
ప్రముఖ దినపత్రికలో బాక్స్ ఐటంగా వచ్చిన ఈ ప్రత్యేక ప్రకటన చూసిన యావత్ ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ పాత ప్రకటన కొత్తగా అనిపించి, జనంలో అంత ఉత్సుకత రేకెత్తించడానికి గల కారణం తెలుసుకునే ముందు..
***
ఆ దంపతులకు లేకలేక కలిగిన రాజేష్‌ని అల్లారుముద్దుగా పెంచారు. అపురూపంగా చూసుకున్నారు.
ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.
రాజేష్‌లో రోజురోజుకు పేరుకుపోతున్న విపరీత ధోరణికి తండ్రి రామానుజన్ నిరుత్తరుడయ్యాడు. కొంగు అడ్డంపెట్టుకుని తల్లి వనజ వలవలా ఏడ్చేసింది.
'అలా చేయడం తప్పు బిడ్డా!' అమ్మ ప్రేమగా ఎన్నోసార్లు కొడుక్కి నచ్చ చెప్పిచూసింది.
'వద్దు నాన్నా! కాస్త నేను చెప్పేది తలకెక్కించుకో!' కించిత్ ఆగ్రహం వ్యక్తపరిచాడు తండ్రి.
రాజేష్ తనకంటూ ఒక ప్రత్యేక లోకం సృష్టించుకున్నాడు.. తనదైన ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నాడు..
కళ్ళకు కాటుక అద్దుకొని ఎంతగానో ఆనందించేవాడు. నుదుట తిలకం దిద్దుకుని మురిసిపోయేవాడు. జుట్టు బాగా పెంచేసి వెనక్కి దువ్వి కడితే ఎంత ముద్దుగా అనిపించేదో!
తండ్రి 'ఓరి ఆడంగి వెధవా! ఈ చేష్టలేంట్రా?' అంటూ చీవాట్లు వేసాడు.
తల్లి కంటతడి పెట్టని క్షణం లేదు.
అతడి మనసు 'నువ్వసలు అబ్బాయివే కాదు.. ఎంచక్కా అమ్మాయివే!' అంటూ తరచూ గుసగుసలాడుతున్నట్టు అనిపించేది.
'నువ్వు అచ్చంగా అమ్మాయివే కదా! అబ్బాయిలతో నీకేం పని? నువ్వు స్నేహం చేయాల్సింది అమ్మాయిలతో!' పదే పదే అంతరాత్మ హెచ్చరించేది.
హైస్కూల్‌కి వచ్చాక రాజేష్‌కి తెలిసి వచ్చింది. తను, తను కాదని.. తనలో వేరెవ్వరో తన కోసం కాచుకు కూచున్నారని.
ఏదో తెలియని అంతర్లీన మార్పు అనివార్యమై.. అవాంఛనీయమై.. తనలోంచి తాను వేరవుతూ మరొక సగమవుతూ..
నేల మాళిగల్లోంచి విత్తు విచ్చుకుంటూ ఆకుపచ్చని మొలకలా అంకురిస్తూ శిరసెత్తుతున్నట్లు.. మొగ్గ రేకులు విప్పుకుంటూ మనోహర సౌరభాలు వెదజల్లుతున్నట్టు.. అతడి తనువులో ఏదో తెలియని ఆమెలాంటి వింత అనుభూతి..
అది చినుకల్లే మొదలై.. జడి వానవుతూ.. ఏరల్లే పరవళ్లు తొక్కుతున్నట్టు..
పదవ తరగతి చదువుతున్నంతవరకే ఈ విరుద్ధ భావ ప్రకంపనలు..
***
కాలేజీలోకి అడుగుపెట్టాక..
'వీడెవడో తేడాగాడిలా ఉన్నట్టున్నాడేంట్రా?'
'ఆ నడక, వయ్యారం.. సిగ్గు.. అచ్చంగా అమ్మాయిలానే..'
'ఆ బాడీ తిప్పడం.. మాట తీరేమో కొత్తగా! మనిషి.. పైకి ఒకలా.. లోపల మరొకలా మొత్తానికి పీచుగాడిలా లేడూ?'
ఇలాంటి కామెంట్స్ రాళ్లలా తోటివాళ్ల నుంచి తన గుండెవైపు విసిరేయబడుతున్నా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోయేవాడు.
భయాందోళనలకు గురికాకుండా భావోద్వేగాలను అణచుకుంటూ ప్రకతి తనతో మొదలుపెట్టిన ఒక విలక్షణ ఆటకి తనువెల్లా బలి అవుతూ లోలోపలే బడబాగ్ని దాచుకున్నాడు.
ఎంత ఏడ్చినా ఇంకని కన్నీటిని దోసిళ్ళతో గుండె లోగిలిలోకి వొంపుకుంటూ, పదే పదే గేలి చేస్తున్న వారి నుండి గే గా తిరస్కరించబడుతూ..
గుండెని రాయి చేసుకుని.. హృదయంలో విరబూస్తున్న అవాంఛిత ఊహలకు సరికొత్త రెక్కలు తొడుక్కుంటూ..
అతడి పయనం నూతన దారుల వెంట అడుగులు కదుపుతోంది..!
***
ఇంతటితో ఇక పురుష అవతారం చాలిస్తున్నట్టు.. అచ్చంగా అమ్మాయిలా బట్టలు తొడుక్కోవడం.. సింగారించుకోవడం.. అనివార్యమైంది.
సహజంగానే సమాజం నుండి ప్రతిఘటన మొదలయ్యింది.
అల్లరిమూకలు ఆట పట్టించడం నిత్యకత్యం అవుతుంటే.. రాజేష్ తన స్థితిని సమతాస్థితికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
మనిషికే కదా సమస్యలు.. మనుగడకే కదా ప్రతిబంధకాలు.. అనుకుంటూ ఒక కృత నిశ్చయానికి వచ్చాడు.. వచ్చింది..!
ఇరుగుపొరుగు సూటిపోటి మాటలతో మానసిక ఆందోళనకి గురవుతున్న తల్లిదండ్రులు.. కొడుకు చేస్తున్న పనులకు తట్టుకోలేకపోతూ.. అతడిని మరింత ఒత్తిడికి గురిచేయసాగారు.
ఇవన్నీ భరించలేక ఒకరోజు చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయాడు రాజేష్.
***
తనలాంటి జెండర్‌ల సమూహానికి చేరువయ్యాడు. వాళ్లందరి సహచర్యంతో సొంతకాళ్లపై నిలబడడానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నాడు.
ఆ సమూహం ప్రోత్సాహంతో 'సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ' (ఎస్.ఆర్.ఎస్.) చేయించుకున్నాడు. తదనంతరం పేరు రజితగా మారిపోయింది.
ఒకే జీవితంలో ఒక అవతారాన్ని పరిసమాప్తం చేసి, మరో అవతారానికి తెర తీసే క్రమంలో.. కొత్త జీవనానికి పునరంకితం కావాలనుకుంది రజిత.
అందరూ స్త్రీలలానే జీవన మాధుర్యాన్ని చవిచూడాలనే సహజమైన తలంపుతో.. జీవన కావ్యపు సుమధుర వైవాహిక ఘట్టంలో తనొక ప్రత్యేక భూమిక పోషించాలని ఆశపడింది.
పర్యవసానమే 'వరుడు కావలెను' అనే ప్రకటన. ఆ ప్రకటన కింద ఒక ప్రత్యేక సూచన ఉంది. దాన్ని చూశాక 'కలికాలం సుమా!' అనుకుంటూ జనం ముక్కు మీద వేలు వేసుకున్నారు.
'నేనొక ట్రాన్స్‌జెండర్ వుమెన్‌ను. నాకు ట్రాన్స్‌జెండర్ మెన్ తోడు కావాలి. అంటే ఆమెలా మారిన నాకు.. అతడుగా మారిన వరుడు కావాలి'
***
చాలామంది ట్రాన్స్ జెండర్స్ కూడా ఆ ప్రకటన చూసి ఆశ్చర్యపోయారు.
పేపర్ ప్రకటన ద్వారా ముందుకు వచ్చిన ప్రసాదుతో వడపోత అనంతరం.. వివాహానికి అంగీకరించింది రజిత.
'అతడిలా మారిన ఆమెతో.. ఆమెలా మారిన అతడి కళ్యాణం 'అంటూ దినపత్రికలు ఈ వార్తని హైలైట్ చేశాయి.
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ వార్త జనంలోకి మరింత వ్యాపించింది.
ఆ నూతన దంపతులను ఆహ్వానించి, ఒక టీవీ ఛానల్ లైవ్‌లో ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది.
***
ఇంటర్వ్యూలో భాగంగా కెమెరా ముందు మొదట పెదవి విప్పింది రజిత.
'జీవిత ఆల్బంలో రెండు ఇమేజ్‌లు కలిసిపోయి, ఒకే ఫోటోగా అలంకృతమైన వింత పరిస్థితి మాలాంటి వాళ్లది.
మనిషికి ఉండే రెండు కళ్ళలా సష్టిలో స్త్రీ, పురుషులిరువురూ రెండు రూపాలు. అరుదైన మూడవ నేత్రం మా జెండర్!' అంటూ ఆగింది.
కెమెరా కన్ను ప్రసాద్ వైపు తిరగగానే గొంతు విప్పాడతను.
యాంకర్ ప్రశ్న సంధించగానే 'మానవుడు తరతరాలుగా ఏదో ఒక రూపంలో ఘర్షణకి లోనవుతూనే ఉన్నాడు. ధన తారతమ్యంతో కొందరు, కుల భేదంతో మరికొందరు, లింగ వివక్షతో ఇంకొందరు..
కానీ మేము అనుభవిస్తున్న ఈ పరాభవం ఆ విధాతకే విస్మయాన్ని కలుగజేసి ఉంటుంది'
'వివక్ష ఎలాంటిదైనా వ్యధ మాత్రం ఒకటేగా! ఎన్ని రకాల అవమానాల భారాన్ని మోస్తూ వస్తున్నాం..' మధ్యలో గొంతు కలిపింది రజిత.
'నిజానికి సుప్రీం కోర్టు కలగజేసుకుని మూడవ జెండర్‌గా మమ్మల్ని గుర్తించాక.. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతి ఈ ట్రాన్స్ పీపుల్ అంటూ మాకో గుర్తింపు వచ్చింది. స్త్రీ పురుషులలాగే మేమూ మనుషులమే! మాకు ఈ మట్టి పైన మమకారం.. పీల్చే గాలి మీద, పారే సెలయేటి మీద హక్కు.. అందరితో కలిసిపోయి, ఆనందంగా జీవించాలనే ఆశ సహజంగానే ఉంటుంది కదా!' అంటూ కొనసాగించాడు ప్రసాద్.
రజిత అంది కదా..'అయినా మీ ఈసడింపులు లెక్కచేయకుండా మానవజాతిలో మేమొక సరికొత్త మూడవ అవతారం అనుకొని చెక్కుచెదరని ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నాం'
కాసేపు ఆ ఇంటర్వ్యూకి చిన్న బ్రేక్ పడి, ప్రకటనలు హోరెత్తించాయి.
యాంకర్ వేసిన మరో ప్రశ్నకు ప్రసాద్ సమాధానమిస్తూ 'రెండు జెండర్‌ల కలయిక అయిన అర్ధనారీశ్వరుని కొలిచే మీరంతా.. ఈ అర్ధనారీశ్వర రూపాలపైన ఎందుకంత వివక్ష? మాకు అన్నింట్లో అవకాశం కల్పించండి. రిజర్వేషన్లు కేటాయించండి. షాపుల్లో, హోటళ్లలో మమ్మల్ని పనివాళ్లలా నియమించుకోండి. పనికిరాని వాళ్ళలా చూడకండి. జనజీవనంలోకి సాదరంగా ఆహ్వానించండి. మీ పక్కన కాస్తయినా చోటివ్వండి' అంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు.. లైవ్ షోకి ముగింపు పలుకుతూ.
ఎనుగంటి వేణుగోపాల్
9440236055