Aug 17,2023 12:21

ప్రజాశక్తి-శ్రీసత్యసాయి జిల్లా: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి ప్రాంతంలో చిరుత పులుల మృతి ఆందోళన కలిగిస్తోంది. మెళవాయిలో బుధవారం ఓ చిరుత మృతి చెందిన ఘటన మరవకముందే గురువారం మరో చిరుత మృతి చెందింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని.. చిరుతల మరణాలపై కారణాలను విశ్లేషిస్తున్నారు. సత్యసాయి జిల్లా ఫారెస్ట్‌ అధికారి రవీంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. బుధవారం మృతి చెందిన చిరుత వయస్సు ఏడాదిన్నర నుండి రెండేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. చిరుతలు అనారోగ్యానికి గురై మృతి చెందాయ.. లేక విష ప్రయోగంతో మృతి చెందాయ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిరుతల యొక్క శరీర అవశేషాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పంపి మృతికి గల కారణాలను విశ్లేషిస్తామన్నారు. మేళవాయి గ్రామ పరిసరాల్లో తల్లి చిరుత సంచారం ఉంటుందని.. స్థానిక ప్రజలు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్‌ అమర్నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. చిరుతల మృతదేహాలను నేడు శవపరీక్ష చేసి మృతికి గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు.