Aug 08,2023 14:42
  • మేనేజర్‌ పై ఉన్నతాధికారుల ఫిర్యాదు.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.

ప్రజాశక్తి- రాయదుర్గం(అనంతపురం) : రాయదుర్గం పట్టణంలోని కనేకల్‌ రోడ్డులో గల భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ కార్యాలయంలో ఒక కోటి 7 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగింది. ఇదివరకు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసిన ఎస్‌ఎల్‌ఎన్‌ ఫణి కుమార్‌ బ్యాంకు ఖాతాదారులకు చెందిన 1,07,30,023 రూపాయలు సొమ్ము తన తల్లి, ఇతరుల ఖాతాకు బదిలీ చేసి నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గమనించిన స్టేట్‌ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు శాఖ పరమైన విచారణ చేపట్టి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్లో గత జూన్‌ నెల 21న అప్పటి బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ ఫణికుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 117/2023. నమోదయింది. అప్పటినుండి ఫణి కుమార్‌ పరారీలో ఉన్నారు. బ్యాంకు ఉన్నత అధికారులు బ్యాంకులో విచారణ జరిపి దుర్వినియోగానికి గురైన ఖాతాదారుల సొమ్మును తిరిగి వారి ఖాతాకు జమ చేశారు. ఆ విషయం ధ్రువీకరిస్తూ ఖాతాదారులకు తెలియజేశారు. బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మేనేజర్‌ ఫణి కుమార్‌ కోసం గాలిస్తున్నట్లు స్థానిక పోలీస్‌లు తెలిపారు. పట్టణంలో ప్రధానమైన భారతీయ స్టేట్‌ బ్యాంకులో ప్రజల ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం కావడం పట్ల ప్రజలు, ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.