
నిజాలను ఎదుర్కోలేని వారు అసత్య ప్రచారాన్నే నమ్ముకుంటారు. మోడీ సర్కారు పరిస్థితి అలాగే ఉంది. గోడీ మీడియా ద్వారా నిరంతరం అబద్ధాలను ప్రచారంలో పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం, లేని అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించడం అలవాటైన కేంద్ర ప్రభుత్వానికి నిజాలు నిద్రపట్టనీయడం లేదు. అందుకే గద్దెనెక్కింది మొదలు గణాంకాల గొంతు నులిమేందుకు సర్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటూ జాతీయ కుటుంబ సర్వేలు నిర్వహించే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) డైరెక్టర్ కెఎస్ జేమ్స్‌ను కేంద్రప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది. సంస్థ విడుదల చేసిన సర్వే వివరాలు... సాక్షాత్తూ ప్రధాని చెబుతున్న మాటలన్నీ అబద్ధాలని నిర్ధారించిన నేపథ్యంలోనే ఈ సస్పెన్షన్ జరిగింది.
స్వచ్ఛభారత్, ఉజ్వల యోజన తదితర పథకాల అమలుపై మోడీ సర్కారు ప్రచారమంతా శుద్ధ అబద్ధమని ఐఐపిఎస్ సర్వే బహిర్గతం చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి ఐదేళ్లయిన సందర్భంగా దేశం బహిరంగ మల విసర్జన (ఒడిఎఫ్) నుంచి పూర్తిగా బయటపడిందని, 60 కోట్ల మంది ఆ అలవాటుకు దూరమయ్యారని 2019 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించారు. ఐఐపిఎస్ సర్వే-5లో నేటికీ దేశంలో దాదాపు ఐదో వంతు (19 శాతం) కుటుంబాలు మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటకు పోతున్నారని నిర్ధారణ అయ్యింది. గ్రామీణ మహిళలకు సబ్సిడీపై వంట గ్యాస్ అందిస్తున్నందున వారికి కన్నీళ్లు తప్పాయని కేంద్రం ప్రచారం చేసుకుంటోంది. తాజా సర్వేలో 57 శాతం ఇళ్లకు వంట గ్యాస్ సౌకర్యం అందుబాటులో లేదని తేలింది. ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత గత సర్వేల్లో కంటే అధికంగా ఉందని సర్వే తేల్చింది. 'పోషణ్ అభియాన్' పేరుతో కేంద్రం ప్రచారం హోరెత్తిస్తుండగా.. దేశంలో రక్తహీనత భారీ స్థాయిలో ఉందని ఈ సర్వే నిర్ధారించింది. ఫిబ్రవరిలో ఐఐపిఎస్ కౌన్సిల్ సమావేశంలో రక్తహీనతకు సంబంధించి సంస్థ ఇచ్చిన డేటాపై కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పశ్చిమ దేశాల కుట్రలో భాగమేనా? అంటూ జేమ్స్‌ను ప్రశ్నించారు. అంతేగాక సర్వే-6లో రక్తహీనతకు సంబంధించి వివరాలు లేకుండా చేసేశారు.
వినిమయం, వ్యయం తదితర అధ్యయనాలను మోడీ ప్రభుత్వం తన మొదటి విడత పాలనాకాలంలోనే పక్కనపెట్టింది. సర్వేల కొలబద్దలను మార్చేసింది. జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి) లెక్కింపునకు ప్రామాణిక సంవత్సరాన్ని మార్చేసింది. హౌస్‌హోల్డ్ సర్వేకు 2011-12 ఏడాది బేస్ ఇయర్‌గా ఉండగా, 2017-18ని ప్రామాణికంగా తీసుకుంటామని ప్రకటించింది. 2019 జనవరిలో దేశంలో నిరుద్యోగంపై వచ్చిన సమాచారాన్ని సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ తొక్కిపెట్టింది. ఈ చర్యకు నిరసనగా జాతీయ గణాంకాల కమిషన్ తాత్కాలిక ఛైర్మన్ పిసి మోహనన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పదేళ్లకు ఒకసారి చేయాల్సిన జనగణనను వాయిదా వేస్తూ వస్తోంది. ప్రణాళికా సంఘాన్ని అటకెక్కించింది. నీతి ఆయోగ్ పేరుతో తనకు నచ్చిన నివేదికలు తయారు చేయించుకుంటూ రాష్ట్రాల నిధులను కొల్లగొడుతోంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు చేయడం, ప్రభుత్వం నిర్దేశించే ఇతర బాధ్యతలు నిర్వహించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన 2018లో ముంబై కేంద్రంగా ఐఐపిఎస్ ప్రారంభమైంది. దాని డైరెక్టర్ జేమ్స్ నేతృత్వంలో ఐఐపిఎస్ ఎంతో చురుగ్గా పనిచేస్తూ డేటా సేకరణ, విశ్లేషణల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టిందని పలువురు ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశంసిస్తున్న తరుణంలో ఆయనను సస్పెండ్ చేయడం గర్హనీయం. శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో నిధులు, నియామకాలు, రిజర్వేషన్లు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో సస్పెన్షన్‌లో పెట్టామంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇద్దరు అదనపు కార్యదర్శులు సభ్యులుగా ఉన్న 12 మంది కమిటీ ఆధ్వర్యాన జరిగే నియామకాలకు ఆయన ఒక్కడే బాధ్యుడెలా అవుతాడో ఏలిన వారికే తెలియాలి. వాస్తవాలను స్వీకరించి సరిదిద్దుకోకుండా నిజాలను పాతరేసేందుకు చేసే ప్రయత్నాలు బెడిసికొడతాయని చరిత్ర మనకు చెబుతోంది. నిజం నిప్పు లాంటిది. దాన్ని ఎవరూ దాచిపెట్టలేరు.