Sep 23,2023 12:00

ఒట్టావా : కెనడా, భారత్‌ల మధ్య ఖలిస్తానీ వేర్పాటువాదం చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దిప్‌సింగ్‌ నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజ్జర్‌ హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందని.. దీనికి సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని భారత్‌కు కొన్నివారాల క్రితమే తెలియజేశామని ట్రూడో అన్నారు. ఈ విషయాన్ని తాను గత సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడేముందే భారత్‌కు చెప్పామని ట్రూడో స్పష్టం చేశారు. అలాగే దీనిపై భారత్‌తో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని ట్రూడో చెప్పారు.
కాగా, గత సోమవారం పార్లమెంట్‌లో నిజ్జర్‌ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమేయం ఉందని ట్రూడో భారత్‌పై మండిపడ్డారు. అయితే.. ట్రూడో ఆరోపణలపై భారత్‌ ఘాటుగా స్పందించింది. నిజ్జర్‌ హత్య విషయంలో భారత దౌత్య అధికారుల ప్రమేయం ఉందని కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో వాటిని బయటపెట్టాలని భారత్‌ కోరింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని.. భారత్‌ తప్పుపట్టింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలు చేశారని భారత్‌ స్పష్టం చేసింది. అయితే భారత్‌ కోరినట్లుగా ఇప్పటివరకు కెనడా నిజ్జర్‌ హత్యకు సంబంధించిన ఆధారాలను వెల్లడించలేదు. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్‌ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కోరారు. ఈ కేసుకు సంబంధించిన భారత్‌ కెనడాకు సహకరించాలని ఆయన భారత్‌కు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్‌, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.