
భారతదేశం నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. భారతీయ సమాజం పురోగతి సాధించాలంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన ఆర్థిక అసమానతలు, పేదరికం లాంటి సమస్యల పరిష్కారం కోసం తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మతపరంగా ప్రజలను సంఘటితం చేయడం ద్వారా... నిజ జీవిత సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించటానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఐక్యత అవసరం.
గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు జాతీయ సమైక్యతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితులు, పరిణామాలు, నయా ఉదారవాదం అమలు చేస్తున్న ప్రమాదకరమైన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వర్గ పోరాటాలను, ప్రతిఘటనను, బలహీనపరిచే విధంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అందువల్ల, వర్గ పోరాటాలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి మతపరమైన అంశాల ఆధారంగా సమాజాన్ని సంఘటితం చేసే అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా, ఓడించే విధంగా కార్మికవర్గం ప్రయతించాలి.
భారతదేశంలో రోజురోజుకూ మతపరమైన ఏకీకరణ తీవ్రమవుతోంది. భారతదేశంలోని మైనారిటీలపై ప్రత్యేకించి ముస్లిం సమాజంపై ద్వేషపూరిత వాతావరణాన్ని వెదజల్లుతున్నారు. పాలక పక్షానికి లేదా అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వానికి విధేయతతో ఉన్న మత పెద్దలు భారతదేశం లోని ముస్లిం మైనారిటీలను దూరంగా పెట్టాలని, వారిని నిర్మూలించాలని బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. ఇటువంటి ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో మత స్వేచ్ఛకు సంబంధించి భారత దేశాన్ని ఒక 'ఆందోళన చెందదగిన దేశంగా' అమెరికా పేర్కొన్నది. మహమ్మద్ ప్రవక్తపై ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బిజెపి జాతీయ అధికార ప్రతినిధి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యల కారణంగా ఇటీవల ప్రభుత్వం అంతర్జాతీయంగా తీవ్రమైన ఆగ్రహాన్ని, ఎదురుదెబ్బను చవిచూడాల్సి వచ్చింది. ఈ తీవ్రత ఎంతగా ఉందంటే, అధికార పార్టీ తన స్వంత 'ప్రతినిధి'ని అంత ప్రాధాన్యం లేని వ్యక్తిగా ముద్ర వేయడం ద్వారా ఆమెను తిరస్కరించవలసి వచ్చింది. దురదృష్టవశాత్తూ నేడు ఆ ప్రాధాన్యం లేని వ్యక్తి చెప్పిన అంశాలే ప్రధాన సమస్యగా మారాయి. మైనారిటీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నట్లు కనిపిస్తోంది. పాలస్తీనియన్ల డొమిసైడ్ (ఇళ్లను ధ్వసం చేయడం) లాంటి ఇజ్రాయిల్ విధానం లాగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోని మైనారిటీ కమ్యూనిటీకి చెందిన నిరసనకారులను త్వరితగతిన అణగ తొక్కటానికి, శిక్షించటానికి 'బుల్డోజర్' ఒక కొత్త సాధనంగా ఉద్భవించింది.
పోలీసు, ప్రాసిక్యూటర్, న్యాయమూర్తి...ఇలా అందరి పాత్రలూ కార్యనిర్వాహకుడే పోషిస్తాడు. కార్యనిర్వాహకుడు కోరుకున్నదే చట్టం. చట్టం ద్వారా నిర్దేశించబడిన ప్రక్రియ (డ్యూ ప్రాసెస్) అనే విధానాన్ని గాలికి వదిలేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజ్యాంగ నిపుణులు భారతీయ విధానం అమెరికా విధానం కంటే కూడా విస్తృతంగా ఉందని ప్రశంసించారు. ఎందుకంటే కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ యొక్క అన్యాయమైన చర్యలకు వ్యతిరేకంగా, భారత రాజ్యాంగం పౌరునికి ఉన్న జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి హక్కులను పరిరక్షిస్తుంది. ఈరోజు ఆ పరిస్థితి తలకిందులు అవుతోంది. మైనారిటీ వర్గాలకు చెందిన భారతీయ పౌరులను, ''ఈ దేశ పౌరులు కానివారుగా'' చూసే స్థాయికి పరిస్థితి దిగజారుతున్నది. పాలనలో మత విశ్వాసం, మత నమ్మకం అనే ముఖ్య అంశాల ఆధారంగా ఏర్పరుచుకున్న నాగరికత కలిగిన దేశంగా భారతదేశాన్ని చిత్రీకరించడానికి ఈ రోజు ఒక వికృత ప్రయత్నం జరుగుతోంది.
ఇది రాజ్యాంగ నైతికతకు అత్యున్నత ప్రాముఖ్యతనిచ్చే దేశ పాలనకు, ఆధునిక దేశ భావనకు వ్యతిరేకం. ఈ నాగరికతను స్వచ్ఛమైన హిందూ సంస్కృతికి సంబంధించిన కథగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి గత వైభవాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం తప్పనిసరిగా కృషి చేయాలి. మున్షీ ప్రేమ్‌చంద్ తన అద్భుతమైన వ్యాసం 'సాంప్రదాయకత - సంస్కృతి'లో భారతీయ సంస్కృతి గురించి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత కాలానికి చాలా సందర్భోచితంగా ఉన్న ఈ రచన లోని ప్రారంభ పేరాను పేర్కొంటున్నాను. ''మతవాదం ఎప్పుడూ సంస్కృతిని సాకుగా చూపుతుంది. పులి చర్మాన్ని ధరించి అడవి లోని జంతువులపై పెత్తనం చెలాయించే గాడిద లాగా దాని నిజ రూపంలో బయటపడటం సిగ్గుచేటనిపిస్తుంది. హిందువు తీర్పు రోజు వరకు తన సంస్కృతి సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడు. అలానే ముస్లిం కూడా తన సంస్కృతిని భద్రంగా ఉంచుకోవాలని కోరుకుంటాడు. ఇద్దరూ తమ తమ సంస్కృతులను ఇప్పటి వరకు మరొకరు తాకరానిదిగా భావించారు. ఇప్పుడు ఎక్కడా హిందూ సంస్కృతి లేదు, ముస్లిం సంస్కృతి లేదు, మరే సంస్కృతి లేదు అన్న విషయం వారు మరిచిపోయారు. నేడు ప్రపంచంలో ఒకే ఒక సంస్కృతి ఉంది, అది ఆర్థిక సంస్కృతి. కానీ నేటికీ హిందువులు, ముస్లింలు సంస్కృతికి మతంతో సంబంధం లేనప్పటికీ సంస్కృతిని గూర్చి వాదిస్తూనే ఉన్నారు. ఆర్య సంస్కృతి, పర్షియన్ సంస్కృతి, అరబ్ సంస్కృతి ఉంది. కానీ క్రిస్టియన్ సంస్కృతి, ముస్లిం లేదా హిందూసంస్కృతి అని ఏమీ లేదు.'' భారతదేశం యొక్క సంస్కృతి వేలాది సంవత్సరాలుగా వివిధ ఆలోచనలు, జీవన విధానాలను సమ్మిళితం చేస్తూ అభివృద్ధి చెందింది. నిజానికి రఘుపతి సహారు (కలం పేరు ఫిరాక్ గోరఖ్పురి) భారతదేశ నిర్మాణం గురించి రెండు పంక్తులలో అందంగా వర్ణించాడు... హిందూస్థాన్ గడ్డపై, ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు, ఓ ఫిరాక్ వచ్చి స్థిరపడ్డారు. హిందుస్థాన్‌ను నిర్మించారు. కాబట్టి ఈ సంస్కృతి, భాషలు, బహుళ మతాల గుర్తింపు భారతదేశ ఐక్యతను సుస్థిరం చేయడమే కాకుండా, ఆ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం అసూయపడేలా చేసింది. భారతదేశ సంగీతం, కళ, వాస్తుశిల్పం యొక్క గొప్పదనం దాని సాంస్కృతిక సమకాలీనత కారణంగా వచ్చింది. పండిట్ రవిశంకర్ లేదా పండిట్ భీంసేన్ జోషి గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ లేదా ఉస్తాద్ ఖాన్ అబ్దుల్ కరీం ఖాన్ మార్గదర్శకత్వం, వారి మార్గదర్శకత్వంలో అందించిన సహకారాన్ని మనం మరచిపోలేం. గురునానక్ బోధనలు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనారు, అమీర్ ఖుస్రో, కబీర్ కవిత్వం, మీరా బాయి వంటి వారి భక్తి గీతాలు భారతదేశ సమయోచిత, సజీవ సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తాయి. భారతీయ సంస్కృతి ఎప్పుడూ వీటికి అతీతం కాదు. ఇది ఎల్లప్పుడూ కలుపుకొని ఉంటుంది. గొప్ప సమకాలీకరణ ఉద్భవించడానికి అనుకూలమైనది. నేడు ఈ ఘనమైన సంస్కృతి...భారతీయ సమాజాన్ని ఒకే జాతిగా మార్చే పేరుతో దాడికి గురవుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), హిజాబ్, లవ్ జిహాద్ మొదలైన వాటి రూపంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నంలో భాగమే.
బహుళ జాతి దేశాన్ని ఏకతాటిపై నిలిపేందుకు మతం సరిపోదని స్వాతంత్య్ర ఉద్యమం కూడా సరిగ్గానే గ్రహించింది. ప్రతి మతాన్ని దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం చేస్తేనే భారతదేశం లాంటి పెద్ద దేశం, వైవిధ్య భరిత దేశం, ఒక దేశంగా కలిసి ఉండగలదని మన పూర్వీకులు వారి అవగాహనలో ఖచ్చితంగానే ఉన్నారు. శాంతి, స్ధిరత్వానికి సంబంధించి, ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, 1947 నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగిందంటే లౌకికవాదం పట్ల మనకున్న నిబద్ధతే కారణమనేది వాస్తవం. చరిత్ర ఇప్పుడు కొత్త యుద్ధ భూమిగా మారింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కలిసి పోరాడారని మనం గుర్తుంచుకోవాలి. 1857లో భారతదేశ మొదటి స్వాతంత్య్ర సమరానికి నానా సాహిబ్, బహదూర్ షా జఫర్, మౌల్వీ అహ్మద్ షా, తాంతియా తోపే, ఖాన్ బహదూర్ ఖాన్, రాణి లక్ష్మీబాయి, హజ్రత్ మహల్, అజీముల్లా ఖాన్, ఫిరోజ్ షా వంటి నాయకులు సంయుక్తంగా నాయకత్వం వహించారు. హిందువులు, ముస్లిములు కలిసి అత్యున్నత త్యాగం చేసిన సందర్భాలతో మన చరిత్ర నిండి ఉంది. అయోధ్య నేడు మతపరమైన ముఖ్య కేంద్రంగా మారినప్పటికీ, నాడు, 1857లో అయోధ్య లోని ప్రముఖ మౌల్వీ మౌలానా అమీర్ అలీ, సుప్రసిద్ధ హనుమాన్ ఆలయానికి చెందిన బాబా రామ్‌చరణ్ దాస్ కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనను నిర్వహించడంలో నాయకత్వం వహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కారణంగా వారిద్దరినీ పట్టుకుని ఒకేసారి అయోధ్య లోని ఫైజాబాద్ జైలులో ఉన్న కుబేర్ టీలా వద్ద చింత చెట్టుకు ఉరితీశారు. భారతదేశం నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. భారతీయ సమాజం పురోగతి చెందాలంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన ఆర్థిక అసమానతలు, పేదరికం లాంటి సమస్యల పరిష్కారం కోసం తక్షణం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. మతపరంగా ప్రజలను సంఘటితం చేయడం ద్వారా... నిజ జీవిత సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించటానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఐక్యత అవసరం. ఒక వైపు భారతీయుల మధ్య ఐక్యతకు భంగం కలిగిస్తూ, మరో వైపు భారత దేశ సమగ్రతను కాపాడాలని దేశభక్తుడు ఎలా ఆలోచించగలడు? దేశ పురోగతిపై శ్రద్ధ పెట్టటం, దేశ పురోగతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే విపత్తును ఖచ్చితంగా ఎదుర్కొనగలం. విభజన శక్తులను ఓడించి దేశ సమైక్యతను కాపాడేందుకు సన్నద్ధమైన కార్మికవర్గం ఈ సవాలును స్వీకరించాలి. కాబట్టి ఈ కష్ట సమయాల్లో సామాజిక సామరస్యం కోసం, సర్వజనుల సామరస్యం కోసం కృషి చేయడం, జాతి సమైక్యతను కాపాడటం కార్మికవర్గం బాధ్యత. కార్మికవర్గం ముందున్న ప్రధాన కర్తవ్యం.
/ వ్యాసకర్త 'ఇన్సూరెన్స్ వర్కర్' సంపాదకులు/
అమానుల్లాఖాన్