
'దేవదానం, సత్యమూర్తి, కైలాష్ వీళ్లంతా ఎలా చనిపోయారు? నలభై ఏళ్లకే చనిపోవడం ఏమిటి? అంతా విచిత్రంగా ఉంది. ఆ రోజుల్లో మనం ఐదుగురమే ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లం కదా? వాళ్లు చనిపోయారన్న విషయం ఇంతవరకూ నాకు తెలియకపోవడం చాలా బాధగా ఉంది. ఇంతకూ ఏమి జరిగింది?' అని అడిగాడు విశాల్.
ఢిల్లీలో అగ్రికల్చరల్ సైంటిస్ట్‌గా పనిచేస్తూ, పదో తరగతి విద్యార్థుల బ్యాచ్ సిల్వర్ జూబిలీ ఉత్సవంలో పాల్గొనడానికి సిరిపల్లి వచ్చిన విశాల్‌కి పాత మిత్రులను, టీచర్లను చూసుకొని పొంగిపోవాలో, బాల్య స్నేహితుల మరణానికి కుంగిపోవాలో తెలియని పరిస్థితి ఎదురైంది.
జరిగినదంతా వివరించాడు పరమాత్మ. సుమారు పదిహేనేళ్లక్రితం ఆ ఊరికి 'సిద్ధేశ్వర్ బాబా' వచ్చి ఆశ్రమం నెలకొల్పడంతో ఆ ఊరి రూపురేఖలు మారిపోయాయి. అప్పటినుంచీ ఎన్నో అద్భుతాలు జరగడం ప్రారంభమైంది. శివాలయంలో రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు, ఒక నాగుపాము గర్భగుడిలోకి ప్రవేశించి, శివుని పాదాల వద్ద ఉంచిన కోడిగుడ్డును ఆరగించి, వచ్చిన దారినే వెళ్లిపోవడం చాలా ఏళ్లుగా జరుగుతూ వస్తుంది. ఆ వింతను చూడడానికి రోజూ ఐదారు వందలమంది భక్తులు వస్తూ ఉండడంతో, ఆ గుడి చుట్టూ ఎన్నో షాపులు, హోటళ్లు వెలిసి, ఆ ప్రాంతమంతా రద్దీగా తయారయ్యింది.
ఏటా, ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు, అర్ధరాత్రి పన్నెండు గంటలకు, ఊరి అవతల ఉండే దుర్గగుడిని ఆనుకుని ఉన్న కొండమీద మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. ఆ పండగనాడు ఆ ఊరికి వేల సంఖ్యలో జనం వస్తారు. ఇవికాక బాబా ఆశ్రమంలో ఎన్నో అద్భుతాలు ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఆయన భగ భగ మండే నిప్పుల మీద నడుస్తారు. ఆయన శిష్యులు నీళ్ల మీద నడుస్తారు. సలసలా కాగే నూనెలో చేయిపెట్టి, దానిలో వేగుతున్న గారెలనో, జిలేబీలనో తీసి, భక్తులకు ప్రసాదంగా పంచుతారు. బాబా, గాలిలోంచి విభూతిని, ఉంగరాలను, గొలుసులను సృష్టించి, తన ప్రియమైన భక్తులకు ఇస్తారు. ఆ ఆశ్రమంలో ఎన్నో సేవలు అందుతూ ఉంటాయి. ఉచిత వైద్య సేవలు, నిత్యాన్నదానం అక్కడ రోజూ జరిగే కార్యక్రమాలు. ఎందరో అనాథ పిల్లలను బాబా చదివిస్తూ ఉంటారు. అనేకమంది వృద్ధులకు అక్కడ ఆశ్రయం ఉంటుంది. తమ ఊరు బాగుపడడానికి, ఊర్లో జరిగే అద్భుతాలకు బాబాయే కారణమని ఊరి ప్రజలు ఆయన్ని కలియుగ దైవంలా కొలుస్తారు. కానీ బాబా అంటే గిట్టనివాళ్లు కూడా ఆ ఊళ్లో ఉన్నారు. వాళ్లలో ముఖ్యులు దేవదానం, సత్యమూర్తి, కైలాష్. వాళ్లు ముగ్గురూ మూడు రకాలుగా ఊర్లో జరుగుతున్న అద్భుతాలమీద, బాబా మహిమల మీద ధ్వజమెత్తారు.
ముందుగా రంగంలోకి దిగింది కైలాష్. చదువు పూర్తయ్యాక, ఆ ఊర్లోనే చిన్న వ్యాపారం పెట్టుకొని, భార్యాపిల్లలతో ఆనందంగా జీవిస్తున్న కైలాష్, ఊరి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అతను ముందుగా దృష్టి పెట్టింది, శివాలయంలో జరిగే అద్భుతం మీదే. నాగుపాము తనంతట తాను, క్రమం తప్పకుండా అదే సమయానికి రావడం దేవుడి మహిమ కాదని, దాని వెనుక ఏదో మోసం ఉందని గట్టిగా నమ్మాడు. అదేమాట అనేకమందితో చెప్పాడు. దానికి తగ్గ ఆధారాలు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. రేపో మాపో ఆ మోసాన్ని బట్టబయలు చేస్తాడు అన్న పుకార్లు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత రెండురోజులకే అతను పాము కాటుతో మరణించడంతో ఊరంతా దిగ్భ్రాంతి చెందింది. పరమశివుడి ఆగ్రహానికి బలైపోయాడని అందరూ గట్టిగా నమ్మారు.
కైలాష్ మరణించిన నాలుగు నెలలకు సత్యమూర్తి కూడా ప్రాణాలు వదిలాడు. సత్యమూర్తి తను చదివిన హైస్కూల్లోనే సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్యాపిల్లలు పట్నంలో ఉంటే, తను మాత్రం ఆ ఊరిలోనే పెద్ద ఇల్లొకటి అద్దెకు తీసుకొని, ఆ ఇంట్లో ఒక సైన్స్ లేబొరేటరీ పెట్టుకున్నాడు. ఖాళీ సమయాల్లో స్కూల్ పిల్లలకు రకరకాల ప్రయోగాలు చేసి చూపిస్తూ, వాళ్లలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేవాడు. అంతేకాకుండా బాబాలు, స్వామీజీలు చూపిస్తున్నవి అద్భుతాలు కావని, అవన్నీ సైన్స్‌ని ఉపయోగించి చేస్తున్న మేజిక్కులేనని చెబుతూ, కొన్ని ప్రయోగాలు కూడా చేసి చూపించేవాడు. ఆ విధంగా పిల్లలను చైతన్య పరచడం, వాళ్ల తల్లిదండ్రులకు కొరుకుడుపడలేదు. వాళ్లు హేతువాదులుగా, నాస్తికుల్లా మారతారని, మన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు దూరమైపోతారని, అన్నింటికన్నా మించి తాము దేవుడిలా కొలిచే బాబా పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారని భయం పెంచుకున్నారు. అలా వారంతా సతమతమవుతున్న సమయంలో లేబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సత్యమూర్తి కాలి, బూడిద అయిపోయాడు. ఇది తెలియడంతో వాళ్లంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. లేబొరేటరీలో ఉన్న కెమికల్స్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో తెలియజేశారు. బాబా మాత్రం కైలాష్, సత్యమూర్తి మరణాల పట్ల ఏవిధమైన వాఖ్యానాలూ చేయలేదు. వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి, కైలాష్ భార్యకు ఆశ్రమంలో ఉద్యోగం ఇచ్చి, అతని పిల్లలను చదివించే బాధ్యతను తీసుకున్నారు. సత్యమూర్తి భార్యకు డిసీజ్డ్ కోటాలో ఉద్యోగం వచ్చేటట్లు చేసి, వాళ్ల కుటుంబాన్ని ఆదుకున్నారు.
కైలాష్, సత్యమూర్తి ఎంతో సాహసం చేసి, వాళ్లు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేసి, ప్రాణాలు కోల్పోయినా భయపడకుండా దేవదానం కూడా దాదాపు అదే బాటను పట్టాడు. అతని ముఖ్య ధ్యేయం 'మెరుపుల పండగ' వెనుక ఉన్న మోసాన్ని బహిర్గతం చేయడం. దానికోసం అతను చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అయినా ఏనాటికైనా రుజువు చేసి, చూపిస్తానని శపథóం చేసేవాడు. బాబా చేసే అద్భుతాలు బూటకాలేనని, గతంలో ఇలాంటి బాబాలు, స్వామీజీలు ఎలా దొరికిపోయారోనన్న ఉదంతాలను ఉదాహరణలుగా చెబుతూ, తన ఉపన్యాసాలతో జనాన్ని ఊదరగొడుతూ ఉండేవాడు. క్రితం నెల్లో జరిగే మెరుపుల పండగ రోజు ఉదయమే ఒక బహిరంగ సభ ఏర్పాటుచేసి, మెరుపుల పండగలో జరిగే మోసాన్ని బహిర్గతం చేస్తానని ప్రచారం చేసేసరికి, ఆ సభకు లెక్కలేనంతమంది హాజరయ్యారు. కానీ సభ ప్రారంభంలోనే, మొదటి మాటలు మాట్లాడుతూనే, రక్తం కక్కుకుంటూ నేలకు ఒరిగిపోయాడు. బాబా శిష్యులు, మునసబు పెద్దినాయుడు వెంటనే అతన్ని హాస్పటల్‌కి తరలించే ప్రయత్నం చేసినా, దార్లోనే ప్రాణాలు వదిలాడు.
ఇదంతా విన్న విశాల్ మనసు బాధతో కుంగిపోయింది. కాస్సేపటివరకూ ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాడు. 'మన మిత్రుల మరణాలు దేవుడి ఆగ్రహం కారణంగా జరిగినవని ప్రజలు నమ్ముతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్లు ముగ్గురూ ప్రవర్తించిన తీరు, బాబాకో, ఆయన మనుషులకో లేదా ఈ అద్భుతాల వల్ల లాభపడేవారికో ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. ఇది వాళ్ల పనే కావచ్చు. నీకు అలా అనిపించలేదా?' అని సూటిగా అడిగాడు విశాల్. అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ, తల అడ్డంగా తిప్పుతూ, 'ఛ...అలాంటిదేమీ లేదు. నీకీ ఊరి మనుషుల గురించి, బాబా గురించి తెలియకపోవడం వల్ల, నీ ఆలోచన అలా ఉంది' అని చెబుతున్న పరమాత్మ వైపే చూస్తూ సంభాషణను పొడిగించలేదు.
విశాల్‌కి సిరిపల్లి బాగా నచ్చడంతో, మరో మూడు రోజులు ఆ ఊర్లోనే ఉండి, పచ్చని పొలాలను, కొండలను, వాగులను చూస్తూ ఆనందంగా గడిపి, తిరుగు ప్రయాణం పట్టాడు. ఆరు నెలల తర్వాత అతని నుంచి పరమాత్మకు ఒక మెసేజ్ వచ్చింది.
'ఇటీవల కాలంలో మేము చేస్తున్న రీసెర్చ్‌లో భాగంగా కొత్త పంటలను కనుగొన్నాం. వాటికి నీ బంజరు భూమిలో ఉన్న మట్టి అనుకూలం అని గ్రహించి, దాని శ్యాంపిల్ కొంత నాతో తెచ్చి, ఇక్కడ పరీక్ష చేస్తే, నా ఊహ నిజమని తేలింది. నీకు అభ్యంతరం లేకపోతే, మేము అక్కడికి వచ్చి మీ పొలంలో ప్రయోగాలు మొదలుపెడతాం' అన్నది దాని సారాంశం. పరమాత్మ వెంటనే అంగీకారం తెలపడంతో విశాల్ తన మనుషులతో ఆ ఊరు వచ్చి, ప్రయోగాలు ప్రారంభించాడు. అతను నెలకోసారి వచ్చి ప్రోగ్రెస్ చూసుకుంటుంటే, అతని మనుషులు అక్కడే ఉండి, ప్రయోగాలను కొనసాగిస్తున్నారు.
ఈసారి విశాల్ మెరుపుల పండగకు రెండ్రోజుల ముందే వచ్చాడు. ఆ పండగనాడు జరిగే అద్భుతాన్ని కళ్లారా చూడాలని అతను ఉవ్విళ్లూరుతున్నాడు. ఈసారి కూడా ఎప్పటిలాగే ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి, కొండ చుట్టూ ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటకుండా చూడడానికి పోలీసులు బాగా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత సమయానికి కొండమీద మెరుపులు దర్శనం ఇచ్చాయి. 'మహాద్భుతం' అన్నాడు విశాల్ పరవశంగా.
మర్నాడు ఆ ఊర్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు ఉదయం పోలీసులు ఊరిలోకి వచ్చి బాబాను, అతని శిష్యులను, పెద్దినాయుడితో పాటూ కొంతమంది గ్రామ పెద్దలను అరెస్ట్ చేసి, విశాఖపట్నం తీసుకెళ్లిపోయారన్న వార్త దావానలంగా వ్యాపించడంతో కంగుతిన్న పరమాత్మ, హుటాహుటిన విశాల్ దగ్గరకు పరిగెత్తి, విషయం చెప్పాడు. అది విన్న విశాల్ ఆశ్చర్యపోకుండా తనకంతా తెలుసునన్నట్లు మందహాసం చేయడంతో మతిపోగొట్టుకున్నాడు.
'నువ్వు ముందు కూర్చుని కాస్త స్థిమితపడు. అంతా వివరంగా చెప్తాను. మన మిత్రుల మరణాలు హత్యలేనని, నాకెప్పుడో అనిపించింది. కానీ ఆధారాలు ఏమీలేని కారణంగా మౌనంగా ఉండిపోయాను. మూడు రోజులు అదనంగా ఉండి, ఆధారాల కోసం తీవ్రంగా గాలించాను. ఎంతో కష్టం మీద ఒక్క ఆధారం మాత్రమే సంపాదించగలిగాను. మెరుపుల కొండ మీద నాకొక డబ్బా దొరికింది. దాని అట్టడుగున ఉన్న పౌడర్ని సేకరించి, పరీక్షించాను. అది 'మెగ్నీషియం' పౌడర్. దీపావళి రోజున మనం కాల్చే తాళ్లు, సెర్చ్‌లైట్లలో ఆ పౌడరే ఉంటుంది. దాన్ని మండిస్తే కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతి చాలా ఎక్కువగా వస్తుంది. వాళ్లు దాని సహాయంతోనే మెరుపులు సృష్టించేవారు.
ఆ ఆధారం దొరకగానే నేను విశాఖపట్నం వెళ్లి, ఈ మధ్యనే ఎస్పీగా చార్జ్ తీసుకున్న దైవసహాయాన్ని కలిశాను. అతను నాకు పీజీలో క్లాస్‌మేట్. అంతేకాదు మన దేవదానానికి బంధువు. దేవదానాన్ని ఎవరో హత్య చేసి ఉంటారని అతనికీ అనుమానమే. కానీ ఆధారాలు ఏమీలేక అవకాశం కోసం చూస్తుండగా, నేను అతన్ని కలవడం జరిగింది. అప్పుడే ఒక ప్లాన్ ఆలోచించాము. దానిలో భాగంగానే నీ పొలంలో ప్రయోగాలు మొదలుపెట్టాము. నేను తీసుకొచ్చిన మనుషుల్లో ముగ్గురు పోలీసు ఆఫీసర్లే. వాళ్లందరూ ఆధారాల కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. మా అదృష్టం కొద్దీ శివాలయం పూజారి కొడుకు ఏదో మత్తుమందు తీసుకొని, ఊరవతల తోటలో పడి ఉండడం మా వాళ్ల దృష్టిలో పడింది. అతని దగ్గర దొరికిన మత్తుమందు ఇక్కడెక్కడా దొరికేది కాదు. అది వాడికెలా దొరికిందో మా వాళ్లకు అర్థం కాలేదు. మా టీంలోని పోలీసులు పూజారి ఇంటి వెనుక ఉన్న గోడౌన్లో ఆ మందు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు, అక్కడే ఉన్న కేజ్‌లలో నాలుగైదు నాగుపాములు ఉన్నట్లు కనిపెట్టారు. దాంతో చిక్కుముడి విడిపోయినట్లు అయింది. ఆ పాములకు మత్తుమందు అలవాటు చేసి, వాటిని బానిసలుగా చేసి, మత్తుమందు ఇంజెక్ట్ చేసిన కోడిగుడ్లను ఎరగా చూపి, తమకు కావలసినట్లు అద్భుతం సృష్టించారు. సూత్రధారులు బాబా, పెద్దినాయుడు. మెరుపుల పండగ రోజున మావాళ్లు చాకచాక్యంగా ఒకడిని పట్టుకొని, వాడి దగ్గరున్న మెగ్నీషియం పౌడర్‌ని స్వాధీనం చేసుకొని, అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో దేవదానం ఎలా చనిపోయాడో తెలుసుకోవడం జరిగింది. ఆ దుర్మార్గులు, మైక్ ద్వారా విషప్రయోగం చేశారు. దేవదానం మాట్లాడుతున్నపుడు, శక్తివంతమైన విషం మైక్‌లోంచి ఆవిరి రూపంలో బయటకు వచ్చేలా చేశారు. దాని ప్రభావం వల్ల దేవదానం మరణించాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తారుమారు చేసి, నేరం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇక బాబా చేసే అద్భుతాలు, అదే నిప్పుల మీద నడవడం, నీళ్ల మీద నడవడం, విభూతి, ఉంగరాలు సృష్టించడం లాంటివి మోసాలేనని నిరూపించడానికి మా దగ్గర ఎన్నో రుజువులు ఉన్నాయి. ఇప్పటికి వాళ్ల పాపం పండడంతో దొరికిపోయారు.' అంటూ ముగించిన విశాల్‌ని చూస్తూ కాసేపు నోరు వెళ్లబెట్టి ఉండిపోయాడు పరమాత్మ.
కొయిలాడ రామ్మోహన్ రావు
79010 45061