
- ప్రథమ బహుమతి రూ.30 వేలు
- జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్
ప్రజాశక్తివిజయనగరం టౌన్ : శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర, విజయనగరం ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఉత్తరాంధ్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి.ఈశ్వర్ కౌశిక్ తెలిపారు. ఆదివారం విజయనగరంలో సెట్విజ్ సీఈవో బి.రాంగోపాల్ తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుల ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో, మ్యాట్ పై పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.30 వేలు, ద్వితీయ రూ.20 వేలు, తృతీయ రూ.10 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నామని ప్రకటించారు. ఆసక్తిగల టీమ్ లు ఈనెల 26వ తేదీలోగా తమ ఎంట్రీలను పంపాలని కోరారు. క్రీడాకారులకు భోజన, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. వివరాలకు ఫోన్ 95733 63564, 80748 58972 నంబర్లను సంప్రదించాలని కోరారు. కబడ్డీతో పాటు వాలీబాల్, ఖోఖో, తైక్వాండో, కరాటే, స్విమ్మింగ్, హాకీ,రెజ్లింగ్,వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు,సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె.సూరిబాబు, క్రీడా సంఘాల ప్రతినిధులు బి.రామారావు, డి.అచ్యుతరావు, బాలకృష్ణ, సి.హెచ్.వి.ఆర్. రాజు, కె. తౌడుబాబు, కె.శంకరరావు, సూర్యారావు, ఎల్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.