Jul 12,2023 07:08

ఉమ్మడి పౌర స్మృతిని రుద్దేందుకు చేసిన ప్రయత్నాన్ని 21వ లా కమిషన్‌ తిరస్కరించిన తర్వాత, ఎలాంటి కారణాలు లేకుండానే, మరోసారి ఈ అంశాన్ని పరిశీలించాలంటూ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థి నేతృత్వంలో 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దాంతో మరోసారి అభిప్రాయాలు తెలియచేయాల్సిందిగా కోరారు. ఇదంతా కేవలం ప్రజల సమయాన్ని, ధనాన్ని వృధా చేయడమే. కమిషన్‌ను తన స్వంత విధుల నుండి, ప్రాధాన్యతల నుండి పక్కకు మళ్ళించడమే. అయితే మోడీ ప్రభుత్వ హయాంలో, ఈ అసంబద్ధత కూడా సాధ్యమే. ఇక్కడ మహిళల హక్కులకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నది వారి ఎజెండా కాదని, సమాజంలో చీలిక తెచ్చేందుకుగాను ఎన్నికల ఎజెండాతో ముందుకెళ్ళడానికే ఇదంతా అన్నది సుస్పష్టం.

           మహిళల హక్కుల కోసం సాగిన సంఘ సంస్కరణల ఉద్యమాలు చారిత్రాత్మకంగా పురుషుల ప్రత్యేక హక్కు ఏకరూపతపై పోరాడాయి. ఈ దిశగా పడిన ప్రతి అడుగుకూ నిర్దిష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం వుంది. భారతదేశంలో, అదీ మన స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, మహిళల హక్కులు చాలావరకు మెరుగైనప్పటికీ, ఆ హక్కులకు సంబంధించిన చట్టపరమైన చట్రపరిధి ఇప్పటికీ ఇంకా వివక్షలు, పక్షపాతాలు, సాంస్కృతిక భేదాభిప్రాయాలతో మగ్గుతోంది. ఇంకా జరగాల్సింది చాలా వుందనడంలో కొంచెం కూడా సందేహ పడాల్సిన అవసరం లేదు. అయితే, 2023వ సంవత్సరంలో భారత్‌లో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏది ఉత్తమమైన మార్గం అన్నది ప్రశ్న.
          ఒక దేశం, ఒక చట్టం అన్న నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశ పరిస్థితుల్లో ఒకే చట్టమంటే లింగ న్యాయంతో సమానం కాదు. అన్ని కమ్యూనిటీలకు చెందిన మహిళలకూ సమాన హక్కులు సాధించాలన్న లక్ష్యాన్ని చేరేందుకు రెండంచెల వ్యూహాన్ని సిపిఎం సమర్ధిస్తోంది. అన్ని కమ్యూనిటీలకు చెందిన మహిళలకూ వర్తించే ప్రస్తుతమున్న లౌకిక చట్టాలను బలోపేతం చేసి, విస్తరించాలన్నది మొదటి వ్యూహం. అన్ని కమ్యూనిటీల స్త్రీ, పురుషుల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, ఆయా కమ్యూనిటీల పర్సనల్‌, సాంప్రదాయ చట్టాల్లో సంస్కరణల దిశగా ఉద్యమించేందుకు హామీ కల్పించడమన్నది రెండో వ్యూహం. దీనివల్ల ఆ యా కమ్యూనిటీల పరిధిలో మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. అంటే హిందూ పురుషులు, హిందూ మహిళలు, ముస్లిం పురుషులు, ముస్లిం మహిళలు, అలాగే గిరిజన పురుషులు, గిరిజన మహిళల మధ్య సమాన హక్కులు లభిస్తాయి. అలాగే కమ్యూనిటీల మధ్య అంటే హిందువులు, ముస్లింలు, గిరిజనులు, పార్శీలు, క్రైస్తవులు, సిక్కులు తదితరాల మధ్య సమాన హక్కులు లభిస్తాయి. దీనిపై కూలంకషంగా కసరత్తు చేసిన తర్వాత, 2016లో మోడీ ప్రభుత్వం జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 21వ లా కమిషన్‌ ఇదే రీతిలో నిర్ధారణకు వచ్చింది. 'కుటుంబ చట్టాల సంస్కరణలు' శీర్షికతో 2018 ఆగస్టులో తీసుకువచ్చిన కన్సల్టేషన్‌ పేపర్‌లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 

                                                                      లా కమిషన్‌ నిర్ధారణలు

ఉమ్మడి పౌర స్మృతి అమలును పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం లా కమిషన్‌ను ప్రత్యేకంగా కోరింది. ఇది ''అవసరమూ కాదు, వాంఛనీయమూ కాదు'' అంటూ లా కమిషన్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రత్యేక వివాహ చట్టం, గృహ హింస నిరోధక చట్టం తదితర లౌకిక చట్టాలను బలోపేతం చేసి, విస్తరించాలంటూ మొదటగా ఈ కమిషన్‌ సవివరమైన సిఫార్సులు చేసింది. ఇక రెండోది, హిందువులు, ముస్లింలు (సున్నీలు, షియాలు రెండు వర్గాలు), క్రైస్తవులు, పార్శీలు, సిక్కులు, వివిధ రకాలైన గిరిజన కమ్యూనిటీలకు వర్తించే విభిన్నమైన వ్యక్తిగత (పర్సనల్‌), సాంప్రదాయ చట్టాలను సవివరమైన రీతిలో అధ్యయనం చేసిన తర్వాత, వివాహం, విడాకులు, పిల్లల సంరక్షణ, దత్తత, వారసత్వం వంటి కీలకమైన కుటుంబ చట్టాలపై సిఫార్సులు చేసింది. విభిన్న కమ్యూనిటీల పర్సనల్‌ చట్టాల పరిధిలో లక్షిత సంస్కరణలు తీసుకురావాలని పేర్కొంది.
చర్చలు, సంప్రదింపులు విస్తృతంగా జరిపిన తర్వాత, 75,378 స్పందనలు కమిషన్‌కు అందాయి. సమాన చట్టాల కోసం అన్ని కమ్యూనిటీల మహిళల పోరాటాలను కచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలిగేలా అత్యంత ఉపయుక్తమైన నిర్దిష్ట ప్రణాళిక (బ్లూ ప్రింట్‌)ను కమిషన్‌ రూపొందించింది. ప్రస్తుతమున్న హిందూ పర్సనల్‌ చట్టాల్లో హిందూ మహిళలు ఎదుర్కొంటున్న అనేక వివక్షలను ఈ నివేదిక వివరించింది. సహ భాగస్వామి లేదా సహ వారసత్వం అన్న హిందూ చట్ట భావనను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. 2005 సంస్కరణ తీసుకువచ్చిన తర్వాత కూడా మహిళలకు దీనివల్ల అన్యాయం జరుగుతోందని పేర్కొంది. హిందూ అవిభాజ్య కుటుంబం భావన నుండి వచ్చిన పన్ను మినహాయింపులను కూడా రద్దు చేయాలని సిఫార్సు చేసింది. కేవలం ముస్లింలకే సంస్కరణలు అవసరమని చెబుతున్న బిజెపి నేతల అభిప్రాయాలకు భిన్నంగా లా కమిషన్‌ పై సిఫార్సులు చేసినందునే ఆ నివేదికను చెత్త బుట్ట దాఖలు చేశారా ?
        మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు తీసుకునే పద్ధతిని నిషేధించి 'మన ముస్లిం కుమార్తెలకు' సాయం చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ, తలాక్‌ను ముఖ్యమైన మతాచారం కాదంటూ అది చట్టవిరుద్ధమని ప్రకటించింది సుప్రీంకోర్టని...లా కమిషన్‌ తన నివేదికలో పేర్కొనడం బహుశా మోడీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా పరిణమించి వుండవచ్చు. మోడీ ప్రభుత్వ చట్టాన్ని నేరుగా విమర్శించకుండా, గృహ హింసను నివారించడంపై పౌరచట్టం నిబంధనలను వర్తింపచేయడం ద్వారా ముస్లిం బాధిత మహిళను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం అవశ్యమని లా కమిషన్‌ పేర్కొంది. ఎందుకంటే...మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం మహిళలకు ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వకుండా, కేవలం ముస్లిం పురుషులను జైలుకు పంపుతుంది.
        తన ఎజెండాను అమలు చేయడానికి సంకుచిత రాజకీయ పరిశీలనలను అనుమతిస్తూ, మోడీ ప్రభుత్వం ఈ విలువైన నివేదికను పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరం. 2018లో ఈ నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. ఏ ఒక్క చట్టాన్ని తీసుకురాకుండా లేదా ఏ కమ్యూనిటీకి కూడా పర్సనల్‌లా లో సంస్కరణలు తీసుకువచ్చేందుకు తీవ్ర స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపకుండానే మోడీ ప్రభుత్వం తన రెండవ దఫా పదవీ కాలాన్ని మొత్తంగా వృధా చేసింది. యుసిసిని రుద్దేందుకు చేసిన ప్రయత్నాన్ని 21వ లా కమిషన్‌ తిరస్కరించిన తర్వాత, ఎలాంటి కారణాలు లేకుండానే, మరోసారి ఈ అంశాన్ని పరిశీలించాలంటూ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థి నేతృత్వంలో 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దాంతో మరోసారి అభిప్రాయాలు తెలియచేయాల్సిందిగా కోరారు. ఇదంతా కేవలం ప్రజల సమయాన్ని, ధనాన్ని వృధా చేయడమే. కమిషన్‌ను తన స్వంత విధుల నుండి, ప్రాధాన్యతల నుండి పక్కకు మళ్ళించడమే. అయితే మోడీ ప్రభుత్వ హయాంలో, ఈ అసంబద్ధత కూడా సాధ్యమే. ఇక్కడ మహిళల హక్కులకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నది వారి ఎజెండా కాదని, సమాజంలో చీలిక తెచ్చేందుకుగాను ఎన్నికల ఎజెండాతో ముందుకెళ్ళడానికే ఇదంతా అన్నది సుస్పష్టం.
          మహిళలందరి సమానత్వాన్ని పెంచగల-మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కుల దురహంకార నేరాల వ్యతిరేక చట్టం, వివాహ కాలంలో (వివాహ సమయంలో సంపాదించుకున్న ఆస్తులన్నింటికీ ఉమ్మడి యాజమాన్యం) ఏర్పాటు చేసుకున్న ఆస్తులన్నింటికీ కమ్యూనిటీ ఆఫ్‌ ప్రాపర్టీ లా, వైవాహిక బంధంలో అత్యాచారాన్ని నేరపూరితంగా ప్రకటించే చట్టం - వంటి పెండింగ్‌లో వున్న లౌకిక చట్టాలను అలక్ష్యం చేయడమో లేదా తిరస్కరించడమో చేస్తోంది. మోడీ ప్రభుత్వం తన మొదటి పదవీ కాలంలో గానీ లేదా రెండవ పదవీ కాలంలో కానీ ఇప్పటి వరకు మహిళల అనుకూల చట్టాన్ని ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకురాలేదు.
 

                                                     గిరిజనుల చట్టపరమైన నిబంధనలను నిర్వీర్యం చేయడం

ఇటీవల భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు రావడానికి తమ ప్రభుత్వ కృతనిశ్చయాన్ని మరోసారి చెప్పుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించే వారందరూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఒక సభ్యుడికి ఒక చట్టం, మరో సభ్యుడికి మరో చట్టం వుంటే, ఆ ఇల్లు లేదా కుటుంబం నడపగలమా? అటువంటపుడు ద్వంద్వ వ్యవస్థతో దేశాన్ని ఎలా పాలించగలం? అని ఆయన ప్రశ్నించారు. ఆయన అవగాహనలో లక్ష్యంగా చేసుకున్న ద్వంద్వ వ్యవస్థ అంటే ముస్లిం కమ్యూనిటీ పర్సనల్‌ చట్టాలు. అందుకే ఆయన పదేపదే మన ముస్లిం కుమార్తెలంటూ ప్రస్తావిస్తున్నారు.
         కానీ ఇక్కడ ఈ ద్వంద్వ వ్యవస్థలను మనకు అందచేసింది భారత రాజ్యాంగమనే విషయం భారత ప్రధానికి తెలియదని అనుకోగలమా? భారత్‌కి సంబంధించినంతవరకు దురదృష్టవశాత్తూ ప్రధాని రాజ్యాంగబద్ధమైన కళ్ళద్దాల్లో నుండి దేశాన్ని చూడడం లేదు. సంఘ పరివార్‌ రాజకీయ కళ్ళద్దాల్లో నుండి చూస్తున్నారు. అందువల్లే, ప్రధాని మొత్తంగా ముస్లిం కమ్యూనిటీ పట్ల తనకు గల మతపరమైన వ్యామోహాన్ని అధిగమించి మరీ, ఉమ్మడి పౌర స్మృతిని దేశంలో విధించడం వల్ల తలెత్తే పర్యవసానాల గురించి ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు.
           ''రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు సంబంధించి (ఉమ్మడి పౌర స్మృతి) సాధ్యాసాధ్యాలనేది మొట్టమొదటగా కనిపించే సమస్యగా వుంది.'' అని లా కమిషన్‌ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది (పేరా 1.23). త్రిపుర, అస్సాం, మిజోరాం, మేఘాలయలో నిర్దిష్ట ప్రాంతాలకు వర్తించే 244వ అధికరణం కింద ఆరవ షెడ్యూల్‌ ప్రత్యేకంగా జిల్లా, ప్రాంతీయ మండళ్ళను ఏర్పాటు చేసింది. ఈ షెడ్యూల్‌ కింద వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు వంటి కుటుంబ చట్టాలతో సహా పలు అంశాలపై గవర్నర్‌ అనుమతితో శాసనాలు రూపొందించే హక్కు వుంది. అదనంగా, 371ఎ, బి, సి, ఎఫ్‌, జి, హెచ్‌ అధికరణలు, ఆరు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు, మినహాయింపులను అందచేస్తున్నాయి. ఉదాహరణకు, 371ఎ అధికరణం నాగా తెగలకు, 371జి మిజో తెగలకు సంబంధించినది. సాంప్రదాయ చట్టానికి సంబంధించిన మతపరమైన, సామాజిక ఆచారాలు, సాంప్రదాయాలు, పౌర న్యాయం, క్రిమినల్‌ న్యాయం వంటి వాటిని కాపాడేందుకు ప్రత్యేక నిబంధనలను ఈ రెండు అధికరణలు అందిస్తున్నాయి. తమ సాంప్రదాయ చట్టానికి సంబంధించి తమ రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేసేలా ఏ చర్యలైనా తీసుకునేటపుడు ఈశాన్య ప్రాంతంలోని ఈ రాష్ట్రాల్లో గిరిజన తెగలు ఎలా ప్రతిస్పందిస్తాయి? ఇప్పటికే మణిపూర్‌ కొండ ప్రాంత గిరిజనుల వంటి వారు అనేక విషయాల్లో దెబ్బతిన్నారు. ఐదవ షెడ్యూల్‌ ఏరియాల్లో, షెడ్యూల్‌ ఏరియాలకు పంచాయితీ విస్తరణ చట్టాన్ని (పిఇఎస్‌ఎఎ) చేయడం ద్వారా గ్రామ సభలకు చట్టపరమైన హక్కులు ఇవ్వబడ్డాయి. స్వయం పాలన ద్వారా సాంప్రదాయ, సామాజిక ఆచారాలకు రక్షణ కల్పించబడింది. మధ్య, తూర్పు భారతంలో గిరిజన కమ్యూనిటీలు ఇప్పటికే నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దాడులకు గురయ్యాయి. ఈ విధానాలు వారి అటవీ భూములను లాక్కుంటున్నాయి. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని చూడడం వల్ల భారతదేశవ్యాప్తంగా గిరిజన తెగల రాజ్యాంగ, చట్ట నిబంధనలతో ప్రత్యక్ష ఘర్షణ తలెత్తుతుంది.
          ముందుగా దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. ద్వంద్వ వ్యవస్థలకు, గిరిజన తెగల రాజ్యాంగ, చట్ట నిబంధనలకు ప్రధాని, ఆయన ప్రభుత్వం, పార్టీలు వ్యతిరేకమా? ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా రుద్దేందుకుగాను ఆయన ఈ రక్షణలన్నింటినీ రద్దు చేయాలని చూస్తున్నారా? లేదా గిరిజన తెగలకు కాకుండా కేవలం ముస్లింలకు మాత్రమే ఉమ్మడి పౌర స్మృతి వర్తిస్తుందా? వీటిపై ప్రధాని తన వైఖరిని స్పష్టం చేయాల్సి వుంది.

/వ్యాసకర్త సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు/
/మిగతా భాగం రేపటి సంచికలో/
బృందా కరత్‌

బృందా కరత్‌