
కర్ణాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ముందు వెనక చూడకుండా కేంద్రం మొన్నటి బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయింపులు చేసి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. కేంద్ర బిజెపి చర్య వెనక రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న కుచ్చిత బుద్ధి దాగుందన్నది బహిరంగ రహస్యం. కర్ణాటక బిజెపి ప్రభుత్వం అడిగిందే తడవు జలసంఘం, ట్రిబ్యునల్ వంటి సంస్థలను, దిగువ రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పట్టించుకోకుండా అప్పర్ భద్రకు కేంద్రం ఆగమేఘాలపై జాతీయ హోదా కల్పించడమూ ఎన్నికల స్టంటే. అప్పర్ భద్రపై బిజెపి స్పీడుతో దిగువనున్న తెలుగు రాష్ట్రాలు ఉలికిపాటుకు గురయ్యాయి. మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల రైతాంగం, ప్రజానీకం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తుంగభద్ర నుంచి దిగువకు సరిగ్గా నీరు రాక ఇబ్బందులు పడుతున్న వారు తమ పరిస్థితేంటని మధన పడుతున్నారు.
అప్పర్ భద్ర ప్రాజెక్టు ప్రధానోద్దేశం 29.5 టిఎంసిలను భద్ర జలాశయం ఎగువన తోడిపోసి కర్ణాటకలో నాలుగు కరువు పీడిత జిల్లాల్లో ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం. ఈ ప్రాజెక్టును బచావత్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా అమల్లోకి రాలేదు. అయినప్పటికి కర్ణాటక బిజెపి సర్కారు 2020 నుంచి అప్పర్ భద్రను నిర్మిస్తోంది. విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించబడ్డ మన పోలవరానికి సవాలక్ష కొర్రీలు వేస్తున్న మోడీ ప్రభుత్వం వివాదాస్పద అప్పర్ భద్రకు మాత్రం బడ్జెట్‌లో నిధులివ్వడం 'రాజకీయ'మే. పోలవరానికి ఎప్పుడో పాత అంచనాల మేరకే నిధులిస్తామని అప్పర్ భద్రకు మాత్రం తాజా అంచనాలకనుగుణంగా నిధులివ్వడం ఎన్నికల విన్యాసమే. ప్రత్యేక హోదాపైనా బిజెపిది అదే తీరు. ఎ.పి.కి హోదా లేదని, అదే నోటితో పుదుచ్చేరి, బీహార్ ఎన్నికల్లో హోదా పాట పాడింది. ఉచిత పథకాలు వద్దేవద్దంటున్న మోడీ, ముందటి యు.పి. ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని, అధికారంలోకొచ్చాక తుంగలో తొక్కారు. ఈ పూర్వరంగంలో రూ.21 వేల కోట్ల వ్యయంకాగల అప్పర్ భద్రకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు చూపించడం వెనకబడ్డ నాలుగు కర్ణాటక జిల్లాల్లో ఓట్లు పొందడానికే తప్ప నిజంగా కరువు ప్రాంతాలపై ప్రేమతో కాదు.
తుంగభద్ర ప్రాజెక్టుపై అనావృష్టి ప్రాంతం రాయలసీమ ప్రజల బతుకు ఆధారపడి ఉంది. హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, కెసి కెనాల్ కింద ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్ణాటక, ఎ.పి. ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్రలో మనకు కేటాయించిన 72 టిఎంసిలను ఏనాడూ మనం వాడుకోలేదు. సరిపడా నీరు లేక కాల్వలకు పూర్తి స్థాయిలో నీళ్లొచ్చింది లేదు. అందుబాటులో ఉన్న నీటిలో దామాషా నిష్పత్తిలో ఇచ్చిన నీరు సైతం చివరికంతా రానేలేదు. ప్రస్తుత పరిస్థితి ఇంత దయనీయంగా ఉండగా అప్పర్ భద్రతో నీటిని పైనే తోడేస్తే తుంగభద్ర డ్యామ్‌కు నీరు రాక సీమలో సాగు ప్రశ్నార్ధకమవుతుంది. శ్రీశైలానికి తుంగభద్ర నుంచి వరద నీరు రాకపోతే హంద్రీ-నీవా, ఎస్‌ఆర్‌బిసి, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడుతుంది. నదీ జలాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సింది కేంద్రమే. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను విస్మరించడమే కాకుండా, కేంద్రమే రాష్ట్రాల మధ్య తంపులు పెట్టడం దారుణం. అప్పర్ భద్రపై ఎ.పి. ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తానంటోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే జలశక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ అప్పర్ భద్రకు జాతీయ హోదా సిఫారసు చేయగా ఇరిగేషన్ డిపార్టుమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గొంతెత్తి కేంద్రాన్ని నిలదీయకపోవడం ప్రభుత్వ లొంగుబాటు ధోరణిని తెలుపుతుంది. ఎక్కడైనాకాని వెనకబడ్డ కరువు ప్రాంతాలకు నీరివ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. రాజకీయాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం మరొకరిని ఎండబెడతామనడం అన్యాయం. న్యాయపోరాటంతోపాటు బిజెపి కుయుక్తులను ఎండగట్టి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలి.