
న్యూఢిల్లీ : డిజిటల్ రూపీ కరెన్సీ ద్వారా యుపిఐ లావాదేవీలు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపీతో క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. ఇ-రూపీ బై ఎస్‌బిఐ యాప్ ద్వారా ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చని ఎస్‌బిఐ తెలిపింది. దీంతో ఎస్‌బిఐ ఇ-రూపీ యాప్ వాడుతున్న వారు ఇకపై డిజిటల్ లావాదేవీలు పూర్తి చేయొచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంతో యుపిఐ లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్‌లను వినియోగిస్తున్న వ్యాపారులు రోజువారీ వ్యాపార లావాదేవీల్లో ఇకపై డిజిటల్ రూపాయిని సైతం వినియోగించుకోవడానికి వీలుంటుందని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 అక్టోబర్ 31న డిజిటల్ రుపీ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొదట హోల్‌సేల్ విభాగంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తొమ్మిది బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొనడానికి ఆర్‌బిఐ అవకాశం కల్పించింది. వీటిలో ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులున్నాయి.