో గేమ్‌ ఆడుకుంటూ గది నుండి బయటకు రాడు, చెప్పి చెప్పి విసిగిపోతున్నాం' అంటూ అసలు విషయం చెప్పింది.
రాఘవయ్య మనవడి గదిలోకి వెళ్లాడు. వాడు సెల్‌ఫోన్లో ఆడుకుంటున్నాడు. తాతయ్య వచ్చాడన్న ధ్యాసే లేదు. తాతయ్య పిలుస్తున్నా పట్టించుకోలేదు. మనవడుని సెల్‌ఫోన్‌ ఉచ్చు నుంచి ఎలా అయినా బయటికి తేవాలని ఆలోచించాడు. స్నాక్స్‌, పాలు ఇచ్చినా సెల్ఫోన్‌ చూస్తూనే తిన్నాడు.
రాఘవయ్య కొడుకు విజరుకి ఫోన్‌చేసి 'నీవు ఆఫీస్‌ నుంచి వచ్చేటప్పుడు వైకుంఠపాళీ చార్ట్‌, గవ్వలు కొనుక్కొని రా' అని చెప్పారు. విజరు ఇంటికి వచ్చేటప్పుడు వాటిని తెచ్చాడు. రాత్రి భోజనాలయ్యాక అఖిల్‌ను రాఘవయ్య తన దగ్గరకు పిలిచి, 'మనిద్దరం ఒక ఆట ఆడుకుందామా?' అని అడిగాడు. ఆట అనగానే అఖిల్‌కు ఆనందం కలిగి 'అలాగే తాతయ్య! ఆడుకుందాం' అంటూ తాత పక్కన కూర్చున్నాడు. రాఘవయ్య వైకుంఠపాళి చిత్ర పటం పరిచాడు. 'మీ నాన్న కూడా మనతో ఆడతాడు' అని కొడుకు విజరుని పిలిచారు. విజరు కూడా కూర్చున్నాడు. వైకుంఠపాళిని చూసి 'ఇది సెల్ఫోన్లో స్నేక్స్‌ అండ్‌ లేడర్స్‌ గేమ్‌ లా ఉంది' అని అఖిల్‌ అన్నాడు. 'అవును అఖిల్‌! కానీ ఇప్పుడు మనం సెల్‌ఫోన్‌లో కాకుండా బయట ఆడతాం' అని తండ్రి విజరు అన్నాడు.
ఆట ప్రారంభించారు. ముందుగా అఖిల్‌కి గవ్వలిచ్చి వేయమన్నారు. అఖిల్‌ గవ్వలు గుప్పిట పట్టుకుని వేశాడు. మెల్లమెల్లగా పావులు కదపడం మొదలుపెట్టారు. అలా ముందుకు వెళ్తుంటే అఖిల్‌ పాము నోట్లో పడ్డాడు. వెంటనే దిగువకు వచ్చేశాడు. 'మీరంతా వేగంగా మీదకెళ్లిపోతున్నారు, నన్ను పాము మింగేసింది' అంటూ వాపోయాడు. అప్పుడు రాఘవయ్య 'అఖిల్‌! మనకి ఆటంకాలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని, మరల పైకి వెళ్లాలి. అదే వైకుంఠపాళీలో పాములు మనకు నేర్పే పాఠం. విజయం రాలేదని కుంగిపోకూడదు, అపజయాలని విజయానికి సోపానంగా మార్చుకోవాలి' అని చెప్పారు.
అఖిల్‌ నిచ్చెన ఎక్కాడు. ఇప్పుడు అందరికన్నా ముందుకు వెళ్లిపోయాడు. సంతోషంతో కేరింతలు కొట్టాడు. అప్పుడు రాఘవయ్య 'చూశావా! ఇంతకుముందు ఆటంకం ఎదురై పాము నోట్లో పడి కిందికి వెళ్లిపోయావు, మరల ఆటంకాలు అన్నీ దాటుకుంటూ వచ్చి, నిచ్చెన ఎక్కి మమ్మల్ని దాటావు. అదే జీవితం. నిత్యజీవితంలో పాముల రూపంలో ఎన్ని ఆటంకాలు మనకు ఎదురైనా.. వాటిని దాటుకుంటూ ముందడుగు వేయాలి.' అంటూ అఖిల్‌కి వైకుంఠపాళీ ఆట మర్మం చెప్పారు.
మెల్లమెల్లగా సెల్‌ఫోన్‌ గేమ్స్‌కి దూరం అయ్యాడు అఖిల్‌. రాఘవయ్య అఖిల్‌ నడవడికలో మార్పును గమనించి, ఆనందపడ్డాడు. కోడలు సుప్రజ రాఘవయ్యకు కృతజ్ఞతలు తెలియజేసింది.
మొర్రి గోపి
88978 82202