Jul 14,2023 10:33

పనామా : గ్వాంటనామో నౌకా స్థావరం వద్ద కొన్ని రోజుల పాటు అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి తిష్టవేయడాన్ని క్యూబా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రెచ్చగొట్టేందుకే అమెరికా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ అమెరికా జలాంతర్గామని నౌకా స్థావరంలో ఉందని క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నౌకాస్థావరంలోకి జలాంతర్గామి ప్రవేశాన్ని క్యూబా ప్రభుత్వం తిరస్కరిస్తుందని, ఇది అమెరికా రెచ్చగొట్టే చర్య అని, దీనివెనుకున్న రాజకీయ, వ్యూహాత్మక దురుద్దేశ్యాలు పూర్తిస్థాయిలో వెల్లడికావాల్సివుందని తెలిపింది.
          క్యూబా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 121 ఏళ్లుగా గ్యాంటనామో బేలో అమెరికా దురాక్రమణ కొనసాగుతోందని తెలిపింది. ప్రస్తుత సమయంలో శాంతియుత ప్రాంతంలో నౌకా స్థావరం వద్ద అణు జలాంతర్గామి తిష్టవేసివుంచడానికి సైనిక కారణమేమిటని, ఏ కుతంతంత్రంలో అక్కడ అణ్వాయుధ జలాంతర్గామిని ఉంచాల్సివచ్చిందో అమెరికా చెప్పాలని క్యూబా నిలదీసింది. అమెరికా సైనిక జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. గ్వాంటనామోలో చట్ట విరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్యూబా స్పష్టం చేసింది.