
పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక, ద్రవ్యపరమైన ఆంక్షలు మొదట్లో కొంత ప్రభావం చూపించినట్లు అనిపించింది. రష్యా రూబుల్ మునిగి, వ్యాపార లావాదేవీలను తన బ్యాంకుల ద్వారా జరపడం కనాకష్టంగా ఉండేది. డబ్బు బదలాయింపు, తీసుకోవడం వంటి కార్యకలాపాలు నిర్వహించగలిగే స్థితిలో రష్యన్ బ్యాంకులు లేవు. అయితే, అనతి కాలంలోనే దాని నుంచి రష్యా కోలుకుని గ్యాస్, చమురు అమ్మకాలు రూబుల్ కరెన్సీ లోనే చెల్లించాలని పట్టుబట్టింది. భారత్‌తో రూపాయిల్లోను, చైనాతో యువాన్లలోను చెల్లింపులు జరిపేలా ఒప్పందం కుదుర్చుకుని చమురు, గ్యాస్ అమ్మకాలు కొనసాగించింది. ఇతర దేశాలకు కూడా అమ్మకాలు సాగించింది. రష్యా రూబుల్ మట్టి కరవక తప్పదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన తప్పు అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. తన గ్యాస్, చమురు వనరుల దన్నుతో రూబుల్ బలం పుంజుకుంది. ఈ ఆంక్షల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది యూరోపియన్ యూనియన్ దేశాలే.
అమెరికా, దాని మిత్ర పక్షాలు చెప్పే నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమానికి అర్థాలే వేరు. అవి చెప్పే అంతర్జాతీయ క్రమం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయం, చట్టాల ఆలంబనగా నడిచేది కాదు. వాటిని తోసిరాజని తాను నిర్దేశించిన నియమ నిబంధనల ఆధారంగా నడిచేదన్న మాట. సోవియట్ యూనియన్ పతనం, సోషలిస్టు బ్లాక్ విచ్ఛిన్నమైన తరువాత తమ ఆధిపత్యాన్ని ఏ దేశమూ సవాల్ చేయగలిగే స్థితి లేదని అమెరికా, దాని మిత్ర దేశాలు భావించాయి. సైనిక పరంగా గత 30 సంవత్సరాల్లో ప్రపంచంలో తిరుగులేని శక్తిగా అమెరికా అధికారం చలాయించింది. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తన ఆధిపత్యాన్ని పటిష్టపరచుకోజూసింది. రష్యాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించి ఇరాన్, వెనిజులా మాదిరి రష్యన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయొచ్చు అని పశ్చిమ దేశాలు కలలుగన్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ పెట్రోలు, గ్యాస్ ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నది కాబట్టి దాని చెల్లింపుల మెకానిజాన్ని స్తంభింపజేయడం, దాని విదేశీమారక ద్రవ్య నిల్వలను స్తంభింపజేస్తే రష్యా అన్ని రకాల కొరతలను ఎదుర్కొం టుంది. అప్పుడు ప్రజల్లో పెద్దయెత్తున అసంతృప్తి రగిలి, తాము ఆశించినట్లు ప్రభుత్వ మార్పు సాధ్యమవుతుందని అమెరికా, దాని మిత్ర దేశాలు భావించాయి. రష్యా ప్రధానంగా చమురు, గ్యాస్ స్టేషన్లపై ఆధారపడిన దేశమని, పశ్చిమ దేశాలు ప్రచారం చేసుకున్నాయి. అవి అనుకున్నట్టు రష్యా కేవలం ఆయిల్, గ్యాస్, బొగ్గు ఉత్పత్తిదారు మాత్రమే కాదు, వ్యవసాయ ఉత్పతులు, ఎరువులు, ప్రపంచ పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన స్టీల్, ఇతర ఖనిజాల ఎగుమతి దారు కూడా. రెండో అంశం పశ్చిమ దేశాల నుంచి అది ఇప్పటికే అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచంలో మరే దేశం కన్నా స్వావలంబన కలిగిన దేశంగా కొనసాగుతున్నది. మూడవ అంశం మిలిటరీతో సహా దాని పారిశ్రామిక రంగం ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లా కాకుండా మొత్తం మీద స్వయం సమృద్ధమైనది.
రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు విఫలం
రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు రెండు భాగాలు. ఒకటి తమ సెంట్రల్ బ్యాంక్‌తో సహా పలు రష్యన్ బ్యాంకులు స్విఫ్ట్ సిస్టమ్‌ను ఉపయోగించుకోనీయకుండా నిషేధం విధించడం. రష్యా నుంచి కానీ, రష్యాతో కానీ మరే ఇతర దేశంతో వాణిజ్య లావాదేవీలు జరిపినా దానికి చెల్లింపులు, లేదా వసూళ్లు స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా జరపడానికి వీల్లేదని చెప్పడం. రెండోది, వెస్టర్న్ బ్యాంకుల్లోని రష్యాకు చెందిన డబ్బును స్తంభింపజేయడం ప్రస్తుత అంతర్జాతీయ చట్ట నియమనిబంధనల ప్రకారం పూర్తిగా అక్రమం. వారు సీజ్ చేసిన డబ్బు రష్యా ఇప్పటికే సప్లయి చేసిన సరుకులకుగాను రావాల్సినది. దానిని బ్యాంకుల్లో అలాగే అట్టిపెట్టి ఉంచుకుంటూ, ఇంకో వైపు తమకు చమురు, గ్యాస్ ఎప్పటిలానే సప్లయి కొనసాగించాలని ఇ.యు, జపాన్ డిమాండ్ చేస్తున్నాయి. దానికి చెల్లించాల్సిన డబ్బు మాత్రం వెస్టరన్ బ్యాంకులోనే డిపాజిట్ చేస్తామంటు న్నాయి. అలా చేయడమంటే ఆ డబ్బును మళ్లీ సీజ్ చేసేందుకు వాటికి అనుమతించడమే అవుతుంది.
పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక, ద్రవ్యపరమైన ఆంక్షలు మొదట్లో కొంత ప్రభావం చూపించినట్లు అనిపించింది. రష్యా రూబుల్ మునిగి, వ్యాపార లావాదేవీలను తన బ్యాంకుల ద్వారా జరపడం కనాకష్టంగా ఉండేది. డబ్బు బదలాయింపు, తీసుకోవడం వంటి కార్యకలాపాలు నిర్వహించగలిగే స్థితిలో రష్యన్ బ్యాంకులు లేవు. అయితే, అనతి కాలంలోనే దాని నుంచి రష్యా కోలుకుని గ్యాస్, చమురు అమ్మకాలు రూబుల్ కరెన్సీ లోనే చెల్లించాలని పట్టుబట్టింది. భారత్‌తో రూపాయిల్లోను, చైనాతో యువాన్లలోను చెల్లింపులు జరిపేలా ఒప్పందం కుదుర్చుకుని చమురు, గ్యాస్ అమ్మకాలు కొనసాగించింది. ఇతర దేశాలకు కూడా అమ్మకాలు సాగించింది. రష్యా రూబుల్ మట్టి కరవక తప్పదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన తప్పు అని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. తన గ్యాస్, చమురు వనరుల దన్నుతో రూబుల్ బలం పుంజుకుంది. ఈ ఆంక్షల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది యూరోపియన్ యూనియన్ దేశాలే. అమెరికాలా కాకుండా అవి రష్యా, చమురు సరఫరాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. రూబుల్స్‌లో తాము చెల్లించబోమని మొదట అవి కొంత బెట్టు చూపాయి. సంవత్సరం నాటికి తన చమురు, గ్యాస్ దిగుమతులు మరింతగా తగ్గించుకుంటామని బీరాలు పోయాయి. వాటి రష్యన్ గ్యాస్ ఆస్తులు చాలావరకు రష్యాలోనే ఉన్నాయి. ఇంకోవైపు రష్యన్ మనీ యూరోపియన్ బ్యాంకుల్లో సీజ్ చేయబడింది. దీంతో రష్యన్ ఆయిల్, గ్యాస్ ఎగుమతులు 10-15 శాతం తగ్గాయి. అయితే, వీటన్నిటిని అధిగమించి రష్యా ఈ కాలంలో లాభాలు సాధించింది. చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడంతో గడచిన అయిదు మాసాల్లోనే అది దాదాపు పది వేల కోట్ల డాలర్ల అదాయాన్ని అదనంగా ఆర్జించింది.
రష్యాపై ఆంక్షలు విఫలానికి రెండో కారణం, అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా మినహా మరే దేశమూ రష్యాపై ఆంక్షలు విధించలేదు. రష్యాపై గల బ్యాంకింగ్ ఆంక్షలను తొలగించాలని, తద్వారా రష్యా నుండి తాము ఆహారం, ఎరువులు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించాలంటూ రష్యా ఆహారం, ఎరువుల ఎగుమతులపై ఆధారపడే ఆఫ్రికన్ దేశాలు కోరుతున్నాయి. ఈ ఆంక్షలను తొలగించడానికి నిరాకరించిన తర్వాత, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై అంకారాలో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత, ఆహార దిగుమతులు లేదా తమ అవసరాల కోసం రష్యన్ బ్యాంకులను ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చంటూ ఇ.యు, అమెరికా ఇప్పుడు ''వివరణలు'' జారీ చేశాయి.
నాటో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని చేస్తుండడం ఈ యుద్ధంలో మరో కోణం. భౌగోళిక, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి యుద్ధానికి సంబంధించి రియల్‌టైమ్ తోడ్పాటును అందిస్తున్నామని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా అందచేస్తూ ఉక్రెయిన్‌కు సహకరిస్తున్నామని పశ్చిమ దేశాల సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. నాటో సరఫరా చేసే ఆయుధాలు, క్షిపణుల బ్యాటరీలను ఉపయోగించడంలో నాటో ''మిలటరీ సలహాదారులు'' చురుకుగా ఉక్రెయిన్ బలగాలకు సాయపడుతున్నారు. ఉక్రెయిన్ వద్ద వున్న సోవియట్ కాలం నాటి ఆయుధాలు, ట్యాంక్‌లు, విమానాలు, ఇతర మందుగుండు సామాగ్రి అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో, ఇక ఉక్రెయిన్‌కు సైనిక సరఫరాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అందించే వనరులుగా పశ్చిమ దేశాలు వున్నాయి.
అన్నింటికంటే పశ్చిమ దేశాలను దిగ్భ్రాంతి పరిచిన అంశమేమంటే, రష్యా తన సైనికులకు ఆయుధాలను, మందుగుండును, క్షిపణులను అందచేయగలిగే పారిశ్రామిక సామర్ధ్యాన్ని కలిగివున్నట్లు కనిపించడమే. మరోపక్క పశ్చిమ దేశాల వద్ద ఆయుధాలు, మందుగుండు నిల్వలు చాలా వేగంగా తరిగిపోతున్నాయి. అంతకంటే అధ్వాన్నమైన అంశమేమంటే, వేగంగా ఆయుధాలను, మందుగుండును ఉత్పత్తి చేసుకునే సామర్ధ్యం కూడా పశ్చిమ దేశాలకు లేకపోవడం. ఆ దేశాల పరిశ్రమలు ఎక్కువగా విదేశాల్లోనే వున్నాయి. ఇక పారిశ్రామిక స్థాయిలో యుద్ధాన్ని చేసే సామర్ధ్యం అమెరికా దాని మిత్రపక్షాలకు లేదని అలెక్స్ వెర్షినిన్ ఈ ఏడాది జూన్ 17 నాటి బ్రిటన్ పత్రిక అయిన రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌యుఎస్‌ఐ)లో రాసిన వ్యాసం ''రిటర్న్ ఆఫ్ ఇండిస్టియల్ వార్‌ఫేర్''లో పేర్కొన్నారు. ఉదాహరణకు, యూరప్‌లో రష్యాతో జరిపే ఇటువంటి యుద్ధంలో ''అమెరికా వార్షిక శతఘ్నుల ఉత్పత్తి ఉక్రెయిన్‌లో కేవలం పది రోజుల నుండి రెండు వారాల వరకు జరిగే యుద్ధానికి మాత్రమే సరిపోతుంది.'' పైగా, ట్యాంక్ విధ్వంసక జావెలిన్‌లు, వైమానిక రక్షణకు ఉపయోగించే స్టింగర్ల పరిస్థితి కూడా అలాగే వుంది. అమెరికా ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు 7 వేల జావెలిన్ క్షిపణులను పంపింది. అంటే తన దగ్గర వున్న నిల్వల్లో దాదాపు మూడో వంతు అన్నమాట. ఇంకా వీటిని తీసుకువస్తున్న మరిన్ని నౌకలు రావాల్సి వుంది. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏడాదికి దాదాపుగా 2100 క్షిపణులను తయారుచేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం ఇరాక్ వంటి దేశాలపై లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ వంటి శక్తులపై యుద్ధం చేయడానికి అమెరికా సమాయత్తంగా వుంది కానీ రష్యా లేదా చైనా వంటి తోటి సైనిక పోటీదారుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు.
ఉక్రెయిన్‌లో నాటో విధానాలను మనం ఎలా చూడవచ్చు? ఉక్రెయిన్ ప్రజలను ఉపయోగించుకుని రష్యాతో అమెరికా, నాటో మిత్రపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. పదే పదే చెబుతున్నట్లుగా, ఈ యుద్ధంలో రష్యాను నెత్తురోడించడానికి ఉక్రెయిన్‌ను ఉపయోగించుకోవడమే విధానంగా వుంది. ఆ రకంగా ఇటువంటి యుద్ధంలో ఉక్రెయిన్ చాలా పెద్ద మూల్య మే చెల్లించాల్సి వుంటుంది. కానీ, ఇది అమెరికాకు చాలా స్వల్పంగానే వుంటుంది. ఆస్తుల విధ్వంసం, ప్రాణ నష్టం, పెద్ద సంఖ్యలో నిర్వాసితులు కావడం వంటి సమస్యల వల్ల మతోన్మాదం, తీవ్రవాద శక్తులు పెచ్చరిల్లడానికి దారి తీస్తుంది.
నెలల తరబడి, ఉక్రెయిన్ లోని ఫాసిస్ట్‌లు యుద్ధ రంగం నుండి పౌరులను ఖాళీ చేయించడానికి జరిగే అన్ని ప్రయత్నాలను దెబ్బతీస్తున్నారు. వారిని ఆయా నగరాల్లోనే వుంచేందుకే వారు ప్రాధాన్యమిస్తున్నారు. పైగా వారిని బందీలుగా, మానవ కవచాలుగా ఉపయోగించుకునేలా చూస్తున్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడడానికి ఇదొక కారణంగా వుంది. ఆ ఇబ్బందులను పశ్చిమ దేశాల మీడియా బాగా ప్రచారం చేస్తోంది. ఉక్రెయిన్ నగర వీధుల్లో చెల్లాచెదురుగా పడివున్న పౌరుల మృత దేహాల బీభత్సమైన దృశ్యాలను చూపిస్తున్న వీడియోను ఈ ఫాసిస్టులు పదే పదే ప్రసారం చేశారు. రష్యన్ బలగాలను హింసాత్మక చర్యలకు పాల్పడే ముఠాగా, క్రూరమైన మానసిక రోగులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. ఈ కథనాల్లో కొన్నింటిని ఐక్యరాజ్య సమితి మాజీ ఆయుధ ఇన్‌స్పెక్టర్ స్కాట్ రిట్టర్ తోసిపుచ్చారు. దాదాపు 31 కోట్ల మంది శ్రోతలను కలిగిన బిబిసి, ఉక్రెయిన్‌లో ఫాసిజాన్ని తిరస్కరించే ప్రయత్నాలను పెంచడానికి ఏ విధంగానూ సహాయపడలేదు. ఫాసిస్ట్‌లను ఖండించడానికి బదులుగా, ''హుర్రే ఫర్ ది బ్లాక్ షర్ట్స్'' అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఏ విధంగా ప్రారంభమైందో తెలిపే విశ్లేషాత్మక కథనాలను, చర్చలను బిబిసి తోసిపుచ్చింది. యుద్ధం ఎలా ప్రారంభమైందో నీకు తెలియకపోతే, దాన్ని అంతమొందించడానికి ఏం చేయాలనే ఆశ, ఆలోచన కూడా వుండదు.
గతంలో వియత్నాం, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లలో చేసినట్లుగా ఉక్రెయిన్ నుండి కూడా అమెరికా తోక ముడవాల్సి రావచ్చు. అందుకే, ''అమెరికా శత్రువుగా వుండడం ప్రమాదకరమే, కానీ అమెరికా మిత్రుడుగా వుండడం మరింత ప్రాణాంతకం.'' అంటూ కిస్సింజర్ వ్యాఖ్యానించారు.
యుద్ధం కాదు, శాంతిని నెలకొల్పడం అవశ్యం
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాలు ప్రవేశించడం ఈ సమస్యను పరిష్కరించడానికి గల ఏకైక పరిష్కార మార్గమా? ఈ యుద్ధం వల్ల వేలాది విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెద్ద మొత్తంలో ఆస్తుల ధ్వంసం జరిగింది. ఇరు దేశాల్లోని సామాన్య ప్రజలు ఈ యుద్ధ ప్రభావాలను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధం వల్ల తలెత్తిన విపత్కర పరిస్థితులను, ఇబ్బందులను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆహార ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో లక్షలాదిమంది నిరుపేదలు ఆహారం దొరక్క కరువు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో ఇటువంటి సంక్షోభానికి సామ్రాజ్యవాద శక్తులు, అవి అమలు చేసే నీచమైన గుత్తాధిపత్యంతో కూడిన ఎత్తుగడలే కారణం. సైనిక ఘర్షణల వల్ల సైనిక పారిశ్రామిక సముదాయాలు, బడా బహుళజాతి కంపెనీలు లాభపడతాయి. అటువంటి కంపెనీలకు అమెరికా వంటి దేశాలు నాయకులుగా వుంటాయి.
దురదృష్టవశాత్తూ, ఈనాడు శాంతిశక్తులు బలహీనపడినట్లు కనిపిస్తోంది. కొరియా యుద్ధంలో, అలాగే వియత్నాం యుద్ధంలో అంతర్జాతీయంగా శాంతి ఉద్యమం తలెత్తింది. శాంతి పరిరక్షణలో, ఇటువంటి సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా అలీనోద్యమం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా మనం సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణులతో అంతర్జాతీయ శాంతి ఉద్యమాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం వుంది. అప్పుడు శాంతి కోసం మనం చేసే పోరాటం సామ్రాజ్యవాదానికి గట్టి ప్రతిఘటనగా నిలుస్తుంది. మన మధ్య ఐక్యతను దెబ్బ తీయాలని చూసే మితవాద శక్తులకు హెచ్చరికగా నిలుస్తుంది. మనం ఐక్యంగా వున్నపుడే శాంతి, సుస్థిరాభివృద్ధికి హామీ కల్పించబడుతుంది. వాటి గురించి కల కనవచ్చు. వాటిని సాకారం చేయడం కూడా మన బాధ్యతే. ఇక ఎంతో సమయం లేదు. అణ్వాయుధాలతో, అంతర్జాతీయంగా వాతావరణ మార్పుల వినాశనంతో నిండిన ఈ ప్రపంచంలో, అంతర్జాతీయ శాంతి ఉద్యమాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇదే అందుకు సరైన తరుణం. యుద్ధాన్ని తక్షణమే ఆపాల్సి వుంది.
( మొదటి భాగం ఆగస్టు 26న ప్రచురితమైంది )
/ ఐఎన్‌ఎన్ సౌజన్యంతో /