- మూడేళ్లుగా తగ్గుతున్న పన్నుల వాటా
- అయినా సమస్యలు అధిగమిస్తున్నాం
- శాసన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలకు సక్రమంగా పంచడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో శుక్ర వారం పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడులు అనే అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి పన్నుల వాటా అంశాన్ని ప్రస్తావించారు. చట్ట ప్రకారం పన్నుల వాటాను రాష్ట్రాలకు కేంద్రం పంచడం లేదని చెప్పారు. 2019వ సంవత్సరం తరువాత ఈ కేటాయింపులు గణనీయంగా తగ్గాయని, మూడేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన ఈ వాటా మొత్తం తగ్గుతూనే ఉందని వివరించారు. 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం సెస్, సర్‌ఛార్జి మినహాయించి 42 శాతం వాటా పన్నుల్లో రావాల్సి ఉందని, 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం 2025 వరకూ 41 శాతం వాటా రావాలని చెప్పారు.
ఈ సిఫార్సులను కేంద్రం ఏ మాత్రం పట్టంచుకోవడం లేదని, ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం ఉండటం లేదని అన్నారు.. నిధులు తగ్గించి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతోందని చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో కేంద్రానికి రూ.14,49,958 కోట్ల ఆదాయంరాగా అందులో రాష్ట్రాలకు రూ.5,06,193 కోట్లు అంటే 34.91 శాతం ఇచ్చారని, ఆర్థిక సంఘం ప్రకారం 42 శాతం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఐదేళ్లలో సరాసరిన 34 శాతం లేదా 35 శాతానికి మించి రావడం లేదని చెప్పారు. ఆ మొత్తంలో రాష్ట్రానికి వచ్చేది 4.30 శాతమేనని అన్నారు. ఈ సందర్భంగా 2015-16 నుండి గణాంకాలను సిఎం వివరించారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా మారిందని, అయినా, అయినా పరిపాలనలో మార్పులు, నగదు బదిలీతో మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చామని చెప్పారు. గత మూడేళ్లలో ద్రవ్యలోటు విషయం లోనూ మెరుగ్గా ఉందని వివరించారు. 2014-19 వరకూ అంధ్రప్రదేశ్ సగటు ద్రవ్యలోటు 6.58 శాతమని, ఈ మూడేళ్లలో 5.73 శాతానికి తగ్గిందని వివరించారు. రుణాల చెల్లింపులోనూ మెరుగ్గా ఉన్నామని తెలిపారు. 2021-22లో వడ్డీ కింద రూ.21,449 కోట్లు అసలు కింద రూ.14,559 కోట్లు మొత్తం రూ.36,008 కోట్లు రుణాల కింద చెల్లించామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర సొంత ఆదాయం రూ.75,696 కోట్లకు పెరిగిందని, దీనిలో 47.6 శాతం మాత్రమే అప్పులు చెల్లించేందుకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
కోవిడ్ వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిందని. ప్రసుత్తం ఎకానమీ గ్రోత్‌రేట్ పెరుగుతోందని తెలిపారు. ఈ అంచనాలను పరిశీలిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి మెరుగుపడు తుందని చెప్పారు. అప్పుల విషయపై రాద్దాంతం చేస్తున్నారని, అయినా గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ అప్పులే చేశామని చెప్పారు. కేంద్రం కూడా అప్పులు చేసిందని, స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు పతాకస్థాయికి చేరాయన్నారు. 2014-15లో జిడిపి రూ.123 లక్షల కోట్లని, అదే సమయంలో కేంద్రం చేసిన అప్పులు రూ.62,42,220 కోట్లని తెలిపారు. 2020-21లో జిడిపి రూ.198,00,198 కోట్లు కాగా ఆ ఏడాది కేంద్రం అప్పులు రూ.120,79,018 కోట్లని తెలి పారు. అంటే జిడిపిలో అప్పులు 61 శాతానికి పెరిగా యని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం వైసిపి హయాంలో అప్పులు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.











