
ఇప్పుడు రెండవ డిపిఆర్ ఆమోదించకుండా పెట్టుబడి అనుమతి ఇవ్వకుండా కేవలం 41.15 మీటర్ల ఎత్తు నిర్మాణానికి పరిమితం చేసే యత్నాలు సాగుతున్నాయి. అంటే 90 టియంసిలు నిల్వ చేస్తారు. ఈ నీళ్లు కుడి ఎడమ కాలువలకు గ్రావెటీ ద్వారా తరలించడం కుదరదు. పోలవరం ఎడమ కాలువ 'సిల్ లెవల్' 40.54 మీటర్లు మాత్రమే. అదే జరిగితే పోలవరం ప్రాజెక్టు నుండి గ్రావెటీ ద్వారా ఎడమ కాలువకు నీరు తరలించే అవకాశాలు వుండవు. ఈ నేపథ్యంలో విశాఖకు తాగునీరు గాని ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో సాగు, తాగు నీరు అందించేందుకు ప్రతిపాదించబడిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం సంగతేమిటి ?
పోలవరం రిజర్వాయర్ నిర్మాణ భవితవ్యం క్రమేణా ప్రమాదంలో పడుతోంది. 194 టియంసిల నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 320 టియంసిలు నీటి వినియోగం నుండి వంద టియంసిలు (ఒరిజినల్ రిజర్వాయర్‌లో యండిడియల్ స్థాయికి) నిల్వ చేయగల ఒక బ్యారేజీగా మిగిలి పోయే ప్రమాదం వస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. త్వరలో కేంద్రం పచ్చ జెండా ఊపవచ్చు. విషాదమేమంటే తొలుత ప్లానింగ్ కమిషన్ 2010-11 నాటి షెడ్యూల్ రేట్లతో 16010.15 రూపాయలు అంచనా వ్యయంతో ఆమోదించిన తొలి డిపిఆర్ తప్ప ఇన్నేళ్లు గడిచినా, పైగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడినా రెండవ డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఆమోదించ లేదు. అయితే ఇటీవల కాలంలో 41.15 (135 అడుగులు) మీటర్ల వరకే నిర్మాణం పరిమితం చేయబడుతుందని వస్తున్న వార్తలు వాస్తవమైతే తొలి దెబ్బ ఉత్తరాంధ్రపై పడుతుంది. విశాఖకు శాశ్వత తాగునీటి వసతి గల్లంతౌతుంది. దీనితో పాటు ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లా మెట్ట ప్రాంతాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వివరాల్లోకి వెళితే......
విశాఖ పట్టణానికి శాశ్వత తాగునీటి వసతి కోసం పోలవరం ప్రాజెక్టు నుండి 23.44 టియంసిల నీరు కేటాయించినారు. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 63.2 టియంసిలు గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు నుండి తరలించ వలసి వుంది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీటి సౌకర్యం సుజల స్రవంతి అమలు జరిగితే కల్పించబడుతుంది.
వీరందరికీ సాగు తాగు నీటి వసతి కల్పించకుండా పరి పాలన రాజధానితో ఉత్తరాంధ్రను ఏం ఉద్ధరించుతారు? పరిపాలన రాజధాని చేసిన తర్వాత సమూహమయ్యే లక్షలాది మందికి కనీసం తాగునీటి వసతి ఎలా కల్పించుతారు ?
ఇంతటి ప్రాధాన్యత గల అదీ చట్టబద్దంగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు రెండవ డిపిఆర్ ఆమోదం తదనుగుణంగా పెట్టుబడి అనుమతి మొన్న విశాఖ సభలో ప్రధాన మంత్రి మోడీ నోట నుండి నామమాత్రంగా కూడా రాలేదు.
పోలవరం ప్రాజెక్టు భవితవ్యం గురించి చర్చలు జరిగినపుడల్లా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ప్రకటిస్తున్నందుకు అభినందించాలి. ఎందుకంటే నిజం నిర్భయంగా చెబుతున్నారు. కాని కొసమెరుపు ఏమంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా ఇతర మంత్రులు డ్యాం సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ప్రోటోకాల్ సిద్ధాంతం తెర మీదకు తెస్తున్నారు. ఇదేమీ కొత్తగా కనిపెట్టబడలేదు. కొత్తగా ఏ ప్రాజెక్టులోనైనా నీటి నిల్వ చేసే సమయంలో విధిగా అమలు చేయ వలసినదే. కొత్త ప్రాజెక్టులను ఏకంగా నీళ్లతో నింపరు. దాని మాటున పోలవరం ప్రాజెక్టు కుదించడానికి యత్నించడం దారుణం. పోలవరం ప్రాజెక్టు రెండవ డిపిఆర్ ఆమోదించి ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చి దశల వారీగా నిధులు విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. రెండవ డిపిఆర్ ఆమోదించకుండా 41.15 మీటర్ల వరకే ఎన్నికల లోపు నిర్మాణం పూర్తి చేసి మమ అనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే వాస్తవమైతే పోలవరం ప్రాజెక్టు ఒక బ్యారేజీగా మిగిలిపోతుంది. పోలవరం ప్రాజెక్టు 45.72 (150 అడుగులు) మీటర్లకు నిర్మాణం జరిగితే నీటి నిల్వ సామర్థ్యం 194 టియంసిలు. ఇందులో యండిడియల్ (మినిమమ్ డ్రా డౌన్ లెవల్). 41.15 (135 అడుగులు) మీటర్లు మాత్రమే. ఈ స్థాయిలో కేవలం 119 టియంసిలు మాత్రమే వుంటాయి. ఇప్పుడు జరుగుతున్న కుట్ర ఏమంటే రెండవ డిపిఆర్ ఆమోదించకుండా పెట్టుబడి అనుమతి ఇవ్వకుండా కేవలం 41.15 మీటర్ల ఎత్తు నిర్మాణానికి పరిమితం చేసే యత్నాలు సాగుతున్నాయి. అంటే 90 టియంసిలు నిల్వ చేస్తారు. ఈ నీళ్లు కుడి ఎడమ కాలువలకు గ్రావెటీ ద్వారా తరలించడం కుదరదు. పోలవరం ఎడమ కాలువ ''సిల్ లెవల్'' 40.54 మీటర్లు మాత్రమే. అదే జరిగితే పోలవరం ప్రాజెక్టు నుండి గ్రావెటీ ద్వారా ఎడమ కాలువకు నీరు తరలించే అవకాశాలు వుండవు. ఈ నేపథ్యంలో విశాఖకు తాగునీరు గాని ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో సాగు, తాగు నీరు అందించేందుకు ప్రతిపాదించబడిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం సంగతేమిటి? కుడి కాలువ సిల్ లెవల్ కూడా 40.23 మీటర్లు మాత్రమే. తత్ఫలితంగా కుడి కాలువ ద్వారా కూడా గ్రావెటీ ద్వారా గోదావరి జలాలను తరలించే అవకాశం లేదు.
కాగా ఈ పాటికే వున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం కుడి కాలువకు గతి అవుతుంది. కాబట్టి ఉత్తరాంధ్రతో పోల్చుకొంటే కుడి కాలువ ప్రాంతం కొంత మెరుగు. ఎడమ కాలువకు చుక్క నీరు వెళ్లే అవకాశం లేదు.
(వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు,
సెల్ :9848394013)
వి. శంకరయ్య