
దేశంలో నిరుద్యోగిత రికార్డులు బద్దలు కొడుతున్న తీరు ఉపాధి రహిత జాతి నిర్మాణ దిశను తెలుపుతుంది. డిసెంబర్‌లో నిరుద్యోగిత పెరుగుదల రేటు 8.3 శాతానికి చేరుకుంది. గడచిన 16 మాసాల్లో ఇది గరిష్టం. పట్టణ నిరుద్యోగిత అంతకుముందు నెలలో 8.96 శాతం ఉండగా డిసెంబర్‌లో ఏకంగా 10.09 శాతానికి ఎగబాకింది. గ్రామాల్లో నిరుద్యోగిత 7.55 శాతం నుంచి 7.44 శాతానికి స్వల్పంగా తగ్గింది. అత్యధికంగా హర్యానాలో నిరుద్యోగిత 37.4 శాతానికి పెరిగింది. రాజస్థాన్ 28.5 శాతంతో రెండవ స్థానంలో, ఢిల్లీ 20.8 శాతంతో మూడవ స్థానంలో ఉంది. నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న సమయాన ఈ కఠోర వాస్తవాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) బయటపెట్టింది. నిరుద్యోగిత విజృంభణపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి సందర్భంలోనూ గిట్టని ఆరోపణలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కొట్టి పారేస్తుంది. సిఎంఐఇ, ఐఎల్‌ఒ, నేషనల్ శాంపిల్ సర్వే, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల నివేదికలపై ఏం సమాధానం చెబుతుంది? తామొస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చిన ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా? కొత్త ఉద్యోగాల సంగతేమో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల వలన పదుల లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు కోల్పోయిన దయనీయత నెలకొంది.
ఉద్యోగ, ఉపాధి, నిరుద్యోగిత తీరుతెన్నులు తప్పక ఆందోళన కలిగిస్తాయి. 2013లో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 44 కోట్లు కాగా 2021లో 38 కోట్లు. ఇదే సమయంలో పని చేయగలిగినవారి సంఖ్య 79 కోట్ల నుంచి 106 కోట్లకు పెరిగింది. 2013లో శ్రామిక శక్తిలో మహిళలు 36 శాతం ఉండగా 2021లో 9.24 శాతానికి దిగజారింది. కరోనా కంటే ముందు శ్రామికుల భాగస్వామ్యం 43 శాతం కాగా ఇప్పుడు 40 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలన్నీ నిరుద్యోగ భూతం ఎంతలా జడలు విప్పుతున్నదో విశదీకరిస్తాయి. మన దేశం స్థిరపర్చిన మానవాభివృద్ధి ప్రమాణాలనుబట్టి 15-29 సంవత్సరాల్లోపు వారిని యువతగా పరిగణిస్తారు. దేశ జనాభాలో వీరు 27.2 శాతం. దాదాపు 37 కోట్లకుపైమాటే. పట్టణాల్లో 9 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. పట్టణ ప్రాంతాల్లోని యువతలో 23 శాతం మంది నిరుద్యోగులే. అటువంటి యువత ఉద్యోగ, ఉపాధిపై మోడీ ప్రభుత్వానికి లవలేశమాత్రమైనా దృష్టి లేదనడానికి ఈ లెక్కలు సరిపోతాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, సన్ రైజ్ ఇండియా వంటి మోడీ ప్రభుత్వ నినాదాలు వాగాడంబరం, డంబాచారమేనని నిరూపితమైంది. ఉద్యోగాలడిగితే, వీధుల వెంబడి పకోడీలు అమ్ముకోవడమూ ఉద్యగమేనని యువతను హేళన చేసి మాట్లాడటం మోడీ, ఆయన మంత్రులకే చెల్లింది.
ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుకు చేరుతోందని ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యుటిఒ, సహా పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ జిడిపి వృద్ధి 3 శాతం ఉంటే పెద్ద గొప్పంటున్నాయి. కానీ బిజెపి సర్కారు మాత్రం ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదుగుతామని గొప్పలు చెబుతోంది. ఇప్పటికే దేశంలో పారిశ్రామిక ప్రగతి ప్రతిష్టంభనలో కొనసాగుతోంది. పెట్టుబడుల్లేక ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతోంది. 2021 అక్టోబర్‌తో పోల్చితే 2022 అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి రేటు 4 శాతం తక్కువగా ఉందని పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఐఐపి) వెల్లడించింది. తయారీరంగం వృద్ధి 5.4 శాతం పడిపోయింది. వినిమయ వస్తూత్పత్తి 15.3 శాతం, వినిమయేతర వస్తూత్పత్తి 13.4 శాతం క్షీణించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి దిగజారుడుకు ఇది సంకేతం. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, కరోనా ప్రభావం, అధిక ధరలు, ప్రభుత్వ విధానాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. ఉపాధి హామీ విస్తరణ, మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు కొంత వరకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు తోడ్పడతాయి. మోడీ ప్రభుత్వం భుజానికెత్తుకున్న నయా-ఉదారవాద విధానాలు ప్రభుత్వ పెట్టుబడులను అంగీకరించవు. యువత, నిరుద్యోగులు, ప్రజలు మోడీ ప్రభుత్వంతో తేల్చుకోవడమే మార్గం.