Aug 28,2022 09:26

వినాయచవితి అనగానే ఉండ్రాళ్లు గుర్తుకొస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే వాటిని చేసే విధానం బాగుండాలి. ఈ పండుగకు ఉండ్రాళ్లు.. తాలికలు.. కుడుములు.. పాయసం.. కొన్నిచోట్ల తుమ్మి ఆకుతో పచ్చడి, బొబ్బట్లు కూడా చేసుకుంటారు. అవి సరిగ్గా కుదిరితే ఓ పట్టుపట్టేస్తాం.. మరి అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

 ఉండ్రాళ్లు

                                                              చిన్న ఉండ్రాళ్ల పాయసం

కావలసిన పదార్థాలు :
నీళ్లు - తగినన్ని, పాలు - కప్పు, ఉప్పు - చిటికెడు, పంచదార -2 స్పూన్లు, బెల్లం - కప్పు, నెయ్యి - 3 టీ స్పూన్స్‌, బియ్యప్పిండి - కప్పు, బియ్యం రవ్వ -3 స్పూన్లు, జీడిపప్పు, కిస్మిస్‌, ఎండుకొబ్బరి ముక్కలు - 2 స్పూన్లు చొప్పున, యాలకుల పొడి - చిటికెడు

తయారీ :
స్టవ్‌ మీద పాన్‌ పెట్టి కప్పు వాటర్‌ పోసి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి తిప్పాలి. దీనిలో కప్పు బియ్యం పిండి వేసి బాగా కలిసేలా ఉండలు లేకుండా తిప్పి, దగ్గరపడ్డాక మూతపెట్టి, స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. కొద్దిసేపటి తర్వాత ఈ పిండిని బాగా చేతితో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీది మందపాటి గిన్నె పెట్టి గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు చేసిపెట్టుకున్న చిన్న ఉండ్రాళ్లు ఉంచి, మూతపెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూడు స్పూన్ల బియ్యం రవ్వ కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కప్పు పాలు పోసి, కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత కప్పు తరిగిన బెల్లం వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసి కలపాలి. బెల్లం కరిగిపోయాక మళ్లీ స్టవ్‌పై ఉంచి, యాలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌, ఎండుకొబ్బరి ముక్కలు వేసి, రెండు నిమిషాల తర్వాత దింపేసుకోవాలి.

 

 ఉండ్రాళ్లు

                                                                        ఉండ్రాళ్లు

కావలసిన పదార్థాలు :
బియ్యపురవ్వ- కప్పు, నీళ్లు- రెండు కప్పులు, శనగపప్పు - పావు కప్పు (నానబెట్టాలి), జీలకర్ర - టీ స్పూన్‌, నెయ్యి - మూడు టీ స్పూన్లు, ఉప్పు-తగినంత, పచ్చికొబ్బరి - 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ : ముందుగా మందపాటి పాత్రలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, శనగపప్పు వేసి కొద్దిగా వేయించాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరుగుతుండగా, బియ్యపు రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. చల్లారాక చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు చుట్టాలి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. దింపేసిన కొద్దిసేపటి తర్వాత తీసుకోవాలి.

bellam kudumulu

 

                                                                బెల్లం కుడుములు..

కావలసిన పదార్థాలు :
నీళ్లు - తగినన్ని, బెల్లం - 3/4 కప్పు, బియ్యంపిండి - కప్పు, ఉప్పు - చిటికెడు, శనగపప్పు -2 స్పూన్లు (నాలుగు గంటలు నానబెట్టాలి), పచ్చికొబ్బరి తురుము- 2 స్పూన్లు, నెయ్యి - తగినంత, యాలకుల పొడి - అర టీస్పూన్‌.
 

తయారీ :
స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అర కప్పు వాటర్‌ పోసి, మరుగుతున్నప్పుడు ముప్పావు కప్పు బెల్లం వేసి కరిగించాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం నీళ్లను పక్కనబెట్టి స్టవ్‌ మీద మరో గిన్నె తీసుకుని కప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇందులో చిటికెడు ఉప్పు, నానబెట్టిన శనగపప్పు వేయాలి. శనగపప్పు ఒక ఉడుకు ఉడికాక పచ్చికొబ్బరి తురుము కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇందులో బెల్లం నీళ్లను వడపోసి పోసుకోవాలి. చివరిలో యాలకులపొడి కూడా వేసి కలపాలి. ఇవి మరుగుతున్నప్పుడు కప్పు బియ్యంపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలిశాక కొద్దిసేపు పక్కనపెట్టాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు నేతిని చేతికి రాసుకుని, కుడుములు చేసుకోవాలి. ఇవి అన్నంముద్దల్లా, గుండ్రంగా, అప్పాల్లా రకరకాల ఆకారాల్లో చేసుకోవచ్చు. చేసిన వాటిని ఇడ్లీ పాత్రలో ప్లేట్లకు నెయ్యి రాసి ఆవిరి మీద పదినిమిషాలు ఉడికించాలి.

 ఉండ్రాళ్లు


 

                                                                     బెల్లం తాలికలు

కావలసిన పదార్థాలు :
బియ్యప్పిండి - గ్లాసు, గోధుమపిండి - అర గ్లాసు, బెల్లం - 2 గ్లాసులు, ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు, బాదం పలుకులు - తగినన్ని, యాలకుల పొడి - చిటికెడు
 

తయారీ :
స్టవ్‌ మీద గిన్నె ఉంచి, అందులో అరగ్లాసు నీళ్లు పోసి, కొద్దిగా బెల్లం వేసి కరిగించాలి. దీంట్లో గోధుమపిండి వేసి చపాతీపిండిలా కలపాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ సన్నగా తాలికలు చేసుకోవాలి. ఒక మందపాటి గిన్నె స్టౌవ్‌ మీద ఉంచి, ఒకటిన్నర గ్లాసుల నీళ్లుపోయాలి. నీళ్లు మరుగుతుండగా బెల్లం కరిగించి, చేసుకున్న తాలికలను వేసి ఉడికించాలి. దీంట్లో బియ్యప్పిండి కూడా పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం బాగా ఉడికాక, యాలకుల పొడి, నేతిలో వేయించిన బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు వేసి, కలపాలి.