Jul 07,2022 06:38

నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని వైపులా ఆర్థికంగా దిగజారుతున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కీలక సూచీలన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా పతనమౌతున్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటి పరుగులు తీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజానీకం జీవనం దుర్భరంగా మారుతున్నా సామాన్యులను దోచి కార్పొరేట్లకు పందారం చేసే మోడీ ప్రభుత్వ వైఖరిలో ఇసుమంత కూడా మార్పు రావడం లేదు. గ్యాస్‌ సిలిండర్‌ ధర 50 రూపాయలు పెంచి, సామాన్యులపై పెనుభారం మోపిన తాజా నిర్ణయం ఇటువంటిదే. ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకి తగ్గుతోంది. ఇది వివిధ రకాల వస్తు, సేవల ఉత్పత్తులపై పడుతోంది. మార్కెట్‌ తగినంతగా లేకపోవడంతో పరిశ్రమలు మూతపడటమో, ఉత్పత్తులను తగ్గించుకోవడమో చేయక తప్పని స్థితి ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. ఫలితంగా నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. నిజవేతనాల స్థాయి గణనీయంగా పడిపోయింది. ప్రజానీకం, ముఖ్యంగా యువత అభద్రతతో కొట్టుమిట్టాడుతుంటే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాలను వెతుక్కుంటూ తమ మదుపులను ఇతర దేశాలకు తరలిస్తున్నారు. దాంతో రూపాయి విలువ రోజురోజుకీ పతనమౌతూ దేశ ప్రజలను రుణ సంక్షోభం ముందుకు నెడుతోంది.
వాస్తవాలు ఇలా ఉంటే రెండు వారాల క్రితం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ వార్షికాంతానికల్లా 7.5 శాతం వృద్ధిరేటును సాధిస్తామని చెప్పడమే ఆశ్చర్యం. ఒకవైపు ఆయన ఈ మాటలు చెబుతుంటే మరోవైపు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు దేశ ఆర్థికవృద్ధికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగు లోకి తీయడంలో నిమగమైనాయి. ఈ రెండు వారాల్లో వెలువడిన వివిధ నివేదికలే దీనికి నిదర్శనం. ప్రధాని అట్టహాసంగా ప్రకటించిన ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పనికాదని ఐఎంఎఫ్‌ తేల్చివేసింది. దేశ రుణభారం గణనీయంగా పెరిగిందని పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక పేర్కొంది. మోడీ గద్దెనెక్కిన 2015లో 63,03,914 కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు ఈ ఏడాది మార్చి 31 నాటికి 1,33,22,727 కోట్లకు (111.34 శాతం పెరుగుదల) చేరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 31 వేల కోట్ల రూపాయలు తగ్గాయి. దేశీయ తయారీ రంగ వృద్ధి 9 నెలల కనిష్టానికి పడిపోయింది. ఉత్పత్తిదారుల విశ్వాసం ఎన్నడూ లేని విధంగా 27 నెలల దిగువకు చేరింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థితి కూడా ఇంతే! మోడీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసుకున్న స్టార్టప్‌లు కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఒలా, బ్లింకింట్‌, బైజూస్‌, అన్‌అకాడమీ, వేదాంత, కార్స్‌ 24, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ వంటి సంస్థలు తమ సిబ్బందిని కుదించాయి. ఈ రంగం నుండి మరో 60 వేల మంది ఈ సంవత్సరాంతానికి నిరుద్యోగులుగా మారనున్నారంటూ ఇటీవల వచ్చిన ఒక సర్వే ఆందోళన కలిగిస్తోంది. అదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం. మరోవైపు రూపాయి విలువ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6.5 శాతం మేర రూపాయి పడిపోయింది. దీంతో విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితే శ్రీలంకలో సంక్షోభానికి దారి తీసింది. అదే పరిస్థితి మన దేశంలోనూ రాకూడదంటే ప్రభుత్వ ప్రాధాన్యతల్లో తక్షణం మార్పు రావాలి. ప్రజల కొనుగోలుశక్తి పెంచడానికి అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకోవాలి. ఇప్పటిదాకా ప్రజల మూలుగుల నుండి కూడా లాభాలు పిండుకున్న కార్పొరేట్ల మీద పన్నులు విధించడంతో పాటు, ప్రభుత్వరంగ సంస్థలను పటిష్టం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలి. ఇటువంటి చర్యలే దేశ సుస్థిరాభివృద్ధికి, ప్రజల నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తాయి.