మెతుకు దొరక్క నీవు
బ్రతుకు శాసించే స్థితిలో వాడు.
వాడు తలకు చుట్టిన తలపాగా
కోట్ల ఖరీదు పలుకుతుంది.
నీ తల విలువ తణ ప్రాయమై
వెల వెల పోతుంది.!
వాడి కనకపు కంచం
షడ్రుచుల్ని చవి చూస్తుంది.
నీ సొట్ట గిన్నె తనను తడిమే
రాగి సంకటికై ఆర్తిగా
ఎదురు చూస్తుంది.
వాడు వెన్నెల వెలుగుల్లో
విహరించగలడు.
ఆ వెలుగుల ప్రస్థానానికి
చమురువి నువ్వే కదా!
వాడు వాగ్దానాల మేఘమై గర్జించి
నోట్ల వర్షం కురిపించినపుడల్లా..
నువ్వు తడిసి ముద్దవుతున్నావ్
నీ చెవుల్ని
సుమాలతో అలంకరిస్తుంటే..
వాడి నామ జపంతో
నిన్ను నువ్వే మర్చిపోతున్నావ్.
వాడు రాయల్ పేలస్ లో
రాజసాన్ని ఒలకబోస్తాడు.
రవి శశిలు నీ ఇంట
నిత్య అతిధులై కూర్చుంటారు.
నువ్వు పుట్టక ముందే
నిన్ను వాడు పరాయి వాడికి
కిరాయికి అమ్మేసాడని
నీకు తెలుసేదెప్పుడు ..!?
చెక్కకు పట్టిన చెదని
త్వరగా తొలగించకపోతే
చెక్క చిధ్రమైనట్లే..
బ్రతుకు బడభాగ్నిలో
బూడిద కాకముందే..
బడుగులతో కలిపి పిడుగోలేగర్జించు
ఊసర వెల్లుల్ని తరిమి
ఉద్యమమే ఊపిరిగా
ఉజ్వల భవితను నిర్మించు..!!
కోరాడ. అప్పలరాజు
9550234204.