
స్వరూప్‌కు ఆ ఉగాది రోజు తన భార్య రమణి గుర్తుకు వచ్చింది. రమణి చక్కగా సాంప్రదాయబద్దంగా ఉండేది. ప్రతి ఉగాదికీ ఉదయాన్నే లేచి తలంటుకుని, ముగ్గులేసి, ఉగాది పచ్చడి తయారుచేసి అందరికీ పెట్టేది.
తర్వాత రోజు పులిహోర, బొబ్బట్లు, పాలతాలికలు, గారెలు వండేది. రమణి ఉన్నంతకాలం స్వరూప్‌కు ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదు. స్వరూప్‌కు ఏమి కావాలో అన్నీ తనే చూసుకునేది. ఒకరోజు రమణి ఊరికెళ్లి వస్తుండగా తాను ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్ అయ్యి, స్పాట్‌లోనే చనిపోయింది. రమణి అకాల మరణం స్వరూప్‌ను కుంగదీసింది.
అప్పటికే వారికి వర్షిణి అనే మూడు సంవత్సరాల పాప కూడా ఉంది. స్వరూప్‌కు భార్య చనిపోయేనాటికి 30 సంవత్సరాల వయస్సు. స్వరూప్‌ను మళ్లీ వివాహం చేసుకోమని బంధుమిత్రులు చాలాసార్లు చెప్పి చూశారు. కానీ తన కుమార్తె వర్షిణి భవిష్యత్తునాలోచించి, పెళ్లి ఆలోచన మానుకున్నాడు స్వరూప్.
అంతేకాక స్వరూప్ అతనికి భార్య జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. పండుగలు, శుభకార్యాలు వచ్చినప్పుడు భార్య జ్ఞాపకాలు స్వరూప్‌ను మరింత కృంగదీసేవి.
అయితే స్వరూప్ తమ బంధువుల్లోనే భార్యను కోల్పోయి, పిల్లల కోసం రెండో వివాహం చేసుకున్నవారిలో చాలామంది ఎంత ఇబ్బందిపడుతున్నారో ప్రత్యక్షంగా చూశాడు.
రెండో భార్యగా వచ్చినవారు మొదటి భార్య పిల్లలను నానా ఇబ్బందులకు గురిచేయడం, హింసించడం తాను కళ్లారా చూశాడు.
అందుకనే తాను రెండో వివాహం చేసుకుంటే తనకు భార్య వస్తుంది కానీ, వర్షిణిని హింసలకు గురిచేస్తుందన్న భయంతో పెళ్లి ఆలోచనే రానిచ్చేవాడు కాదు.
అప్పటికే రమణి చనిపోయి పది సంవత్సరాలు అవుతోంది.
ఇప్పుడు వర్షిణికి 13 సంవత్సరాలు. ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లి లేనప్పటికీ ఏ లోటూ లేకుండా వర్షిణిని అల్లారుముద్దుగా పెంచాడు స్వరూప్.
ఆ రోజు స్వరూప్ స్నేహితుడు రాఘవ మాటల సందర్భంలో 'అరే.. స్వరూప్! ఆడపిల్లను పెంచడమంటే అంత తేలికైన విషయం కాదు. మన వర్షిణి కూడా వయసొచ్చిన పిల్ల. తన మనసులోని భావాలు మనతో స్వేచ్ఛగా చెప్పుకోలేదు. అదే ఇంట్లో ఇల్లాలు ఉంటే కూతురుకి ఏం కావాలో అడిగి తెలుసుకుంటుంది. నీకు భార్య అవసరం లేకపోయినా వర్షిణిని గైడ్ చేయడానికి ఒక అమ్మ కావాలిరా..! అన్ని విషయాలూ వర్షిణి నీతో చెప్పుకోలేదు.. నువ్వూ వర్షిణికి చెప్పలేవు. నా మాట విని ఓ మంచి అమ్మాయిని చూసి, పెళ్లి చేసుకో' అని అన్నాడు.
రాఘవ మాటలకు స్వరూప్ ఆలోచనలో పడ్డాడు.
'సరే ఆలోచించి చెబుతా!' అన్నాడు స్వరూప్.
ఆ రోజు ఏదో అవసరంపై పక్క బజారులోని సుబ్బారావు ఇంటికి వెళ్లాడు. సుబ్బారావుకు కూడా తనలాగానే భార్య చనిపోయింది. 10 సంవత్సరాల కూతురు సుప్రజ ఉన్నా కానీ సుబ్బారావు, నాగలక్ష్మి అనే ఆమెను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్లకు కళ్యాణ్ అనే కొడుకు పుట్టాడు.
స్వరూప్ వెళ్లేసరికి నాగలక్ష్మి సుప్రజను భయంకరంగా తిడుతూ ఉంది. స్వరూప్‌ను చూసి తిట్లు ఆపి, లోపలికి వెళ్లిపోయింది.
'నీ కూతురిని అంత భయంకరంగా తిడుతుంటే మాట్లాడకుండా ఉంటావేమిరా? కనీసం తండ్రిగా ఆమెను తిట్టొద్దని మందలించాలి కదరా! పాపం చూడు సుప్రజ కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని ఎంత బాధపడుతుందో..!' అన్నాడు స్వరూప్.
'ఈ విషయంలో నేను అశక్తుడినిరా..! మొదట్లో మందలించేవాడిని. కానీ అలా మందలించడం వల్ల సుప్రజని టార్చర్ పెట్టడం ఎక్కువ చేస్తుంది. అలిగి ఏ పనీచేయక, ఇంటిపనంతా సుప్రజపై వేస్తుంది. అందుకనే నాగలక్ష్మి తిట్టే తిట్లను మౌనంగా భరిస్తున్నానురా. నేను మళ్లీ పెళ్లి చేసుకుని ఎంత పెద్దతప్పు చేశానో ఇప్పుడు అర్థం అవుతోంది నాకు..' తలపట్టుకుని రోదిస్తూ అన్నాడు సుబ్బారావు.
స్వరూప్ సుబ్బారావును భుజం తట్టి ఓదార్చి 'సరే నేను మళ్లీ వస్తాన్రా' అంటూ వెనుదిరిగాడు.
ఆ క్షణానే స్వరూప్ ఒక బలమైన నిర్ణయానికి వచ్చాడు.
ఇంకెప్పుడూ రెండో పెళ్లి ఆలోచన చేయకూడదని.
ఇంటికొచ్చిన స్వరూప్ తన కుమార్తె వర్షిణిని పిలిచాడు.
కుమార్తె తల నిమురుతూ అడిగాడు స్వరూప్
'ఎలా చదువుతున్నావమ్మా..! నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అని.
'బాగానే చదువుకుంటున్నాను నాన్నా..! నాకేం ఇబ్బందులు లేవు.. హ్యాపీగానే ఉన్నా' అంది వర్షిణి.
'నీకేమన్నా ఇబ్బందులుంటే నాకు చెప్పు.. నాకు చెప్పడానికి మొహమాటంగా ఉంటే అమ్మమ్మకో, అత్తకో, పెద్దమ్మకో, అమ్మమ్మకో చెప్పమ్మా..! మనసులో పెట్టుకుని బాధపడకు..' అన్నాడు స్వరూప్.
'అలాగే నాన్నా' అంటూ తలాడించింది వర్షిణి.
ఆ రోజు పట్నం వెళ్లి పొలానికి మందులు కొని, లాస్ట్ బస్‌కు తిరిగి వస్తున్నాడు స్వరూప్.
వెనుక సీట్లో ఇద్దరు మధ్య వయస్సు వాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
'అరే మామ.. డబ్బులు పోతే పోయాయిగానీ..' అని ఒకడంటే..
'అవున్రా మామా! సంవత్సరం అంతా కష్టపడతాం. అప్పుడప్పుడు అమలాపురం వెళ్లొస్తే కష్టం అంతా మర్చిపోతాంరా.. అబ్బ! ఎంత అందంగా ఉన్నార్రా.. అమ్మాయిలు..' అన్నాడు ఇంకొకడు. ఇలా ఏదేదో మాట్లాడుకుంటున్నారు.
స్వరూప్‌కి అర్థమైంది వాళ్లు ఏం మాట్లాడుతున్నదీ. వాళ్ళు తాగి ఉన్నారని, వేశ్యల గురించి మాట్లాడుతున్నారని గ్రహించి, వారికి దూరంగా వేరే సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
స్వరూప్ కొన్ని రోజుల తర్వాత పనిమీద మళ్లీ పట్నం వెళ్లాడు.
వెళ్లిన పని పెందలాడే అయిపోయింది.
ఆ రోజు బస్సులోని వ్యక్తులు వేశ్యల గురించి మాట్లాడుకోవడం అతనికి గుర్తొచ్చింది. బుద్ధి కొంచెం వంకరగా ఆలోచించింది. 'తాను ఎలాగూ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. వయసూ అయిపోలేదు. ఒక్కసారి అమలాపురం వెళ్లొస్తే...?' అనిపించింది.
అనుకన్నంతనే అమలాపురం బయలుదేరాడు. బస్ దిగగానే ఆటో మాట్లాడుకుని వేశ్యావాటికకు వెళ్లాడు.
స్వరూప్‌కు అంతా వింతగా, కొత్తగా ఉంది. అక్కడ పరిస్థితి చూసి. యువతులు, మధ్య వయస్సు స్త్రీలు వాకిట్లో నిలబడి.. విటులను ఆకర్షిస్తూ సైగలు చేస్తున్నారు.
స్వరూప్ ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ముందుగా డబ్బులు కట్టించుకుని, లోపలికి పంపారు. లోపల చాలా గదులున్నాయి.
ఒకామె 'ఇక్కడకు రావడం ఇదే మొదటిసారా?' అని అడిగింది. అవునని అర్థం వచ్చేలా తలూపాడు స్వరూప్.
ఆవిడ ముసిముసిగా నవ్వుతూ ఓ గదిని చూపింది.
ఆ గది తలుపు దగ్గరకు వేసి ఉంది. తలుపు తీయడానికి మొహమాటపడుతూ నిలుచున్నాడు స్వరూప్.
ఆమె నవ్వుతూ 'లోపల కస్టమర్ ఎవరూ లేరు. తలుపు దగ్గరకు వేసుంది అంతే..! తలుపును తోయండి తెరుచుకుంటుంది' అని చెప్పింది.
స్వరూప్ నెమ్మదిగా తలుపు తోసి, లోపలికి తొంగి చూశాడు.
లోపల తెల్లచీర కట్టుకున్న పసిమిఛాయ స్త్రీ ఒకామె కొంగు కప్పుకుని ఉంది. తనను చూడగానే సిగ్గుతో తలవంచుకుంది.
స్వరూప్‌కు గుండెల్లో దడ మొదలైంది. చిన్నగా ఆమెను సమీపించి, ముఖంపై ఉన్న ముసుగును తొలగించి చూశాడు. ఆమెది అద్భుత సౌందర్యం.
స్వరూప్ ఆమెను పేరు అడిగాడు.
'వసంత' అని సిగ్గు పడుతూ చెప్పింది ఆమె.
స్వరూప్ ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు.
ఆమె అవేవీ పట్టించుకోకుండా.. తన పైట కొంగు కిందకు జార్చింది. కౌగిలిలోకి రమ్మంటూ చేతులు ముందుకుచాపి, సైగ చేస్తూ 'మీరు త్వరగా మీ పని పూర్తి చేసుకుంటే, నేను సరుకులు తీసుకుని ఇంటికెళ్లి, మా పాపకు భోజనం వండిపెట్టాలి' అంది.
ఆ మాటతో మనసు చలించిన స్వరూప్‌కు కళ్లు చమర్చాయి. వివేకం వెన్ను తట్టింది. ఆమె భుజంపై చేయి వేయబోతూ ఆగిపోయాడు. ఒక్క అడుగు వెనక్కి వేసి, కిందకు వంగి జారిన ఆమె పైటను నిండుగా కప్పి.. కుర్చీలో కూర్చుంటూ.. 'ఇప్పుడు చెప్పండి మీరు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు?' అని అడిగాడు.
'నేను బ్రతకడానికి ఏ పనులూ లేనప్పుడు ఆకలితో అలమటించలేక.. మా పాప స్రవంతిని పోషించుకోవడం కోసం అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంటాను. నాకు ఈ చోటును మా పేటలోని ఒకామె చూపించింది.
ఏడాది క్రితం వరకూ నేను మా కుటుంబంతో ఆనందంగా ఉండేదాన్ని. మా ఆయన మార్బుల్స్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు. బిజినెస్ పార్టనర్స్ ఆయనను మోసం చేశారు. అప్పులపాలైన ఆయన ఒకరోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుడు అప్పులవాళ్లు ఇంటిని చుట్టుముట్టారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఉన్నవన్నీ అమ్మినా అప్పు తీరలేదు. నేను ఫ్యాక్టరీలో పనులకు వెళ్తూ కొంత అప్పు తీర్చా. ఎక్కడ పనికి వెళ్లినా నాతో పడకసుఖాన్ని కావాలంటూ నన్ను టార్చర్ పెడుతూ ఉండేవాళ్లు. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ ఉద్యోగాలు మానేస్తూ వచ్చా. ఆ తర్వాత వ్యవసాయ పనులకు వెళ్తూ నా కూతురిని కాన్వెంట్‌లో చేర్పించి, చదివించుకుంటున్నా. అయితే ఆ వ్యవసాయ పనులు కూడా కరువయ్యాయి. నాలుగు రోజులు పస్తు ఉన్న తర్వాత, ఒకరోజు మా వీధిలోని ఒకామె నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా, తప్పని తెలిసినా.. తప్పనిసరై వచ్చాను' అంది వసంత ఏడుస్తూ.
'సరే.. మీ ఇంటికి పోదాం పదండి' అన్నాడు స్వరూప్.
ఆమె మౌనంగా చీర సవరించుకుని, బయలుదేరింది.
వేశ్యాగృహ నిర్వాహకురాలు ఆమెకు కొంత డబ్బు చేతిలోపెట్టి 'నీకు డబ్బు అవసరం అనిపించినప్పుడు వస్తూ ఉండు.. కుర్రాళ్లు నీలాంటి అందగత్తె అంటే పడిచస్తారు' అంది.
'అలాగే' నన్నట్టు తలాడించింది వసంత.
వసంతతో పాటు బయలుదేరిన స్వరూప్ దారిలో కిరాణా షాపులో సరుకులు, బియ్యం కొని, వసంతను వాళ్ల ఇంటిదగ్గర దింపాడు. తాను ఆటో దిగబోతూ ఉంటే వసంత వారించింది.
'ఇక్కడి వారికి నేను మర్యాదగా బతుకుతున్నాననే ఒక మంచి అభిప్రాయం ఉంది. దయచేసి దానిని పోగొట్టకండి. మాకు సరుకులు కొనిపెట్టి, మా ఆకలి తీరుస్తున్నందుకు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ చేతులు జోడించి.. కళ్లనీళ్లు పెట్టుకుంది.
ఇంటికి చేరే వరకూ స్వరూప్ వసంత గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు.
అనూహ్యంగా ఆరోజు స్వరూప్ వసంత ఇంటికి పూలు, పళ్ళు, చీరతో వచ్చాడు.
వస్తూనే వసంతకు అందించాడు.
'అయ్యగారు.. దయచేసి ఇంటికి రాకండి. చుట్టుపక్కల వాళ్లు విచిత్రంగా చూస్తారు. మీకు నేను కావాలనుకుంటే మీరు ఇదివరకు వచ్చిన వేశ్యాగృహానికి వెళ్లి అడగండి. వాళ్లు నాకు కబురు చేస్తారు. అప్పుడు నేను వస్తాను' అంది వసంత.
'లేదు వసంతా నీకు ఇష్టమైతే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం..!' అని తన గురించిన పూర్తి వివరాలామెకు చెప్పాడు.
'నేను అపవిత్రురాలిని.. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీరు అభాసుపాలవడం నాకు ఇష్టంలేదు. అయినా నాకు ఒక కూతురు ఉంది. తనను మీరు సొంత కూతురిలా చూసుకోగలరా?' ప్రశ్నించింది వసంత.
'ఓహో నీ భయం అదా? నేను, నువ్వు వర్షిణిని, స్రవంతిని మన పిల్లలుగా చూసుకుందాం. బాగా పెంచుదాం. చక్కగా చదివిద్దాం. నీ, నా అని కాకుండా మన కుటుంబంగా ఉందాం. సరేనా..?' అన్నాడు స్వరూప్.
సరేనని తలూపింది వసంత.
పదిరోజుల తర్వాత స్వరూప్, తన స్నేహితులతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. నలుగురు దగ్గర బంధువులు, చుట్టుపక్కల వారితో కలసి వెళ్ళి, స్వరూప్‌ను వివాహం చేసుకుంది స్రవంతి. ఆ రోజు స్వరూప్ తెచ్చిన చీరను ఆనందంగా కట్టుకుంది.
ఇన్నాళ్లూ సమాజానికి భయపడుతూ బతికిన ఆమెలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. తమ జీవితాలను తామే పునర్న్మించుకునే దిశలో అడుగు ముందుకు వేసింది.
ఇంటి దగ్గర వర్షిణి తండ్రి రాకకోసం హారతి పట్టుకుని ఎదురుచూస్తూ ఉంది.
స్వరూప్, వసంత దంపతులకు వర్షిణి హారతి ఇచ్చి, ఆహ్వానం పలికింది. వారి వెనుకనే ఉన్న స్రవంతిని 'రా.. చెల్లి!' అంటూ సాదరంగా ఆహ్వానించింది వర్షిణి.
'ఈ శుభకృత్ ఉగాది మన నలుగురి జీవితాల్లో కోల్పోయిన ఆనందాన్ని మరలా ఇచ్చింది' అన్నాడు స్వరూప్ వసంతను, ఇద్దరు కుమార్తెలను దగ్గరకు తీసుకుంటూ.
స్రవంతికి తండ్రిలేని లోటు తీరింది. వర్షిణికి తల్లి లేని లోటు తీరింది. ఒకప్పుడు రెండో పెళ్లి భూతం అని భయపెట్టిన సమాజమే.. ఈ రోజు ఆ ఆదర్శ కుటుంబాన్ని చూసి అభినందించింది.
భావశ్రీ
8106586997