
వైజాగ్ : నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్టిపిసి పరవాడ పర్యటన సందర్భంగా ... విశాఖలోని పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మంగళవారం ఉదయం సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణను అక్రమ అరెస్టు చేశారు. ఎన్టిపిసిలో కాంట్రాక్ట్ కార్మికుడు బర్నింగ్ కావడంపై ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో గనిసెట్టిని గృహ నిర్బంధం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాలు మార్పు వంటి విషయాలపై ప్రశ్నిస్తారని ప్రభుత్వం దుర్మార్గంగా ఈరోజు తెల్లవారుజామునుండి అరెస్టులు చేపట్టిందని, నేతల ఇండ్ల వద్ద పోలీసులు పహారాకాయడం, గృహనిర్బంధం చేయడం వంటి చర్యలు దుర్మార్గమని ఎన్టిపిసి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. పోలీసుల చర్యను ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైసిపి ప్రభుత్వం అండదండగా నిలవడం, కేంద్ర ప్రభుత్వ అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులెత్తడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నేతల ముందు మోకరిల్లడం విచారకరమన్నారు. ఎన్టిపిసిలోని ప్రమాదంలో గాయపడ్డ దళాయి రాంబాబుకి మెరుగైన వైద్యం అందించాలని నష్టపరిహారం చెల్లించాలని గని శెట్టి డిమాండ్ చేశారు.