Jun 04,2023 07:42

ఒక ఏనుగు తాను చెరుకు గడలు తిని, తన పిల్లలకోసం తీసుకెళుతోంది. చిట్టి అనే చిలుక ఎగురుతూ వచ్చి ఏనుగుపై కూర్చుంది. దారిలో ఒక నక్క ఎదురైంది.
'ఏనుగన్నా! పిల్లలకోసం చెరుకు గడలు తీసుకెడుతున్నట్లున్నావు. ఏరోజయినా మన మృగరాజుకు చెరుకు గడలు తీసుకెళ్లి ఇచ్చావా? సింహం ఏరోజూ చెరుకు రసం రుచి చూసి ఉండదు. ఒకసారి ఇచ్చి చూడు. సింహం దగ్గర నీకు మంచి గుర్తింపు లభిస్తుంది' అని నక్క సలహా ఇచ్చింది.
'అలాగే ఇప్పుడే వెళ్లి మృగరాజుకి ఇస్తాను. చెరుకు రుచి చూపిస్తాను.' అని ఏనుగు సింహం గుహ వైపు బయలుదేరింది.
అంతలో చిలుక ఏనుగుతో 'అన్నా! నీ పిల్లల ఆకలి ముఖ్యం. మృగరాజు సంగతి మనకెందుకు? చెరుకు గడలు నీ పిల్లలకివ్వు. సంతోషంగా తింటాయి' అని చెప్పి ఎగిరిపోయింది.
ఏనుగు చిలుక మాటలు వినకుండా చెరుకు గడలతో సింహం వద్దకు వెళ్లింది. సింహం కోపంగా చూసి 'మాంసం తినే నేను చెరుకు తినే దద్దమ్మలా కనిపిస్తున్నానా?' అంటూ తిట్టింది. ఏనుగు అవమానంతో వెళ్లిపోయింది.
ఒకరోజు సింహానికి జబ్బు చేసింది. తలనొప్పితో బాధపడుతోంది. వైద్యంచేసే కోతిని రమ్మని పావురంతో కబురంపింది సింహం. పావురం కోతికి విషయం చెప్పి వెళ్లిపోయింది. కోతి కొమ్మకు తగిలించి ఉన్న వైద్యం సంచిని తీసుకుని, చెట్టుదిగి పది అడుగులు వెళ్లగానే కోతికి నక్క ఎదురైంది.
'కోతిమామా! ఎక్కడికి వెళ్తున్నావూ?' అని అడిగింది. విషయం చెప్పింది కోతి.
'సింహం నుండి కబురు రాగానే పరుగెత్తికెళ్లి వైద్యం చేస్తే నీ విలువ, అవసరం తెలియకుండాపోతుంది. ఆలస్యంగా వెడితే నీ అవసరం తెలిసొచ్చి, విలువ పెరుగుతుంది' అని సలహా ఇచ్చింది.
కోతి వెనుదిరిగివచ్చి సంచిని చెట్టు కొమ్మకు తగిలించి కూర్చుంది. చెట్టుపై ఉన్న చిట్టి చిలుక ఇది గమనించి 'కోతి మామా! సింహం దగ్గరకు వెళ్లకుండా తిరిగి వచ్చావేం?' అని అడిగింది.
కోతి నక్క చెప్పిన మాటలు చెప్పి, 'రెండవసారి కబురువస్తే వెళ్తాను. సింహానికి నా గొప్పతనం, అవసరం అర్థమవుతుంది' అంది కోతి.
'ఆరోగ్యం బాగలేక బాధపడుతుంటే ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇప్పుడు నీ గొప్పతనానికి వచ్చిన లోటు ఏమీలేదు. అవసరానికి వెంటనే పలికినప్పుడే విలువ పెరుగుతుంది' అంది చిలుక.
కోతి ఆ మాటలు వినకుండా కాలు మీద కాలేసుకుని ఠీవిగా కూర్చుంది. కోతి ఎంతసేపటికీ రాకపోయేసరికి ఎలుగుబంటును పంపింది సింహం. ఎలుగుబంటు వచ్చి.. పావురంతో కబురంపినా రాకుండా ఠీవిగా, కూర్చుని ఉన్న కోతిని నాలుగు తన్ని తీసుకెళ్లింది.
ఒకసారి చెట్టు కింద దిగులుగా కూర్చుని ఉన్న కాకిని నక్క చూసి కారణమడిగింది.
'నక్కబావా! చిలుకకు అందం, కోకిలకు పాట, నెమలికి నాట్యం, గిజిగాడికి అందమైన గూడుకట్టే నైపుణ్యం ఇలా ఏదో ఒక గుర్తింపు ఉంది. నాకు ఏ గుర్తింపూ లేదు. అందుకే చాలా దిగులుగా ఉంది' అంది.
నక్క నవ్వి 'నువ్వూ పాడగలవు. నాట్యం చేయగలవు. నీకేం తక్కువ. పులి మంత్రికి ఆటపాటలంటే ఇష్టం. వెళ్లి నీ ప్రతిభను ప్రదర్శించు. మంచి బహుమతి పొందు. గుర్తింపు వస్తుంది' అని సలహా ఇచ్చింది.
చెట్టుపైనున్న చిట్టి ఈ మాటలు వింది. నక్క మాటలకు పొంగిపోయి, పులి వద్దకు బయలుదేరుతున్న కాకితో 'నీవు పరిసరాలను శుభ్రం చేస్తావు. పిండిపదానం చేయడానికి నిన్ను మాత్రమే ఆహ్వానిస్తారు. కలిసిమెలిసి ఐక్యతగా ఉంటారనే పేరు మీకు ఉంది. ఈ గుర్తింపు చాలు. సాధన చేయకుండా, లేని ప్రతిభను ప్రదర్శించాలని ప్రాకులాడకు' అంది.
చిట్టి మాటలు వినకుండా పులి వద్ద తన ఆటాపాటను ప్రదర్శించి, చివాట్లు తిని వచ్చింది కాకి.
'ఈ లోకంలో ఉచిత సలహాలిచ్చేవాళ్లకు లోటులేదు. కానీ ఆ సలహాలు తియ్యగా ఉండి చెడు చేస్తాయా.. చప్పగా ఉన్నా మేలు చేస్తాయా అనేది గ్రహించే వివేకం మనకే ఉండాలి. మంచి మాటలు పెడచెవిన పెట్టి, అడ్డమైన సలహాలను ఆచరిస్తే, అభాసుపాలై నష్టపోయేది మనమే' అనుకున్నాయి ఏనుగు, కోతి, కాకి. అప్పటి నుంచి చిలుకతో స్నేహంగా ఉండసాగాయి.

డి.కె. చదువులబాబు
9440703716