
నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండు శాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్థికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. ఈ రెండు పార్టీల మధ్య తేడా ప్రధానంగా దేశీయ రాజకీయాల్లోనే వుంటుంది. విదేశాంగ విధానంలో రెండూ ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తాయి. వాల్‌స్ట్రీట్‌తో, మిలిటరీ ఇండిస్టియల్ కాంప్లెక్స్‌తో ఈ రెండు పార్టీలు అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి వుంటాయి. వారి ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు పోటీ పడుతుంటాయి. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
నవంబరు ఎనిమిదిన అమెరికా పార్లమెంటు, రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పదిహేనవ తేదీ మంగళవారం నాటికి కూడా లెక్కింపు పూర్తి కాలేదు. అక్కడ అనుసరిస్తున్న ఓటింగ్, లెక్కింపు విధానాలతో ఫలితాల ఖరారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నది. పార్లమెంటు దిగువ సభలో 435 స్థానాలకుగాను 218 తెచ్చుకున్నవారికి స్పీకర్ పదవి దక్కుతుంది. తాజా వివరాల ప్రకారం రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 206 స్థానాలతో ఉన్నారు. రిపబ్లికన్లకు మెజారిటీ రానుంది. వంద సీట్లున్న ఎగువ సభ సెనేట్‌లో ఇద్దరు ఇతర పార్టీల వారి మద్దతుతో డెమోక్రటిక్ పార్టీ బలం 50 కాగా రెండవసారి ఎన్నిక జరగాల్సిన అలాస్కా సీటు రిపబ్లికన్ పార్టీకి కచ్చితంగా దక్కుతుంది కనుక దానికి 50 సీట్లు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు. డెమోక్రాట్లకు మెజారిటీ వచ్చినందున అక్కడి ఓటర్లు కూడా రిపబ్లికన్లను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఉపాధ్యక్ష స్థానపు ఓటుతో డెమోక్రాట్లకు 51 ఓట్లతో మెజారిటీ ఖాయమైంది.
ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్ గత బుధవారం నాడు చేసిన వ్యాఖ్యలు ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్ధమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్ చెప్పాడు. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్ పార్టీకి 220, రిపబ్లికన్ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రిపబ్లికన్లకు మెజారిటీ ఖరారైంది. ఓటింగ్ సరళి ప్రకారం రెండు పార్టీల తేడా తొమ్మిది సీట్లు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినపుడు ఏ పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేళ్ల తరువాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది.
పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని సమర్ధించిన అనేక మంది ''మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్)'' రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ మొత్తంగా మితవాద శక్తులతో కూడినప్పటికీ దానిలో మాగా రిపబ్లికన్లు పచ్చి మితవాద ఫాసిస్టు, దురహంకార శక్తులు.
ఎన్నికల్లో ఓడినప్పటికీ రోజు రోజుకు పెరుగుతున్న మాగా రిపబ్లికన్ల మీద ఒక కన్నేసి ఉంచాలని ఎఎఫ్‌ఎల్-సిఐఓ కార్మిక సంఘం అధ్యక్షురాలు లిజ్ షులర్ హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్ధారిస్తుందని అందువలన కార్మికులు ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా అనుసరించాలని పిలుపునిచ్చారు. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకారులని చెప్పారు. అబార్షన్ హక్కు గురించి రాష్ట్రాలకు వదలి వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన అనేక చోట్ల అబార్షన్ హక్కుకు మద్దతు ఇచ్చిన డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చారని షులర్ చెప్పారు. ఆర్థిక సవాళ్లు, గ్యాస్, ఆహార అధిక ధరలు రిపబ్లికన్ల వైపు ఓటర్లను నెడతాయని సాధారణ విశ్లేషణలు వెలువడినా మితవాద శక్తుల ఎజెండాను కూడా కార్మికులు తీవ్రమైనదిగా పరిగణించిన కారణంగానే మాగా శక్తులను ఓడించారు. మాగా రిపబ్లికన్లకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినా వారి నేతగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ పట్టు పార్టీ మీద ఇంకా ఉంది, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులలో 300 మందికి ట్రంప్ మద్దతు ఉంది. వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నాడు.
ఈ ఎన్నికలు ఖర్చు విషయంలో అమెరికా చరిత్రలోనే కొత్త రికార్డును సృష్టించాయి. ఓపెన్ సీక్రెట్స్ అనే సంస్థ అంచనా ప్రకారం 1670 కోట్ల డాలర్ల ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మన కరెన్సీలో ఇది రు.1,37,000 కోట్లకు సమానం. ఇది ఎన్నికలకు వారం ముందు అంచనా, అనధికారికంగా అనేక మంది చేసిన ఖర్చు దీనిలో లేదు. పార్టీల అభ్యర్ధుల ఎంపిక నుంచే డబ్బు ప్రవాహం మొదలౌతుంది. గత ఎన్నికల్లో పార్టీ వెలుపలి బృందాలు 160 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 190 కోట్లకు పెరిగిందని అంచనా. జనాభాలో కేవలం 0.0003 శాతం ఉన్న బిలియనీర్లు ఎన్నికల ఖర్చులో పది శాతం కలిగి వుంటారని అంచనా. జార్జి సోరస్ 12.8 కోట్ల డాలర్ల ఖర్చుతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అభ్యర్ధులే ఎక్కువ మంది గెలిచినట్లు రెండు దశాబ్దాల సమాచారాన్ని క్రోడీకరించిన ఓపెన్ సీక్రెట్స్ సంస్థ పేర్కొన్నది. పార్లమెంటుకు పోటీ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన వారు 71 నుంచి 98 శాతం వరకు గెలిచినట్లు తేలింది. ప్రారంభంలో చేసే ఖర్చును బట్టి ఫలితాలను ఊహించుకోవచ్చు.
సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి లేదు. బ్యాలట్ పత్రాలనే వాడుతున్నారు. పోలింగ్ తేదీకి ముందే ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది. మన దగ్గర విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలట్ మాదిరి ఏ ఓటరైనా వేయవచ్చు. ఇమెయిల్ ద్వారా ఓటు వేసి తరువాత బ్యాలట్ పత్రాన్ని పోస్టు ద్వారా పంపుతారు. ఈ కారణంగానే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వారాల తరబడి సాగుతున్నది.
వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పచ్చి మితవాద శక్తులకు ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని చోట్ల అక్రమాలకు పాల్పడి గెలిచిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓహియోలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగా 33 రాష్ట్ర అసెంబ్లీ సెనెట్ సీట్లకు గాను 1951 తరువాత తొలిసారిగా రిపబ్లికన్లు 26 సీట్లు తెచ్చుకున్నారు. సౌత్ కరోలినాలో కూడా తొలిసారిగా ఇలాగే మూడింట రెండు వంతుల సీట్లు తెచ్చుకున్నారు. డెమోక్రాట్లకు పట్టున్న న్యూయార్క్ రాష్ట్రంలో ఇలాంటి అక్రమాల కారణంగానే ఈసారి నలుగురు రిపబ్లికన్లు పార్లమెంటుకు అదనంగా గెలిచారు. రాష్ట్రాల అసెంబ్లీలను మొత్తంగా చూస్తే డెమోక్రాట్‌లే ఎక్కువ మంది ప్రతినిధులను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ రాష్ట్రాలలో గవర్నర్లు రిపబ్లికన్లు ఎన్నికయ్యారు. 1900 సంవత్సరం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమే మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీ రాష్ట్రాల చట్టసభల్లో మెజారిటీ సాధించింది.
రిపబ్లికన్ల గాలిని అడ్డుకున్నప్పటికీ అమెరికా కార్మిక వర్గానికి వారి నుంచి ఉన్న ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నందున కార్మిక అనుకూల ప్రతిపాదనలను అడ్డుకొనే అవకాశం ఉంది. జడ్జీల నియామకాలకు ఆటంకం కల్పించవచ్చు. నేరాలను రిపబ్లికన్లు పెద్ద అంశంగా ఎన్నికల్లో ముందుకు తెచ్చారు. సర్వేల ప్రకారం అది ప్రధాన అంశమని కేవలం పదకొండు శాతం మాత్రమే పేర్కొన్నారు. ఆర్థికం, అబార్షన్లు, ప్రజాస్వామ్యం ప్రధాన అంశాలుగా చూశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే డెమోక్రాట్లకు జనం మద్దతు ఇచ్చినట్లు ఫలితాలు వెల్లడించాయి. ఈ రెండు పార్టీల మధ్య తేడా ప్రధానంగా దేశీయ రాజకీయాల్లోనే వుంటుంది. విదేశాంగ విధానంలో రెండూ ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తాయి. వాల్‌స్ట్రీట్‌తో, మిలిటరీ ఇండిస్టియల్ కాంప్లెక్స్‌తో ఈ రెండు పార్టీలు అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగివుంటాయి. వారి ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు పోటీ పడుతుంటాయి. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
ఎం. కోటేశ్వరరావు