Oct 19,2022 07:21

         మంత్రులను పదవుల నుండి తొలగిస్తానంటూ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రకటించడం అత్యంత అప్రజాస్వామికం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా బెదిరించడాన్ని ఏ మాత్రం అంగీకరించినా అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. రాజ్యాంగాన్ని తృణీకరించి నియంతృత్వ పోకడలకు, ఫెడరల్‌ వ్యవస్థ పతనానికి దారి తీస్తుంది. ఈ తరహా ప్రకటనలను, మాటలను మొగ్గలోనే తుంచాల్సిన బాధ్యత ప్రజాతంత్ర వాదులందరిపైనా ఉంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం తక్షణమే స్పందించింది. 'హద్దులు దాటుతున్నారు' అంటూ గవర్నర్‌ కార్యాలయాన్ని హెచ్చరించింది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఒక్క మంత్రిని కూడా తొలగించలేరని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి బాధ్యత వహించాల్సిన గవర్నర్లు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తే ఇలాంటి స్పందన అనివార్యం. ఆహ్వానించదగినది కూడా! కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో నియామకం జరిగినప్పటి నుండి ఆయనది ఈ తరహా ఏకపక్ష ధోరణే! అప్పటి నుండి ఆయన వికృత ధోరణులను కేరళ ప్రభుత్వం కష్టమైనా భరించింది. శ్రుతిమించినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియచేసింది. అయినా ఆయన ప్రవర్తనలో ఇసుమంత మార్పు కనిపించకపోగా, మరింతగా బరితెగించడాన్ని కేరళ ప్రజలతో పాటు దేశమంతా గమనిస్తూనే వుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి, దేశ ప్రజలను చీల్చి, మతోన్మాదాన్ని పెంచడంలో అది పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి సంస్థ అధినేతను కలవడానికి రాజ్‌భవన్‌ను విడిచి, అది కూడా రాత్రిపూట ఒంటరిగా గవర్నర్‌ వెళ్లడం ఏమిటి? ఈ భేటీ జరిగిన తరువాత ఎవరైనా గవర్నర్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ, బిజెపితోనూ ముడిపెట్టి విమర్శిస్తే తప్పేమిటి ?
          కేరళలోని 13 విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్ల నియామక ప్రక్రియకు సంబంధించినదానితో పాటు పలు కీలక బిల్లులపై సంతకాలు చేయకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌పై ఈ తరహా విమర్శలే అక్కడి మంత్రులు చేశారు. రాజ్‌భవన్‌ బయట ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ను ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కలిసినప్పుడు గుర్తుకురాని రాజ్‌భవన్‌ ప్రతిష్ట ఖాన్‌కు మంత్రుల విమర్శలతో గుర్తుకు వచ్చింది. రాజ్యాంగంలోని 164(1) అధికరణం గవర్నర్‌ విశ్వాసం ఉన్నంత కాలమే మంత్రులు పదవులో ఉంటారని పేర్కొంది. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాలకు లోబడే గవర్నర్‌ వ్యవహరించాలని కూడా రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. దీనిని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించి 'రాజ్‌భవన్‌ ప్రతిష్టకు భంగం కలిగిస్తే నా విశ్వాసాన్ని వెనక్కి తీసుకోవడానికి వెనకాడను' అంటూ ట్విటర్‌లో ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ హెచ్చరించారు. నిజానికి ముఖ్యమంత్రి సలహా, సూచనల మేరకే గవర్నర్‌ మంత్రులను నియమిస్తారు. స్వతంత్రంగా నియమించే అధికారమే లేనప్పుడు తొలగించే హక్కు ఎక్కడి నుండి వస్తుంది? రాజ్యాంగ నిపుణుడు, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ పిడిటి ఆచార్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. 'రాజ్యాంగంలో పేర్కొన్న విశ్వాసం అనే పదం గవర్నర్‌కు స్వతంత్రంగా ఒక మంత్రిని నియమించే అధికారం గానీ, తొలగించే అధికారంగానీ ఇవ్వలేదు.' అని ఆయన వివరించారు. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై ఏదోరకంగా విషం చిమ్మాలన్న దుగ్ధలో ఆయన లాజిక్‌ను మిస్‌ అయ్యారు. ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో ప్రభుత్వాల సంఖ్యా బలం రాజ్‌భవన్‌లో కాకుండా శాసనసభలోనే తేలాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని కూడా పట్టించుకోలేదు. వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై తన వ్యతిరేకతను మరోసారి బాహాటంగా చాటుకోవడం తప్ప ఆయన సాధించిందేమీ లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లు కేంద్రానికి పావులుగా వినియోగింపబడుతున్నారు. రాజ్‌భవన్‌లను పునరావాస కేంద్రాలుగా మార్చేందుకు ఉపయోగపడుతున్న గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్నది ప్రజాస్వామ్యవాదుల చిరకాల డిమాండ్‌గా ఉంది. రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ఈ తరహా ప్రకటనలు ఒక గవర్నర్‌ నోటి వెంట పదేపదే రావడం ప్రమాదకరం. అందుకే, రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలి. ఈ ధోరణిని అరికట్టాలి.