Oct 12,2022 07:14

కొద్దికాలంగా పడుతున్న వర్షాలకు కనీవినీ ఎరుగని విధంగా నగరాలు, పట్టణాల్లో కొన్ని ప్రాంతాలు, వీధులు జలమయమై జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇదంతా ప్రకృతి అసమతుల్యత, కాలుష్యం వల్ల జరుగుతున్న నష్టాలు గానే కాక మరొక కీలకమైన అంశాన్ని మన ముందుంచుతున్నాయి. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధారిటీ అర్బన్‌ ఫ్లడ్స్‌ మీద ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుండి ఒక్కొక్కటిగా దేశంలో ప్రధాన నగరాల్లో ఇటువంటి వరదలు సంభవిస్తూనే ఉన్నాయి. కాస్మోపాలిటన్‌ సిటీ బెంగళూరు లోనూ అదే పరిస్థితి.
        మన రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలకు నగరాలు మునుగుతున్నాయి. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడ నగరం పరిస్థితి అయితే చెప్పనక్కరలేదు. దాదాపు 25 సంవత్సరాల నుండి చిన్నపాటి వర్షాలకు కూడా నగరంలో ఎక్కువ ప్రాంతం గంటల తరబడి నీరు నిలబడి జనజీవనం స్తంభించిపోతోంది. గత సంవత్సరం గుంటూరు జిల్లా కుంచనపల్లిలో ఒక కాలేజి వారు తమ నిర్మాణాలకోసం పంట కాలువ వెడల్పును తగ్గించి దాదాపు పూడ్చివేసినంత పనిచేశారు. దీంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక 700 ఎకరాలలో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వాలు అప్పటికప్పుడు నిజనిర్ధారణలు చేసి హడావిడి చేయడం తప్ప పరిష్కారం దిశగా ఏమీ చేయడం లేదు.
         కార్పొరేషన్‌ పంపే నీటి కోసం ఎదురు చూడాల్సిన హైదరాబాద్‌లో 2020లో వరద వచ్చి తీవ్ర నష్టం కలిగించింది. ఆ నగరపాలక విభాగం వారు కూడా వరదలకు ప్రధాన కారణంగా పట్టణ విస్తరణ, భూమి మార్పిడే కారణమని తేల్చారు. చెన్నైలో వరదలపై సర్వే చేసిన తరువాత కీలకాంశం వెలుగులోకి వచ్చింది. సంస్కరణల్లో భాగంగా పట్టణీకరణ వేగవంతం అవుతోంది. అభివృద్ధి పేరుతో శివారు గ్రామాలను, వ్యవసాయ భూములను నగరాల పరిధిలోకి తెచ్చి రెసిడెన్షియల్‌ ఏరియాలుగా మార్చుతున్నారు. ఒక ప్రాంతంలోని వ్యవసాయ భూమిని రియల్‌ ఎస్టేట్‌ కింద మార్చిన తరువాత నిర్మాణాలు పటిష్టంగా ఉండాలనే పేరుతోనో, కబ్జాదారుల ఆశతోనో ఆ వైపుగా ప్రవహించే కాలువలను పూడ్చివేస్తున్నారు. దిగువన ఉండే భూములకు నీటి సరఫరా నిలిచిపోయి పంటలు పండించడం సాధ్యం కావడంలేదు. గత్యంతరం లేక వారు కూడా భూములను అమ్మేస్తున్నారు. దీంతో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పట్టణాల పరిధి మారుతూ వస్తోంది.
          పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఇబ్బడి ముబ్బడిగా గృహ, వ్యాపార అవసరాలకు నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ ప్లానింగ్‌ విభాగాలు వాటర్‌ మేనేజ్‌మెంట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాయి. దాంతో కొద్దిపాటి వానలకే నగరాల్లో వీధులు జలమయమై పోతున్నాయి. చెన్నై వరదల అనంతరం పరిశోధనా విభాగం నిర్ధారించిన కారణం ఇదే. నగరంలో నుండి బంగాళాఖాతంలో కలిసే మూడు నదీపాయలు... నిర్మాణాల వల్ల మూసుకుపోయాయి. భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రాణ నష్టం, అపారమైన ఆస్తి నష్టం మిగిలింది.
            నగరాలకు వచ్చిన వరద జనాన్ని ముంచెత్తుతుంటే... ఎటువంటి ప్రమాదమూ లేకుండా నీరు పారడానికి వీలుగా...నిర్మాణాలను ప్రణాళికా బద్ధంగా నిర్మించే చర్యలూ లేవు. వరద నీటిని ఉపయోగించుకునే విధంగా ఇరిగేషన్‌ ప్లానింగ్‌ లేదు. నీటి పారుదలపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణి పెను నష్టాలకు దారి తీస్తోంది. ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న హెచ్చరికలను గుర్తించి ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే భవిష్యత్తులో దిద్దుకోలేని తప్పు అవుతుంది. ప్రజల ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టాల్సి వస్తుంది.
 

- వల్లభనేని గీతావాణి