Jul 18,2023 10:23

మాస్కో : క్రిమియా బ్రిడ్జిని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి జరిపిందని రష్యా జాతీయ తీవ్రవాద నిరోధక కమిటీ (ఎన్‌ఎకె) సోమవారం ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3గంటలకు ఉక్రెయిన్‌కి చెందిన రెండు మానవరహిత సముద్ర వాహనాలు క్రిమియా ద్వీపాన్ని, రష్యాతో కలుపుతున్న కీలకమైన లింకుపై దాడి చేశాయని ఎన్‌ఎకె ప్రకటన పేర్కొంది. ఫలితంగా క్రిమియా బ్రిడ్జిలో రోడ్డు భాగం ధ్వంసమైంది, ఇద్దరు పెద్దవారు మరణించగా, ఒక చిన్నారి గాయపడ్డారని ఆ ప్రకటన తెలిపింది. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయని పేర్కొంది. ఉక్రెయిన్‌ భద్రతా బలగాలు, నావికా దళాలు నిర్వహించిన ఈ దాడిని ప్రత్యేక ఆపరేషన్‌గా ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎకె ప్రకటన వెలువడింది. ఈ దాడికి తమదే బాధ్యత అని ఉక్రెయిన్‌ అధికారులు బహిరంగంగా ప్రకటించలేదు. పరోక్షంగా ఈ సంఘటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన దంపతులు ఈ దాడిలో మరణించారని, వారి కుమార్తె గాయపడిందని బెల్గోరాడ్‌ గవర్నర్‌ తెలిపారు.