ప్రజాశక్తి-నగరం (బాపట్ల జిల్లా) : బాపట్ల జిల్లా నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన చింతల వెంకట ధనుంజయ ఉమాశంకర్‌కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పిహెచ్‌డి పట్టా ప్రదానం చేసింది. 'శబ్దకాలుష్యంలోనూ స్పష్టంగా మాట్లాడగలిగేందుకు వినియోగించుకోదగిన ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై విశ్లేషణ' అనే అంశంపై పరిశోధన వ్యాసాన్ని సమర్పించినందుకు గాను ఆయన ఈ పట్టా అందుకున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డైక్ మెన్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన 39, 40వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉమాశంకర్‌కు రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్, జస్టిస్ ఎస్ అబ్దుల్‌నజీర్, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య పి రాజశేఖర్ పిహెచ్‌డి పట్టాను అందజేశారు. ఉమాశంకర్ జాతీయ అవార్డు గ్రహీత చింతల వెంకట శేషసాయిప్రసాద్ కుమారుడు. అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ నానాటికీ పురోగమిస్తున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం సమాజానికి మరింత చేరువయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో యువతను తీర్చిదిద్దేందుకు పరిశ్రమిస్తానని తెలిపారు. భారతదేశ యువత చంద్రయాన్-3 లాంటి మరెన్నో విజయాలను చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.










