
ఉక్రెయిన్ అవసరాలు తీరాలంటే ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సిందేనని అమెరికా, ఇ.యు సలహా ఇచ్చాయి. ఐఎంఎఫ్‌తో డీల్ పునరుద్ధరించడమంటే కొరివితో తల గోక్కోవడమే. ఇంధనంపై ప్రభుత్వ సబ్సిడీల్లో పెద్దయెత్తున కోత, భూమితో సహా సహజ వనరుల ప్రైవేటీకరణ వంటి షరతులు రాజకీయంగా చిక్కుల్లో పడేస్తాయి. బాధాకరమైన పొదుపు చర్యలు, వ్యవస్థాగత మార్పులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ఉక్రెయిన్ హామీ ఇస్తే తప్ప ఆ దేశానికి రుణం అందించేది లేదని ఐఎంఎఫ్ కరాఖండితంగా చెప్పింది. ఆ విధంగా అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ ప్రభుత్వంతో ఐఎంఎఫ్ షరతులను బలవంతంగా అంగీకరింపజేశాయి. ఈ సంస్కరణలను వేగవంతం చేసిన ప్రభుత్వం ఘోరంగా అప్రతిష్ట పాలైంది. సామాజిక రంగంపై ముఖ్యంగా ఆరోగ్యం, గృహనిర్మాణం, ఇతర సామాజిక సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని బాగా తగ్గించేసింది. సామాన్యులపై మోయలేని భారాలు వేస్తూ, సంపన్నులకు భారీగా రాయితీలు కల్పించే పన్నుల విధానం, ప్రభుత్వ అధికారులను లంచాలతో మేపి, ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేట్లు లాభాలు పోగేసుకోవడం వంటి ధోరణులు పెరిగిపోయాయి.
ఉక్రెయిన్ వార్తలు గత కొన్ని మాసాలుగా మన ఫ్రంట్ పేజీలో కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపనారంభించారు. ప్రపంచ ఆహార కొరత, చుక్కలనంటుతున్న ఆహార ధరలు, భగ్గుమంటున్న పెట్రో, గ్యాస్ ధరలు, యూరప్‌ను కుదిపేస్తున్న ఇంధన సంక్షోభం, కట్టలు తెంచుకుంటున్న ద్రవ్యోల్బణం ఇలా ప్రతిదానికి ఉక్రెయిన్ యుద్ధమే కారణమంటున్నారు. మన దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ఉక్రెయిన్ సంక్షోభమే కారణమని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెబుతున్నది. ఇంతకీ ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది? ఈ సంక్షోభానికి కారకులెవరు? అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరముంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఏదో రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదిది. అమెరికా, నాటో ఇందులో జోక్యం చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ పతనం తరువాత నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని రష్యాకు ఇచ్చిన హామీని అమెరికా తుంగలో తొక్కింది. వార్సా కూటమిలో భాగస్వాములుగా వున్న తూర్పు యూరప్ దేశాలను, బాల్టిక్ దేశాలను నాటోలోకి తీసుకొచ్చింది. పూర్వ సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌ను కూడా నాటోలో చేర్చుకోడానికి రంగం సిద్ధమైంది. అదే జరిగితే నాటో దళాలు మాస్కోకు 500 కి.మీ దూరంలోని తన సరిహద్దుల దాకా విస్తరించే ప్రమాదముందని, ఇది తన భద్రతకే ముప్పు అని రష్యా గ్రహించింది. అందుకే నాటోలో ఉక్రెయిన్‌ను భాగం చేయరాదని, రష్యన్ సరిహద్దుల్లో ఎలాంటి యుద్ధ క్షిపణులను మోహరించబోనని భద్రతాపరమైన కొన్ని హామీలు ఇవ్వాలని అమెరికా, నాటోలను అది డిమాండ్ చేసింది. ఆ విధమైన హామీలిచ్చేందుకు అమెరికా, నాటో తిరస్కరించాయి. పైగా 2014 ఉక్రెయిన్‌లో కుట్రద్వారా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాతపెద్దయెత్తున ఆయుధాలను కుమ్మరించడం, పెద్ద సంఖ్యలో తన సలహాదారులను ఉక్రెయిన్‌లో పెట్టడం, అక్కడి సాయుధ దళాలతో సంయుక్తంగా డ్రిల్లు నిర్వహించడం, క్షిపణి బ్యాటరీలను నెలకొల్పడం, పోలండ్, రుమేనియాల్లో మరిన్ని అమెరికన్- నాటో బలగాలను దించడం, తూర్పు యూరప్, బాల్టిక్ దేశాలకు నాటో దళాలను పంపడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత యుద్ధానికి దారితీసిన పరిస్థితుల్లో మరో ముఖ్యమైన అంశం మిన్స్క్ ఒప్పందాలను అమెరికా, యూరప్ దేశాలు తుంగలో తొక్కడం. జర్మనీ, ఫ్రాన్స్ పూచీకత్తుదారులుగా 2014, 2015 సంవత్సరాల్లో రెండు మిన్స్క్ ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాల ప్రకారం ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతానికి ప్రాంతీయ/రాష్ట్ర ప్రతిపత్తికి హామీ ఇవ్వబడింది. ఈ ఒప్పందాలను అమలు చేసేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తేవడానికి బదులు, వీటిని ఉల్లంఘించి, డాన్ బాస్‌పై దాడులు చేపట్టేలా దానిని అమెరికా, దాని మిత్ర పక్షాలైన జర్మనీ, ఫ్రాన్స్ ప్రోత్సహించాయి. ఈ అంశాలన్నీ చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాంటప్పుడు యుద్ధం వైపు ఎందుకు ఎగదోశాయి. ఇది యుద్ధం కాదు, ప్రత్యేక సైనిక చర్య అని రష్యా చెప్పవచ్చు గాక! ఏదేమైనా ఈ యుద్ధంలో పునర్వ్యవస్థీకరించిన ఉక్రెయిన్ దళాలతో సాగించే పోరులో రష్యా బలహీన పడుతుందని అమెరికా, దాని యూరోపియన్ నాటో భాగస్వాములు భావించాయి. అదీ కాకపోతే పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ఉదా: స్విఫ్ట్ ఇంటర్ బ్యాంకింగ్ సెటిల్మెంట్ సిస్టమ్‌తో రష్యా అనుసంధానాన్ని నిలిపివేయడం, వెస్టరన్ బ్యాంకుల్లోని రష్యన్ విదేశీ మారక నిల్వలను స్వాధీనం చేసుకోవడం, రష్యాపై వివిధ వాణిజ్య ఆంక్షలు విధించడం వంటి వాటి ద్వారా రష్యాను లొంగదీసుకోవచ్చని భావించాయి. అవన్నీ విఫలం కావడంతో ఇప్పుడీ యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగేలా చూడాలని అమెరికా, దాని మిత్ర పక్షాలు ఇప్పుడు కోరుకుంటున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చమురు, గ్యాస్, బొగ్గుధరలు భారీగా పెరిగిపోవడంతోపాటు, ప్రపంచ ఆహార కొరత ఏర్పడింది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే దాని పర్యవసానాలు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశముంది.
చారిత్రిక నేపథ్యం
సోవియట్ యూనియన్ కాలంలో ఉక్రెయిన్ ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా ఉండేది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన అనంతరం పూర్వ సోవియట్ రిపబ్లిక్‌ల ఆర్థిక వ్యవస్థల్లో, జీవన ప్రమాణాల్లో పెద్దయెత్తున కల్లోలం చోటుచేసుకుంది. దీనికి ఉక్రెయిన్ కూడా మినహాయింపేమీ కాదు. యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యాలో భాగంగా ఉక్రెయిన్ ఉన్నప్పుడు తలసరి ఉత్పత్తిలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ కన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ముప్పయ్యేళ్ల తరువాత దాని తలసరి జిడిపి బాగా తగ్గిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి 1990ల నాటితో పోల్చితే 20 శాతం దాకా తగ్గింది. సోవియట్ యూనియన్ పతనం కాగానే తూర్పు యూరప్ దేశాల్లో అమెరికా చేపట్టిన మొట్టమొదటి చర్య ఏమిటంటే వాటిని దుర్మార్గపు పెట్టుబడిదారీ దోపిడీ పంథాలోకి నెట్టడం. ఆ తరువాత కొద్ది కాలానికే ఈ దేశాల మార్కెట్లను సామ్రాజ్యవాద దేశాలకు అనుగుణంగా మార్చడం జరిగింది. ప్రభుత్వ రంగంలోని పారిశ్రామిక సంస్థలను ధ్వంసం చేసి, కొద్దిమంది కార్పొరేట్లకు అప్పగించేలా చేసింది. ఆయా దేశాల్లోని సుసంపన్నమైన సహజ వనరులను వ్యక్తిగత ఆస్తిగా మార్చి, సామ్రాజ్యవాద దోపిడీకి వీలుగా తలుపులు తెరిచారు. మరో వైపు ఆకలి, నిరుద్యోగం, పేదరికం, వేశ్య వృత్తి, దిగజారిన జీవన ప్రమాణాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాజకీయ నాయకత్వానికి సన్నిహితంగా ఉండే కొద్ది మంది కులీనులు రాత్రికి రాత్రి వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తారు. ప్రభుత్వ అధీనంలోని వనరులను, ఫ్యాక్టరీలను పబ్లిగ్గా లూటీ చేయడం ద్వారా వీరు కుబేరులుగా మారారు. ఫలితంగా ఉక్రెయిన్ నుంచి 50 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది యువతే కావడం గమనార్హం.
అమెరికా పాత్ర, సిఐఎ హస్తం
నయా ఉదారవాద విధానాల వల్ల ఉక్రెయిన్‌లో నియో నాజీ గ్రూపులు కొత్తగా ఊపిరిపోసుకున్నాయి. ఈ నాజీ గ్రూపులను ప్రోత్సహించడంలో అమెరికా పాత్ర గురించి తెలుసుకుంటే, ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. 1949లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడేలా నాజీ గ్రూపులను ఉసిగొల్పేందుకు, తర్ఫీదు ఇచ్చేందుకు అమెరికా తన సిఐఎ ఏజెంట్లను పంపింది. ఆ 'ఆపరేషన్' విఫలమైనా, ఉక్రెయిన్, ఇతర సోవియట్ రిపబ్లిక్కుల లోని నియో నాజీ గ్రూపులతో సిఐఎ సంబంధాలు కొనసాగించేలా చూసుకుంది. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఈ శక్తులు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తరువాత వచ్చిన ఎల్సిన్ అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారడంతో అమెరికా నేతృత్వంలోని గ్లోబల్ పెట్టుబడి తూర్పు యూరప్ దేశాలకు విస్తరించింది. అప్పటి నుంచే అమెరికా శకం, ప్రపంచంపై దాని పూర్తి ఆధిపత్యం మొదలైంది. ఎల్సిన్ నిష్క్రమణ తరువాత రష్యా తన బలాన్ని కూడదీసుకునేందుకు యత్నించడంతో దానిని దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌ను ఇ.యు, నాటోలో భాగస్వామిగా చేయాలని అమెరికా, యూరప్ లోని సంపన్న దేశాలు ఎత్తు వేశాయి. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు అమెరికా ఉక్రెయిన్‌ను, ఇతర తూర్పు యూరప్ దేశాలను మరింత మచ్చిక చేసుకునే యత్నాలు చేపట్టింది. ఈ దేశాల మార్కెట్లను బార్లా తెరిపించడం, వనరులను కొల్లగొట్టడం, ప్రజలపై ఎడాపెడా భారాలు మోపడం వంటి చర్యలు చేపట్టింది. 2009లో ఉక్రెయిన్‌తో సహా మాజీ సోవియట్ రిపబ్లిక్కులతో సంబంధాలను పటిష్టపరచుకోవడం కోసం తూర్పు భాగస్వామ్య కార్యక్రమాన్ని యూరోపియన్ యూనియన్ చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. ఉక్రెయిన్ అవసరాలు తీరాలంటే ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సిందేనని అమెరికా, ఇయు సలహా ఇచ్చాయి. ఐఎంఎఫ్‌తో డీల్ పునరుద్ధరించడమంటే కొరివితో తల గోక్కోవడమే. ఇంధనంపై ప్రభుత్వ సబ్సిడీల్లో పెద్దయెత్తున కోత, భూమితో సహా సహజ వనరుల ప్రైవేటీకరణ వంటి షరతులు రాజకీయంగా చిక్కుల్లో పడేస్తాయి. బాధాకరమైన పొదుపు చర్యలు, వ్యవస్థాగత మార్పులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ఉక్రెయిన్ హామీ ఇస్తే తప్ప ఆ దేశానికి రుణం అందించేది లేదని ఐఎంఎఫ్ కరాఖండితంగా చెప్పింది. ఆ విధంగా అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ ప్రభుత్వంతో ఐఎంఎఫ్ షరతులను బలవంతంగా అంగీకరింపజేశాయి. ఈ సంస్కరణలను వేగవంతం చేసిన ప్రభుత్వం ఘోరంగా అప్రతిష్ట పాలైంది. సామాజిక రంగంపై ముఖ్యంగా ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇతర సామాజిక సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని బాగా తగ్గించేసింది. సామాన్యులపై మోయలేని భారాలు వేస్తూ, సంపన్నులకు భారీగా రాయితీలు కల్పించే పన్నుల విధానం, ప్రభుత్వ అధికారులను లంచాలతో మేపి, ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేట్లు లాభాలు పోగేసుకోవడం వంటి ధోరణులు పెరిగిపోయాయి.
నియో నాజీ శక్తుల పెరుగుదల
వీటన్నిటి ఫలితంగా ఉక్రెయిన్ అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా పశ్చిమ దేశాల కూటమికి అంతకంతకూ దగ్గరవుతూ వచ్చింది. పశ్చిమ దేశాల అనుకూల విధానాలు ఉక్రెయిన్ ప్రభుత్వం చేపట్టడం వల్ల ప్రజల్లో అశాంతి రేగింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అటు యూరోపియన్ యూనియన్‌తోను, ఇటు రష్యాతోను అది సంప్రదింపులు జరిపింది. తీవ్రమైన పొదుపు చర్యలు అమలు చేయాలని యూరోపియన్ యూనియన్ చేసిన డిమాండ్‌ను అధ్యక్షుడు యనుకోవిచ్ తిరస్కరించారు. చివరి నిమిషంలో యూరప్‌తో డీల్‌ను ఉపసంహరించుకుని రష్యా సాయం కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రష్యాకు లొంగుబాటుగా చిత్రిస్తూ మితవాద, నియో నాజీ పార్టీలు ఉన్మాదపూరితంగా వ్యవహరించాయి. కమ్యూనిజం, సోషలిజానికి వ్యతిరేకంగా జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాయి. చరిత్రను వక్రీకరిస్తూ, సోవియట్ శకంలో రష్యా ఉక్రెయిన్‌ను బలవంతంగా ఆక్రమించిందని ప్రచారం చేశాయి.
2014లో యనుకోవిచ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో ఉక్రెయిన్ లోని అమెరికా రాయబారి విక్టోరియా నులాండ్ చురుగ్గా పాల్గొంటూ నిర్లజ్జగా ఉన్మాదుల పక్షం వహించారు. ఆ నిరసనలు యనుకోవిచ్ ప్రభుత్వాన్ని పడగొట్టాయి. ఎన్నికైన అధ్యక్షుడి స్థానే నియో నాజీ గ్రూపులు మద్దతు తెలిపిన పొరొషెంకో పగ్గాలు చేపట్టాడు. ఉక్రెయిన్‌లో ఆ విధమైన 'కలర్ రివల్యూషన్' (రంగు విప్లవం)ను బలవంతంగా రుద్దడంలో అమెరికా సఫలమైంది. వారు అధికారం చేపట్టిన మరు క్షణం నుంచే ఉక్రెయిన్ లోపల నివసించే రష్యన్లను లక్ష్యంగా చేసుకుని నియో నాజీ మూకలు ఎడాపెడా దాడులు చేయనారంభించాయి. రష్యన్లు అధికంగా ఉన్న డాన్‌బాస్ ప్రాంతాన్ని ప్రత్యేక టార్గెట్‌గా పెట్టుకున్నాయి. 2014 తిరుగుబాటులో అమెరికా పాత్ర ఉందనేది జగమెరిగిన సత్యం. అధికారం హస్తగతం చేసుకున్న నాజీ గ్రూపులు రాజ్య విభాగాలన్నిటిని తమ గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా చెలరేగాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లోని రష్యన్ల పైన దాడులకు దిగాయి. వీరికి ఉక్రెయిన్ ప్రభుత్వమే నేరుగా నిధులు సమకూర్చేది. కమ్యూనిస్టులపై దాడులు, లెనిన్ విగ్రహాల ధ్వంసం వంటి చర్యలకు తెగబడింది ఈ నియో నాజీ మూకలే. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడులు, ఉక్రెయిన్ కమ్యూనిస్టు పార్టీ (కెపియు) ప్రధాన కార్యదర్శి పెట్రో సిమోనెంకోపై దాడి చేసి, అరెస్టు చేశారు. ఒక పథకం ప్రకారం కమ్యూనిస్టుల పైన, ప్రగతిశీల శక్తులపైన దాడులు చేస్తున్నారు. ఈ నియో నాజీ మూకలు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి.
ఉక్రెయిన్‌లో జాతీయవాదం, జాత్యహంకారం ప్రస్తుతం బాహాటంగానే బుసలుకొడుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా ఘర్షణ సందర్భంగా వేలాది మంది భారత విద్యార్థులు, ఇతర దేశాల విద్యార్థులతో కలసి ఉక్రెయిన్‌ను వీడి వెళ్లేందుకు యత్నించగా, వీరిలో భారత్, ఆఫ్రికన్ విద్యార్థులను రైలు ఎక్కడానికి వీల్లేదంటూ రైల్వే స్టేషన్లలో అడ్డుకున్నారు. జాతి, వర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఉక్రెయిన్ సమాజం నుంచి రాజ్య యంత్రాంగంలోకి నియో నాజీ శక్తులు చొరబడ్డాయి. నల్ల జాతీయులకు ప్రవేశం లేదంటూ ఉక్రెయిన్ సరిహద్దుల్లో బోర్డులు పెట్టి మరీ అడ్డుకున్నారు.
50 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులు దేశం వీడి వలసపోయారు. శరణార్థులను తమ దేశాల్లో ప్రవేశించకుండా గట్టిగా వ్యతిరేకించే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ఉక్రెయినియన్ శరణార్థుల విషయంలో తద్భిన్నంగా వ్యవహరించాయి. బ్రిటన్ ప్రభుత్వం వీరి కోసం మార్చి 14న ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. మొదటి రోజే లక్ష మంది దాకా వ్యక్తులు, సంస్థలు ఈ స్కీమ్‌లో చేరేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. అద్దె లేకుండా ఇంట్లో కొంత స్పేస్‌ను శరణార్థులకు కేటాయించాలని ప్రభుత్వం కోరింది. ఒక్కొక్క కుటుంబం ఒక్కో శరణార్థికి ఆశ్రయం ఇవ్వాలని సూచించింది. అలా ఆశ్రయం ఇచ్చిన కుటుంబాలకు నెలకు 350 పౌండ్ల చొప్పున 12 మాసాల పాటు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. యు.కె రిటైల్ దిగ్గజాలైన శాన్స్‌బరీ, మార్క్స్ అండ్ స్పెన్సర్, మోరిసన్స్ శరణార్థులకు తమ సంస్థల్లో ఉద్యోగాలిస్తామని ప్రకటించాయి.
/ఐఎన్‌ఎన్ సౌజన్యంతో/
/తరువాయి తదుపరి సంచికలో/