Jul 31,2023 22:37
  • తుపాను ధాటికి వణికిపోతును బీజింగ్‌, చుట్టుపక్కల ప్రాంతాలు
  • ఇద్దరి మృతి, పలుచోట్ల ముంచెత్తిన వరదనీరు

బీజింగ్‌ : గత కొద్ది రోజులుగా దోక్సూరి తుపాను ప్రభావంతో బీజింగ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పశ్చిమ బీజింగ్‌లోని మెంటగు ప్రాంతంలో శనివారం నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి 8గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు నగరంలో సగటు వర్షపాతం 176.9 మిల్లీమీటర్లు నమోదవగా, మెంటగు జిల్లాలో సగటున 322.1మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో బీజింగ్‌లో వరద హెచ్చరికలు జారీ చేశారు. మెంటగులో అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడంతో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో, ఇద్దరు మరణించారు. వరద నీటి ప్రవాహానికి అనేక కార్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు ఐదు వేల మందిని పర్వత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోవడంతో పాటూ అనేక రహదారులు దెబ్బతిన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజింగ్‌తో సహా ఉత్తరచైనాలో రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మెంటగుతో పాటూ బీజింగ్‌లోని ఇతర శివారు ప్రాంతాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఫంగ్‌షాన్‌ జిల్లాలోని జౌకుడియన్‌ పట్టణంలో ఒక కంపెనీకి చెందిన 80మంది ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.