
సమాచార, సాంకేతిక రంగాల్లో విప్తవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నిమిషాల వ్యవధిలోనే సమాచారాన్ని పొందడం, లేదా చేరవేయడం వంటివి జరుగుతున్నాయి. టెక్నాలజీలో వచ్చిన ఈ రకమైన మార్పులతో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలతో సెకన్ల వ్యవధిలో ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితోనైనా కమ్యూనికేట్ అవుతున్నాం. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు. కొన్ని దశాబ్దాల కిందటి వరకూ తపాలానే అందరికీ కమ్యూనికేషన్ సాధనం. అతి తక్కువ ధరకే తమ బంధువులు, మిత్రులకు వివరాలు తెలుపుతూ ఉత్తరాలు రాసేవాళ్లు. మనుషులు దూరంగా ఉన్నా తమ బంధాన్ని పోస్ట్ ద్వారా బలపరుచుకునేవారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా.. అక్టోబర్ 9న 'ప్రపంచ తపాలా దినోత్సవం'గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా దీనిపై ప్రత్యేక కథనం..

పోస్టాఫీసు.. ఈ పేరు తెలియనివారు ఉండరు. దీంతో ప్రతి ఒక్కరికీ ప్రధాన అవసరం ఉంటుంది. గతంలో పేదల నుంచి ధనికుల వరకూ ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి ఉత్తరమే ఆధారం. కాలగమనంలో వచ్చిన మార్పుల కారణంగా పోస్టుకార్డు మనుగడ తగ్గింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక పోస్టుకార్డు అవసరం పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు. అయితే కాలనుగుణంగా పోస్టాఫీసు సేవలను విస్తరించుకుంటూ వస్తుంది.

చరిత్ర, ప్రాముఖ్యత..
ఒకసారి చరిత్రలోకి వెళ్తే మెసెంజర్ల రూపంలో తపాలా సర్వీసులుండేవి. అంతకుముందు పక్షులు, గుర్రాలను ఉపయోగించి రాయబారాలు చేరవేసేవారు. 1600 - 1700 సంవత్సరాల్లో అనేక దేశాలవారు జాతీయ తపాలా వ్యవస్థలను నెలకొల్పుకొని, ఆయా దేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని కల్పించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. 1800 నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ తపాలా పంపిణీ క్లిష్టంగా మారిపోయింది. అయితే స్కాట్లాండ్‌లోని సంక్వార్‌లోని హైస్ట్రీట్‌లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పోస్టాఫీసు ఉందని బ్రిటిష్ పోస్టల్ మ్యూజియం పేర్కొంది. ఇక్కడి ఆధారాల ప్రకారం ఈ పోస్టాఫీసు 1712 నుంచి నిరంతరాయంగా పనిచేసింది. ఆ రోజుల్లో గుర్రాలు, స్టేజ్ కోచ్‌లు మెయిల్స్ తీసుకెళ్లేవి.
అలా మొదలైంది..
వాస్తవానికి పోస్టాఫీసు వ్యవస్థ 1840లోనే మొదలైంది. ఇంగ్లండ్‌లో సర్ రోలాండ్ హిల్ ఈ పద్ధతిని ప్రారంభించారు. అయితే ఆ సమయంలో అమెరికాకు చెందిన పోస్ట్ మాస్టర్ జనరల్ మాంట్ గోమెరి బ్లెయిర్ 1863లో 15 యూరోపియన్, అమెరికన్ దేశాల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అంతర్జాతీయ ఒప్పందం మాత్రం కుదరలేదు. 1874లో నార్త్ జర్మన్ కాన్‌ఫెడరేషన్‌కు చెందిన ఓ సీనియర్ పోస్టల్ అధికారి హెయిన్‌రిచ్ వాన్ స్టీఫెన్ స్విట్జర్లాండ్‌లోని బెర్నెలో 22 దేశాల ప్రతినిధులతో సదస్సు ఏర్పాటు చేశారు. ఆ ఏడాది అక్టోబరు తొమ్మిదిన ప్రతినిధులు బెర్నె ఒప్పందంపై సంతకాలు చేసి, జనరల్ పోస్టల్ యూనియన్‌ను నెలకొల్పారు.
ఈ యూనియన్‌లో సభ్య దేశాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. యూనియన్ పేరు 1878లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌గా మారింది. ఇది 1948లో ఐక్య రాజ్యసమితికి ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందింది. 1969లో అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వరకూ జపాన్ టోక్యోలో 16వ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యుపియు) కాంగ్రెస్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రతినిధులు అక్టోబరు 9న 'వరల్డ్ పోస్టల్ డే' ని నిర్వహించాలని తీర్మానించారు. ప్రస్తుతం యుపియులో 192 సభ్య దేశాలున్నాయి.
మన దేశంలో..
ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో మొదట ముంబై, చెన్నరు, కోల్‌కతాలో 1764-1766 మధ్య 'కంపెనీ మెయిల్' పేరుతో పోస్టల్ సేవలు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1776లో లార్డ్ క్లైవ్ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్ హేస్టింగ్స్ కోల్‌కతా ఆఫీసును ప్రారంభించగా, తర్వాత 1786లో మద్రాస్ జనరల్ పోస్టాఫీసును, 1793లో ముంబయి జనరల్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేశారు. 1854లో లార్డ్ డల్హౌసీ ద్వారా క్రౌన్ సర్వీస్‌గా మార్పు చేశారు.
పోస్టల్ సేవలు
ఉత్తరాలు బట్వాడా, స్పీడు పోస్టు, ఈ-పోస్టు సర్వీసు, బిల్ మెయిల్ సర్వీస్, మేఘదూత్ పోస్టుకార్డు, నగదు బట్వాడా, ఆధార్ నమోదు, ఆలయాల ప్రసాదుల సర్వీసు, గోదావరి జలాలు అందజేసే సర్వీసు తదితర సర్వీసులు అందిస్తుంది. అలాగే కనిష్ట, గరిష్ట పెట్టబడి పథకం, టైం డిపోజిట్, కిసాన్ వికాశ్ పత్రం, జాతీయ పొదుపు సర్టిఫికెట్, పీపీఎప్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), ఆర్‌డీ (రికరింగ్ డిపాజిట్), సుకన్య సమృద్ధి ఖాతా, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, నెలవారి ఆదాయం వంటి పథకాలు అమలు చేస్తుంది.
ఇంటివద్దకే సేవలు..
ఇటీవల కాలంలో ఇండియన్ పోస్టల్ సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఐపీపీబీ మొబైల్ యాప్ పేరుతో డిజిటల్ సేవలను అందిస్తోంది. దీనిద్వారా ఖాతాదారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా తెరవాలంటే ఖాతాదారునికి 18 ఏళ్లు నిండి వుండాలి. అలాగే భారతీయ పౌరుడై ఉండాలి. ఇందుకోసం ముందుగా 'ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో అవసరమైన వివరాలు అందించి, మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను పొందవచ్చు.

ఆసక్తికర అంశాలు
- 'మిర్రర్' పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలో అన్నింటి కంటే విలువైన పోస్టల్ స్టాంప్ 55,50,000 పెన్నీ (బ్రిటీష్ పెన్నీ) ఇటీవలి కాలంలో బ్రిటీష్ మెజెంటా స్టాంప్ విలువ మునుపటి కంటే ఎక్కువగా 95 లక్షల డాలర్లలో ఉంది. ఇది 1856లో బ్రిటిష్ గయానాలో పరిమిత సంఖ్యలో జారీ చేయబడింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉనికిలో ఉంది. బ్రిటిష్ రాయల్ ఫిలాటెలిక్ సేకరణలో ప్రాతినిధ్యం వహించని ఏకైక ప్రధాన తపాలా బిళ్ల ఇది.
- మన దేశంలో మొదటిసారి పోస్టల్ స్టాంప్‌ను 1852లో విడుదల చేశారు. కాగా క్వీన్ విక్టోరియా చిత్రంతో మొదటి సచిత్ర పోస్టల్ స్టాంప్ 1, అక్టోబర్ 1854లో విడుదలయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి పోస్టల్ స్టాంప్‌ను నవంబరు 21, 1947న విడుదల చేశారు. అప్పుడు విడుదల చేసిన ఈ స్టాంప్ విలువ 1.5 అణాలు. దేశంలో అతిపెద్ద పోస్టల్ స్టాంప్ మాత్రం ఆగస్ట్ 20, 1991న విడుదలైంది.
- గాంధీజీ చిత్రంతో కూడిన పోస్టల్ స్టాంప్ వేలంలో ఐదు లక్షల పౌండ్లకు ఇంగ్లండ్‌లో అరుదైన పోస్టల్ స్టాంప్‌లను 2017 ఏప్రిల్‌లో వేలం వేశారు. అక్కడ రూ.10 విలువ కలిగిన గాంధీబొమ్మ ఉన్న నాలుగు స్టాంప్‌లను ఐదు లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. అయితే కొంతమంది పోస్టల్ స్టాంప్ కలెక్షన్ హాబీగా వివిధ రకాల స్టాంపులను సేకరిస్తుంటారు.
- ఉత్తరాల బట్వాడాలో వేగం, కచ్చితత్వాన్ని సాధించడానికి 1972 ఆగస్టు 15న మన దేశంలో పిన్‌కోడ్ (పిఐఎన్-పోస్టల్ ఇండెక్స్ నంబర్) విధానాన్ని ప్రవేశపెట్టారు. పిన్‌కోడ్‌లో ఆరు అంకెలు ఉంటాయి. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్‌జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడంకెలు డెలివరీ పోస్టాఫీసును తెలియజేస్తాయి. దేశాన్ని మొత్తం 9 పిన్‌కోడ్ జోన్లుగా విభజించారు.
ఉదయ్ శంకర్ ఆకుల
79897 26815