
గట్టిగా మాట్లాడితే భయం. గొంతెత్తి పాడితే భయం. కాలికి గజ్జె కడితే భయం. కలం అంటే మరీ భయం. నిర్భీతిగా వార్తలు అందించేవారంటే ఇంకా భయం. ఎవరైనా గొంతెత్తితే... వారి గుండెల్లో దరువులా మారుమ్రోగుతుంది. దానికి ప్రతీకారంగానే ఆంక్షలు, నిర్బంధాలు, నిషేధాలు. జర్నలిస్టుగా తాను రాసే ప్రతి అక్షరం ప్రజల పక్షంగా వున్నప్పుడు, నిజాలను నిగ్గు తేల్చడమే లక్ష్యంగా వున్నప్పుడు ఈ అణచివేతలు, నిర్బంధాలు మరింత పెరుగుతుంటాయి. నిజాలు చెప్పేవారిపై అప్రకటిత నిషేధాలు విధిస్తారు. దాడులకు తెగబడే సంఘపరివార్ శక్తులకు ఊతమిస్తున్నారు. కలమెత్తిన కరాలను... కదిలించే పదాలను... స్వేచ్ఛనీ, స్వేచ్ఛాభివ్యక్తినీ నిరంకుశ పాలకులు సహించలేరన్న నిజం అడుగడుగునా రుజువవుతోంది. 'న్యాయమూర్తి, జర్నలిస్టు- ఈ రెండు వృత్తులు తప్పనిసరిగా స్వతంత్రంగా ఉండాలి. అవి విఫలమైతే, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దేశంలో ప్రజాస్వామ్యం సజావుగా సాగేందుకు జర్నలిస్టుల స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలి' అంటారు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ.
ప్రపంచ వ్యాప్తంగా కలానికి సంకెళ్లు పడుతూనే వున్నాయి. కార్పొరేట్ల కనుసన్నలలో మెలిగే ప్రభుత్వాలు తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థలపైన, తమకు భజన చేయని పాత్రికేయులపైనా కత్తికడుతున్నారు. కాదంటే నిర్బంధం.. ఎదిరిస్తే దారుణ హత్యలు. ప్రపంచ వ్యాప్తంగా 2021లో 488 మందిని అరెస్టు చేయగా, ఈ ఏడాది 533 మంది పాత్రికేయులను అరెస్టు చేశారని ఫ్రాన్స్‌కు చెందిన 'రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్' తన నివేదికలో వెల్లడించింది. మహిళా జర్నలిస్టులను సైతం వదిలిపెట్టలేదు. 2021లో 60 మంది మహిళా జర్నలిస్టులు జైళ్లపాలైతే, ఈ ఏడాది ఆ సంఖ్య 78కి పెరిగింది. భారత్‌లోనూ ఈ నిర్బంధకాండ అమలు జరుగుతోంది. న్యూస్‌క్లిక్, ది వైర్ వంటి మీడియా సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం, గౌరీ లంకేష్ వంటి జర్నలిస్టుల ప్రాణాలను బలికొనడం వంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. 2021 ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక కూడా ఈ విషయాన్నే స్పష్టం చేసింది. భారతీయ మీడియా స్వేచ్ఛ మేడిపండేనని తేల్చింది. 180 దేశాల పత్రికా స్వేచ్ఛపై ఆరా తీస్తే... అందులో భారత్ 142వ స్థానంలో నిలిచింది. సమాజంలో పెచ్చుమీరుతున్న కలుపు మొక్కల్ని ఏకిపారేసే జర్నలిజాన్నీ, జర్నలిస్టుల్నీ అణచేస్తున్నారు.
'వారు మొదట యూదుల కోసం వచ్చారు/ నేను యూదును కాదు కాబట్టి పట్టించుకోలేదు/ తర్వాత వారు క్రైస్తవుల కోసం వచ్చారు/ నేను క్రైస్తవుడ్ని కాదు కాబట్టి పట్టించుకోలేదు/ తర్వాత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు/ నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి పట్టించుకోలేదు/ తర్వాత వారు నా కోసం వచ్చారు/ నన్ను రక్షించేందుకు ఎవరూ మిగల్లేదు' అంటాడో జర్మనీ కవి. జనాన్ని కులం, మతం గొడవల్లోకి నెట్టి... దేశం యావత్తూ కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా అప్పజెప్పేందుకు కంకణం కట్టుకున్నారు పాలకులు. ఈ క్రమంలో ఎత్తిన గొంతును, రాసే కలాన్ని, రగిలే అక్షరాన్ని సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. నికార్సయిన జర్నలిస్టులు నిజం కోసం సాగించే యజ్ఞం ఇది. ఒక్కడిగా వుండాలో... పదుగురితో కదలాలో నిర్ణయించుకునే తరుణం ఇది. భవిష్యత్తరాలకోసం సాగించే పోరాటంలో ప్రజల మెదళ్లను కదలించే కలం కావాలి. వారిని చైతన్యపరిచే అభ్యుదయ కరం కావాలి. ఎన్ని అడ్డంకులెదురైనా అదరం... బెదరం అని, ఎన్ని నిర్బంధాలెదురైనా ఎత్తిన కలం దించేది లేదని ముందుకు సాగాలి.
'పత్రికొక్కటున్న పదివేల సైన్యము/ పత్రికొక్కటున్న మిత్రకోటి/ ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో' అంటారు నార్ల. కార్పొరేట్ మీడియాని లొంగదీసుకున్నంత మాత్రాన మొత్తం మీడియా ప్రభుత్వ పెద్దల కాళ్ళకు సాగిలపడదు. ఎంతగా అణచివేస్తే... ధిక్కారం అంతగా పెరుగుతుంది. 'పత్రికలులేని ప్రభుత్వం ఉండాలా? లేక ప్రభుత్వం లేని పత్రికలు కావాలా? అని నన్నడిగితే రెండోదానివైపు మొగ్గు చూపడానికి క్షణం కూడా సంశయించను' అంటాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ఏ దేశంలోనైనా ప్రజాస్వామిక విలువలు కొనసాగాలంటే... మొదట పత్రికాస్వేచ్ఛ ఉనికిలో ఉండాలి. దాన్ని గుర్తించడం అవసరం.