Nov 12,2022 06:55

      అఖిల భారత కిసాన్‌సభ 35వ జాతీయ మహాసభ డిసెంబరు 13 నుండి 16వ తేదీ వరకు కేరళ లోని త్రిసూర్‌లో జరగనుంది. మహాసభ సన్నాహాలలో భాగంగా నవంబరు 15న గ్రామ గ్రామాన కిసాన్‌సభ పతాకావిష్కరణ చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ పిలుపు ఇచ్చింది. నవంబరు 15 స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి. ఆ రోజున దేశవ్యాపితంగా లక్ష గ్రామాలలో కిసాన్‌ సభ జెండా ఎగురవేయాలని కిసాన్‌ సభ నిర్ణయించింది.
        బిర్సా ముండా నేటి జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఉలిహాతు గ్రామంలో జన్మించాడు. 25 సంవత్సరాల వయస్సులోనే రాంచీ సెంట్రల్‌ జైల్‌లో మరణించాడు. ఆనాటి బ్రిటీష్‌ పాలకులు గిరిజనుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి నిరసనగా గెరిల్లా పోరాటం సాగింది. ఆ పోరాటానికి నాయకుడు బిర్సా ముండా. 1899లో క్రిస్‌మస్‌ రోజున 7 వేల మందితో సభ జరిపాడు. ఉల్‌గులాన్‌ ఉద్యమానికి పిలుపు ఇవ్వడమేగాక...గెరిల్లా సైన్యాన్ని ఏర్పరిచాడు. అనతి కాలంలోనే ఉద్యమం కుంతి, తామర్‌, బసియా, రాంచీ జిల్లాలకు వ్యాపించింది. నాలుగు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోరాటాలు సాగాయి. 1900 మార్చి 3న గెరిల్లా దళం నిద్రిస్తుండగా బిర్సా ముండా తో సహా 460 మందిని అరెస్టు చేసి రాంచీ జైలులో బంధించారు. 1900 జూన్‌ 9న బిర్సా ముండా జైలులో మృతి చెందాడు. ఆయన జయంతి రోజైన నవంబరు 9న పతాకావిష్కరణ జరపాలని అఖిల భారత కిసాన్‌ సభ పిలుపు ఇచ్చింది.
          డిసెంబరులో జరగనున్న 35వ అఖిల భారత రైతు మహాసభకు ప్రత్యేకత ఉంది. ఈ కాలంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 380 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం సాగింది. కేంద్ర ప్రభుత్వం కల్పించిన సామ, దాన, బేధ దోండోపాయాలన్నిటినీ అధిగమించి ఐక్యంగా సాగింది. చివరకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు సాగిన చారిత్రాత్మక పోరాటమిది. ఇందులో అఖిల భారత కిసాన్‌ సభ క్రియాశీలక పాత్ర పోషించింది. పోరాటాన్ని దేశ వ్యాపితంగా విస్తరించడంలో ప్రధాన పాత్ర వహించింది. రైతాంగ పోరాటానికి కార్మిక వర్గ, ఇతర ప్రజానీక మద్దతును కూడగట్టడంలో ప్రధాన భూమిక వహించింది.
        ఈ మహాసభకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పంటల మద్దతు ధరల చట్టం తెస్తామని, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులో వ్యవసాయానికి మినహాయింపు ఇస్తామని, ఉద్యమం సందర్భంగా 48 వేల మంది రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని ఉద్యమం విరమణ సమయంలో నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును యథాతథంగా పార్లమెంటు ముందు పెట్టింది. పంటల మద్దతు ధరల చట్టం ఊసే లేకుండా బూటకపు కమిటీని ఏర్పాటు చేసింది. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వం తిరిగి మరొక ఉద్యమానికి సమాయత్తం అవుతున్నది. పోరాట రూపాలను, డిమాండ్లను రూపొందించే పనిలో ఉంది.
         అఖల భారత కిసాన్‌ సభ గ్రామ, మండల, జిల్లా రాష్ట్ర మహాసభలలో చర్చించి జాతీయ మహాసభకు సిద్ధం అవుతున్నది. మొదటి నుండి రైతుసంఘాలు కోరుతున్నట్లుగా స్వామినాథన్‌ సూచించిన సి2+50 శాతం ఫార్ములా ప్రకారం పంటల మద్దతు ధరలు, వాటి అమలుకు సమగ్ర చట్టం, అప్పులపాలైన రైతాంగ రుణాలు మాఫీ, కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టాలు... సాధించుకోవలసి ఉంది. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి కొట్టవలసి ఉంది. వీటన్నిటిని చర్చించి ఈ మహాసభ దిశానిర్దేశం చేస్తుంది. రాబోయే పోరాటాలకు సమాయత్తం చేయవలసి ఉంది. ఈ మహాసభ సందర్భాన్ని పురస్కరించుకుని 'ప్రత్యామ్నాయం కోసం పోరాడండి. సంఘటితం చేయండి. ముందుకు సాగండి' అనే నినాదంతో లక్ష గ్రామాలలో నవంబరు 15న పతాకావిష్కరణ చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ పిలుపును అనుసరించి రైతుసంఘం ఉన్న ప్రతి గ్రామంలో సంఘం జెండా ఎగురవేయాలి.

/వ్యాసకర్త : ఎ.పి రైతుసంఘం సీనియర్‌ నాయకులు/
వై.కేశవరావు

వై.కేశవరావు