Nov 05,2023 11:33
  • అల్లూరి జిల్లాలో ఉత్సాహంగా బస్సు యాత్ర

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, రంపచోడవరం డివిజన్ల విలేకరులు : ఆదివాసీలకు పోడు భూములు పంపిణీ చేసి అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించి ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టి విలువైన బాక్సైట్‌, ఇతర ఖనిజ సంపదను అదానీకి అప్పగించాలని చూస్తోన్న మోడీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలోని రాజేంద్రపాలెం, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం మండలాల్లో సాగింది. ఆయా చోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో జాతీయ రహదారి కోసం ఆగమేఘాలపై వందల ఎకరాలకు అనుమతులు ఇచ్చిన అటవీ శాఖ పాడేరు, అరకు ఏజెన్సీ ప్రాంతంలో చిన్నచిన్న రహదారులకు అనుమతులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయని మోడీ ప్రభుత్వాన్ని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు పోటీపడి భుజానికెత్తుకొని మోస్తున్నాయని విమర్శించారు. పివిటిజిలకు అంత్యోదయ కార్డులు ఇవ్వడం లేదు సరికదా, ఇస్తున్న బియాన్ని ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. స్కీమ్‌ వర్కర్లకు సచివాలయ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీడి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి మోడీ ప్రభుత్వం నిధులు, పని దినాలు తగ్గిస్తోందన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మానవాభివృద్ధి సూచికలో ప్రథమ స్థానంలో ఉండగా, మోడీ, జగన్‌ ప్రభుత్వాలు వ్యాపారులకు సహాయం చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాయని వివరించారు. అభివృద్ధి అంటే ప్రజల ఆదాయాలు పెరగడమని, అదానీ, అంబానీ ఆస్తులు పెంచడం కాదని తెలిపారు. ప్రజా సమస్యలే అజెండాగా ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకు వెళ్తున్న కమ్యూనిస్టులను బలపర్చాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ జిఒ నెంబర్‌ 3కి చట్టబద్ధత, భూములు, సహజ వనరులపై పూర్తి హక్కు కల్పించేవరకు గిరిజనులు ఐక్యంగా పోరాడాలన్నారు. సభల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, ఎ.అశోక్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌, రైతు నాయకులు ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. అన్నిచోట్లా యాత్రా బృందానికి ఘన స్వాగతం లభించింది.
 

                                                            అల్లూరి, గంటందొర సమాధుల వద్ద నివాళి

యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి పార్కును యాత్రా బృందం సభ్యులు సందర్శించారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధుల వద్ద నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లూరి పార్కును పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పార్కులో పెద్ద స్మారక మందిరాన్ని నిర్మించాలని కోరారు. అల్లూరి భావజాలం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
 

                                                             గిరిజనుల భూములు లాక్కుంటే ఊరుకోం

గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి భూములను అప్పనంగా లాక్కుంటే ఎర్రజెండా చూస్తూ ఊరుకోదని వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రజారక్షణ భేరి యాత్రలో భాగంగా జికె.వీధి మండలం రంపుల గ్రామాన్ని ఆయన సందర్శించారు. రంపుల గ్రామం చుట్టుపక్కల కొత్తగా చేపట్టిన హైవే రోడ్డు విస్తరణలో తమ భూములు, పొలాలు, కాఫీ, పసుపు తోటలు, ఇళ్లు కోల్పోయామని బాధిత గిరిజనులు శ్రీనివాసరావు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. వినతిపత్రాలు అందజేశారు. తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
 

                                                   నిరాశపరిచిన కేబినెట్‌ నిర్ణయాలు : వి శ్రీనివాసరావు

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశపరిచాయని వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర అల్లూరి జిల్లాలోని చింతపల్లికి వచ్చిన సందర్భంగా శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజా కేబినెట్‌లో డిఎస్‌సిపైనా, గిరిజనులకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించే జిఒ నెంబర్‌ 3పైనా ప్రస్తావనే లేకపోవడం శోచనీయమన్నారు.
          ముఖ్యంగా మెగా డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం మంచి విషయమేనని, అయితే, కాలయాపన చేయకుండా ఎన్నికల ముందే వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్రంలో 300 పైచిలుకు మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నా, వాటిని తగ్గించి చూపడం దారుణమని, కరువు పరిశీలనకు కేంద్ర బృందాలు రాకపోవడం శోచనీయమని అన్నారు.