న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రూ.2,000 నోట్ల ఉపసంహరించుకోవాలని ప్రకటించడంతో దేశంలో వినిమయం పెరగనుందని ఎస్‌బిఐ రీసెర్చ్ ఓ నివేదికలో పేర్కొంది. బ్యాంకు డిపాజిట్లు, రుణాల చెల్లింపు, వినియోగం, రిటైల్ డిజిటల్ కరెన్సీ వినియోగం సహా ఆర్థిక వృద్థిని పెంచనుందని విశ్లేషించింది. రూ.2వేల నోటును ఉపసంహరించుకోవడం వల్ల వినియోగ డిమాండ్‌లో తక్షణ పెరుగుదల ఉండొచ్చని ఎస్‌బిఐ గ్రూప్ చీప్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. '' రూ.2వేల నోటును ఉపసంహరించుకునే క్రమంలోనూ చట్టబద్ధమైన టెండర్‌గా అవకాశం కల్పించడంతో వినియోగం ఊపందుకుంది. ముఖ్యంగా బంగారం, ఆభరణాలు, మొబైల్ ఫోన్‌లు, అత్యాధునిక వినియోగ వస్తువులు, రియల్ ఎస్టేట్ తదితర వాటి కొనుగోళ్లు పెరగొచ్చు'' అని సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఇంధన కేంద్రాల్లో నగదు విలువ లావాదేవీలు, కొనుగోళ్లకు క్యాష్ ఆన్ డెలివరీ, దేవాలయాల్లో విరాళాలు, వివిధ రకాల కొనుగోళ్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. రూ.2000 నోట్ల ఉపసంహరణ వల్ల బ్యాంక్‌ల్లో రూ.1.5 లక్షల కోట్ల డిపాజిట్లు పెరగొచ్చని ఎస్‌బిఐ నివేదిక అంచనా వేసింది. 2023 మార్చి ముగింపు నాటికి దేశంలో రూ.3.62 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. వచ్చే సెప్టెంబర్ ముగింపు వరకు ఈ నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బిఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.