Dec 31,2022 07:39

విద్యార్థులందరిలో ఒక విమర్శనాత్మక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం యూనివర్సిటీల పని. అందుకే, యూనివర్సిటీలు ఒకే విషయం పైన భిన్నాభిప్రాయాలను, భిన్న వైఖరులను విద్యార్థులకు పరిచయం చేస్తాయి. ప్రతీ భావాన్ని, ప్రతీ ఆలోచనను పరిశీలించడానికి విద్యార్థులకు మేధోపరమైన సాధనాలను లేదా విధానాలను సమకూర్చిపెట్టడం వాటి బాధ్యత. అధ్యాపకునికి తనకంటూ ఒక స్వంత అభిప్రాయం ఉండవచ్చు, కానీ అది విద్యార్థులు అంగీకరించకుండా ఉండలేని అధికారిక అభిప్రాయం కాదు. కానీ, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ భావజాలంపై ఏకాభిప్రాయాన్ని సృష్టించి, ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని యుజిసి యూనివర్సిటీల్ని అడుగుతుండడంతో అక్కడ ఎలాంటి భిన్న స్వరానికి చోటు లేదు. ఇది యూనివర్సిటీలు చేయాల్సిన పనికి ఖచ్చితంగా వ్యతిరేకం.

న్నత విద్యాసంస్థలు, విద్యార్థులు, అధ్యాపకుల కోసం ధ్యాన సమావేశాలను నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) కోరుకుంటున్నది. శ్రీ శ్రీ రవిశంకర్‌ ఏజెన్సీ 'ద ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌' అభివృద్ధిపరచిన ధ్యాన విధానాన్ని అనుసరించాలని నవంబర్‌ 24న జారీ చేసిన సర్క్యులర్‌లో యుజిసి స్పష్టం చేసింది. ఆ సంస్థకు ప్రచారం కల్పించే సంస్థగా యుజిసి మారిందేమిటని ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకు ముందు ఇలాంటి ఆజ్ఞలు ఆశ్చర్యాన్ని కలిగించేవి. యూనివర్శిటీలో ఎటువంటి కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహించాలనే ఆదేశాలు జారీ చేయడం యుజిసి పని కాదు. ఉన్నత విద్యను ప్రోత్సహించడం, ఉన్నత విద్యారంగాన్ని సమన్వయపరచడం, ఉన్నత విద్యా శ్రేష్టతను, స్థాయిని నిలబెట్టే విధంగా యుజిసి ఆదేశాలు ఉండాలి. విద్యార్థులకు ఏం బోధించాలి? ఎలాంటి కోర్సులకు రూపకల్పన చేయాలి? విద్యార్థులనెలా చేర్చుకోవాలి? అధ్యాపకులనెలా నియమించుకోవాలి? యూనివర్సిటీ బయట నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏమిటి? లాంటి అంశాలను యూనివర్సిటీలు వేటికవి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమావేశాలను, సెమినార్లను, సాంస్కృతిక కార్యక్రమాలను వివిధ శాఖలు నిర్వహించాలనే విషయాల్ని నిర్ణయించే స్వేచ్ఛ యూనివర్సిటీలకు ఉంటుంది. ఇలాంటి అన్ని విషయాల్లో యూనివర్సిటీలు పూర్తి స్వతంత్రంగా ఉంటాయి. ప్రతీ యూనివర్సిటీ స్వంత చట్టాల ద్వారా నిర్వహింపబడుతుంది కాబట్టి, యూనివర్సిటీ సంబంధిత విషయాల్లో యుజిసి ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. అంతేకాక, ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం కోసం యుజిసిని ఏర్పాటు చేయలేదు. యూనివర్శిటీ చట్టాలను పరిశీలిస్తే ఆఖరికి ప్రభుత్వానిక్కూడా వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని మనకు స్పష్టమవుతుంది.
      ఈ పరిస్థితి 2014 నుండి మారుతూ వస్తున్నది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ధ్యాన కార్యక్రమాలను యుజిసి ఎలా ప్రోత్సహిస్తుందని ఆశ్చర్యపోతున్నవారు, గడచిన 8 సంవత్సరాల్లో యుజిసి రికార్డ్‌ను చూడాలి. భారత ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పాలక పార్టీ సైద్ధాంతిక కార్యక్రమాలు లేదా దాని ప్యాట్రన్‌ ఆరెస్సెస్‌ కోసం ప్రచారకర్తగా యుజిసి పని చేస్తున్నది. 2014 లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇలాంటి కార్యక్రమాలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అవి అక్టోబర్‌ 2న నిర్వహించబడే స్వచ్ఛ భారత్‌ దివస్‌ తో ప్రారంభమై వెంటనే సర్దార్‌ వల్లభారు పటేల్‌ పుట్టినరోజైన అక్టోబర్‌ 31న నేషనల్‌ యూనిటీ డే ను, అటల్‌ బిహారీ వాజ్‌పేయి పుట్టినరోజైన డిసెంబర్‌ 25న గుడ్‌ గవర్నెన్స్‌ డే ను, జూన్‌ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
          ప్రభుత్వం దృష్టిలో విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో జాతీయవాదం లేదా దేశభక్తి లోపించింది. దేశభక్తికి, ధైర్యసాహసాలకు మధ్య ఉండే సంబంధం అందరికీ తెలిసిందే. దేశభక్తి గురించి సైనికునికంటే ఎవరికి ఎక్కువ తెలుసు? సైన్యం పట్ల గౌరవం పెంపొందించడానికి యూనివర్సిటీలలో ధైర్యసాహసాల కుడ్యాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుడ్యాలపై పరమవీరచక్ర లాంటి అవార్డులు పొందిన సైనికుల చిత్రాలుండాలట. అది కూడా సరిపోక, ప్రతీ యూనివర్సిటీ క్యాంపస్‌లో జాతీయ జెండాను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. అలాంటి కార్యక్రమాల ఫొటోలు, వీడియోల్ని తప్పకుండా యుజిసికి, మంత్రిత్వ శాఖకు విధిగా పంపాలి. ఆ ఆజ్ఞలను సూచనలుగానే పంపించారు కాబట్టి అధ్యాపకులు వాటికనుగుణంగా వ్యవహరిస్తారో లేదోనని యుజిసి సందేహిస్తున్నది. కాబట్టి ఆ ఆజ్ఞలు పాటిస్తారనే హామీ కోసం ప్రతీ కార్యక్రమాన్ని రికార్డ్‌ చేసి ఆయా సంస్థల వెబ్‌సైట్లో పెట్టాలి.
 

                                                               ప్రచార సంస్థలుగా యూనివర్సిటీలు

హిందూత్వ జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ... యూనివర్సిటీలు ఈ భావజాల ప్రచార కేంద్రాలుగా మారాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. రవిశంకర్‌ 'ధ్యాన ప్రచారానికి' కొద్ది రోజుల ముందు, నవంబర్‌ 26 రాజ్యాంగ దినోత్సవం నాడు ''ఇండియా:మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ''పై సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాలను యుజిసి విద్యా సంస్థలకు పంపింది.
          ముఖ్యమైన ''జాతీయంగా ప్రత్యేకతలున్న సందర్భాల్లో'' గతంలో ఎన్నడూ ఇలాంటి మార్గదర్శకాలను జారీ చేసిన సందర్భం ఎవరికీ గుర్తు లేదు. యూనివర్శిటీలను స్వతంత్ర ఆలోచనలున్న సంస్థలుగా పరిగణించేవారు. విద్యార్థుల్ని ''జాతీయవాదులు''గా మార్చడం వాటి బాధ్యతగా ఉండేది కాదు. కానీ పరిస్థితులు మారాయి. ధ్యానానికి సంబంధించిన లేఖ లాంటిదే, ఇక్కడ కూడా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (ఐసిహెచ్‌ఆర్‌) తయారు చేసిన ఒక నోట్‌ను యుజిసి పంపింది. ఆ నోట్‌ లోని ఆదేశాలకు అనుగుణంగానే విషయంపై చర్చ నిర్వహించాల్సి వచ్చింది. భారతదేశం, ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం, దాని ప్రజాస్వామిక సాంప్రదాయాలను కాప్‌ పంచాయతీల్లోనే చూడవచ్చని ఆ నోట్‌ చెపుతుంది. ఆ ప్రజాస్వామ్యం దాని మూలాలను వేద కాలంలోనే కలిగిఉందనీ, ఈ భూమిపై భారతదేశం మనుషుల జ్ఞప్తికి అందనంత కాలం నుండి ఉనికిలో ఉంటుంది కాబట్టి భారతదేశం చాలా గొప్పదట. ఐసిహెచ్‌ఆర్‌ నుండి వచ్చిన ఈ నోట్‌పై మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ అధికార ప్రకటనను విమర్శిస్తూ అభిప్రాయాలను కార్యక్రమాల్లోనే వ్యక్తం చేయడం సాధ్యమేనా? చర్చా ప్రక్రియ, ఐసిహెచ్‌ఆర్‌ ప్రకటించిన అధికార వైఖరినే అనుసరించాలి కాబట్టి చర్చ, సంవాదం, వాదనల ప్రశ్నే తలెత్తదని యుజిసి స్పష్టం చేసింది.
              అందువల్ల దాన్ని చర్చ అనే దానికంటే ప్రచారమని అనడం సముచితంగా ఉంటుంది. ఒక భావాన్ని ప్రచారం చేయడం యూనివర్సిటీల పని కాదు. అన్ని భావాలను, భావజాలాలను, పరిశీలించి దానిని విమర్శనాత్మకంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయించడం యూనివర్సిటీల పని. ఒక తత్వవేత్తను లేదా ఒక భావజాలాన్ని విశ్వసించే విధంగా విద్యార్థులకు బోధించడం అధ్యాపకుని పని కాదు. గొప్పతనం గురించి ప్రతీ వాదన తరగతి గదుల్లో, సెమినార్లలో, పరిశోధనా పత్రాల్లో పరీక్షిస్తారు. విద్యార్థులందరిలో ఒక విమర్శనాత్మక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం యూనివర్సిటీల పని. అందుకే, యూనివర్సిటీలు ఒకే విషయం పైన భిన్నాభిప్రాయాలను, భిన్న వైఖరులను విద్యార్థులకు పరిచయం చేస్తాయి. ప్రతీ భావాన్ని, ప్రతీ ఆలోచనను పరిశీలించడానికి విద్యార్థులకు మేధోపరమైన సాధనాలను లేదా విధానాలను సమకూర్చిపెట్టడం వాటి బాధ్యత. అధ్యాపకునికి తనకంటూ ఒక స్వంత అభిప్రాయం ఉండవచ్చు. కానీ అది విద్యార్థులు అంగీకరించకుండా ఉండలేని అధికారిక అభిప్రాయం కాదు. కానీ, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ భావజాలంపై ఏకాభిప్రాయాన్ని సృష్టించి, ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని యుజిసి యూనివర్సిటీల్ని అడుగుతుండడంతో అక్కడ ఎలాంటి భిన్న స్వరానికి చోటు లేదు. ఇది యూనివర్సిటీలు చేయాల్సిన పనికి ఖచ్చితంగా వ్యతిరేకం. కానీ కాసేపు ఈ ఆలోచనను పక్కన పెట్టి, ఈ అధికారిక ఆదేశాలు యూనివర్సిటీలను, ఉన్నత విద్యా సంస్థలను పాఠశాలల విస్తరణలుగా ఎలా మారుస్తున్నాయనేది అర్థం చేసుకోవాలి.
          జెండా ఆవిష్కరణ, జాతీయ దినాలు లేదా ప్రత్యేక దినాలను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నిర్వహించబడాలి. ఇలాంటివి గతంలో యూనివర్సిటీల ద్వారా జరగలేదు. మన యూనివర్సిటీలపై చేస్తున్న అదుపును ప్రపంచ వ్యాప్తంగా విద్యావేత్తలు విమర్శించారు. ప్రభుత్వ భావజాలానికి అనుగుణంగా విద్యార్థులను సామాజీకరణ చేయడానికి వాటిని ఉపయోగించుకుంటున్నారని వారన్నారు. కానీ ఉన్నత విద్యంటే ఎప్పటికీ స్వేచ్ఛ అనే అర్థాన్ని ఇస్తుంది. వ్యక్తిత్వానికి చోటు, అధ్యాపకులు, విద్యార్థులపై సంస్థాగత అదుపు నామమాత్రంగానే మిగిలి ఉన్నాయి. అధ్యాపకుల పని, తరగతి గదుల పని విద్యార్థుల మనసులను ప్రత్యేకమైన ఆకారంలోకి రూపొందించడం కాదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు యుజిసి ద్వారా ఖచ్చితంగా అదే పని చేస్తుంది.
           మనం అలాంటి హాస్యాస్పదమైన, అవివేకమైన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించాలని చాలామంది అంటున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ, పరిశుభ్రత చాలా మంచి విషయాలని చెప్పే సందేశాన్ని వ్యాప్తి చేయడం లేదా జాతీయ ఐక్యత అనుభూతిని వ్యాప్తి చేయడంలో ఏం తప్పుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా యోగా శారీరక ఆరోగ్యానికి మంచిది, ధ్యానం మానసిక ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటున్నారు. ప్రభుత్వం లేదా యుజిసి ఈ పనులన్నీ చేయమని మనను ప్రోత్సహిస్తే మనం ఎందుకు ఆక్షేపించాలి ?
           పైకి చూడడానికి ఈ మార్గదర్శకాలు చాలా నిష్కపటంగానే కనిపిస్తాయి. కానీ వాటిని విశాలమైన సందర్భంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను, ప్రతీ దాన్ని కేంద్రీకృతం చేసి, భిన్న విద్యాసంస్థల్లో ఏకరీతి (యూనిఫామిటీ)ని రూపొందించే లక్ష్యాలు గల ఇతర ఆదేశాలతో పాటు కలిపి చదవాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు వాటికవే ఆలోచించి, నిర్ణయాలు చేయడానికి అనుమతించడం లేదు. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కేంద్రీకృతం చేయబడుతున్నది. ఏకరీతి ప్రమాణాల ద్వారా అధ్యాపకులు, వైస్‌ ఛాన్సలర్ల ఎంపిక ఇప్పుడు చట్టం అయింది. కోర్సులన్నీ ఏకరీతిగానే రూపొందించ బడుతున్నాయి. పాలనా వ్యవహారాలు, విద్యావిషయక అంశాల్లో యూనివర్సిటీల స్వతంత్ర ప్రతిపత్తిని లాగేసుకుంటున్నారు.
          ఏకరీతి పిలుపు ఒక జనరంజకమైన విన్నపాన్ని కలిగి ఉంటుంది. కుర్రాళ్ళను జాతీయవాదులుగా తయారు చేయాలనే ఆలోచనకు దుర్బుద్ధిని పుట్టించే లక్షణం ఉంటుంది. కానీ అదే సమయంలో నీవు ప్రపంచ స్థాయి జాతీయవాదివి కాలేవు. ప్రపంచం లోని ఏ గొప్ప యూనివర్సిటీ కూడా తన విద్యార్థుల్లో జాతీయవాదాన్ని నాటుకొనేట్లు చేసే ప్రయత్నం చేయదు. సమాజం దృష్టిలో యూనివర్సిటీ అనే భావనను మార్చేయడమే అలాంటి ఉత్తర్వుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అసలు ఒక ఉన్నత విద్యా సంస్థ లక్ష్యం ఏమిటి? విజ్ఞానం, దాని అభివృద్ధే యూనివర్సిటీల లక్ష్యమైతే, మరి విద్య ఏమిటి? విజ్ఞానాన్నందించేది ఏమిటి? పురాతన కాలాల నాటి గొప్ప విజ్ఞానం గురించి విజయ గీతాలనాలపించి, దాన్ని పునరుద్ధరించడమా ?
           ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు మనసులను భారతీయీకరణ చేసే యంత్రాలుగా తయారయ్యాయి. కొద్ది సంవత్సరాల క్రితం ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు కొందరు నన్ను కలిసేందుకు వచ్చారు. వారు రీఓరియెంటేషన్‌, రిఫ్రెషర్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు, అధ్యాపకులకు వారి వారి విషయ సంబంధిత అంశాల్లో నూతన పరిశోధనా పద్ధతులను పరిచయం చేయడానికి ఉద్దేశించబడతాయి. కానీ అధ్యాపకులు హాజరైన ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్‌, దాని అనుబంధ సంస్థలకు చెందిన నాయకులను ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలిపించారు. అంతా లేచి నిలబడి ''చైనా వస్తువులు, తలాక్‌, తలాక్‌, తలాక్‌'' అని నినాదాలివ్వాలని ఒక ఉపన్యాసకుడు అధ్యాపకులను అడిగాడు. ''మాకు అఖండ భారత్‌ లోనే చావు రానివ్వండి'' అనే ప్రమాణాన్ని అధ్యాపకులందరిచేత బలవంతంగా చెప్పించారు.
       ఇలాంటి అసంగతమైన విషయాలు సర్వసాధారణమై, అధ్యాపకులు ఫిర్యాదులు చేయడం కూడా ఆపేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో నిర్వహించబడిన ఆరెస్సెస్‌ నాయకుల ప్రసంగాలను వినేందుకు అధ్యాపకులు హాజరవ్వాలని పిలుపిచ్చారు. ఆరెస్సెస్‌ నాయకత్వానికి తెలిసే విధంగా ఇప్పుడు వైస్‌ ఛాన్సలర్లు, డీన్లు, వివిధ శాఖాధిపతులు ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండానే వారి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తు చేసుకుంటున్న స్కాలర్లు అలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం లేదా ఆరెస్సెస్‌ కు విశ్వాసంగా ఉన్నారని రుజువు చేసుకునేందుకు అలాంటి కార్యక్రమాలను వారే నిర్వహిస్తున్నారు. వీరు ఆరెస్సెస్‌ కార్యక్రమాల కోసం విద్యార్థులు, అధ్యాపకులతో కూడిన జాబితాను తయారు చేసి, వారిని సమీకరిస్తున్నారు.
            ఫలితంగా విద్య, విజ్ఞానం, పరిశోధనల భావం లేదా అర్థం మన సమాజం దృష్టిలో నుండి మాయమైపోతుంది. యూనివర్శిటీ అనేది జాతీయవాద భావనల సంస్థ కాదు. అది అంతర్జాతీయ విజ్ఞాన సంఘంలో ఒక భాగంగా ఉండాల్సి ఉంటుంది, అక్కడ తన ఉనికిని చాటుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు, మనం దీనిని మర్చిపోతున్నాం. మన యూనివర్సిటీలు ఇప్పుడు సంకుచిత వ్యవస్థలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నూతన భావాలు ఉద్భవించే అవకాశాలు చాలా కొద్దిగానే ఉన్నాయి. సంకుచిత హిందూత్వ ఆధారిత మతోన్మాద దృష్టిని ప్రోత్సహించడం ద్వారా యూనివర్సిటీలు కూడా హిందూయేతరులకు పరాయి ప్రాంతాలుగా మారుతున్నాయి.

(''ఫ్రంట్‌ లైన్‌'' సౌజన్యంతో)
అపూర్వానంద్‌

అపూర్వానంద్‌