
నరేంద్ర మోడీ హయాంలో ప్రజల వాస్తవ ఆదాయం తగ్గిపోయింది. అంతేకాకుండా ఆయన హయాంలో నిత్యావసరాల ధరలు పెరుగుతూనే వున్నాయి. సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ పెరగలేదు. ఒకవైపు వాస్తవ ఆదాయం తగ్గిపోతుంటే మరోవైపు జీవన వ్యయం పెరిగిపోతోంది. ఈ కాలంలో ధనవంతుల ఆదాయం, సంపద రాకెట్ వేగంతో పెరిగింది.
నరేంద్ర మోడీ 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు అనేకానేక వాగ్దానాలు చేశారు. అప్పట్లో దేశంలో వున్న నిరుద్యోగుల సంఖ్యను అంచనావేసిన మోడీ...ఎన్నికల్లో గెలిస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. హామీ ఇచ్చిన ప్రకారం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినట్లయితే ఐదేళ్లలో దాదాపు నిరుద్యోగు లందరికీ ఉపాధి లభించి వుండేది. నిజానికి మోడీ ఆ ఐదేళ్ల తర్వాత రెండోసారి కూడా ప్రధాని అయ్యారు. మొత్తం తొమ్మిదేళ్లుగా ఆయన అధికారంలో ఉన్నారు. కానీ ఏడాదిలో కనీసం 2 లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించలేకపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల సంఖ్య లేదా నిరుద్యోగిత రేటు తగ్గకపోగా పెరిగిపోయింది. దేశంలో నిరుద్యోగం ఆయన అధికారంలోకి రాకముందు కంటే నేడు చాలా ఎక్కువగా వుంది. గత తొమ్మిది సంవత్సరాలలో, ఆయన కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యారు. పని చేసే వారి లేదా కొత్త ఉద్యోగాలు పొందిన వారి ఆదాయం/జీతం పెరగకపోగా చాలా సందర్భాలలో తగ్గింది. అంటే నరేంద్ర మోడీ హయాంలో ప్రజల వాస్తవ ఆదాయం తగ్గిపోయింది. అంతేకాకుండా ఆయన హయాంలో నిత్యావసరాల ధరలు పెరుగుతూనే వున్నాయి. సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ పెరగలేదు. ఒకవైపు వాస్తవ ఆదాయం తగ్గిపోతుంటే మరోవైపు జీవన వ్యయం పెరిగిపోతోంది. ఉన్న చోట ఉపాధి దొరకక వలసలు పోవడం వల్ల దేశ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణించాయి. ఈ కాలంలో ధనవంతుల ఆదాయం, సంపద రాకెట్ వేగంతో పెరిగింది. అందువల్ల, ప్రపంచం లోని మిలియనీర్లు, శత కోటీశ్వరుల జాబితాలో భారతీయ బిలియనీర్ల సంఖ్య పెరిగింది. మోడీ హయాంలో జరిగిన ఆర్థికాభివృద్ధి అంతటిని పారిశ్రామికవేత్తలు సొంతం చేసుకున్నారని అర్థమవుతోంది.
ఇటువంటి కఠోర వాస్తవాల నడుమ నిలబడిన మోడీ....తను మూడోసారి ప్రధాని కావడం ద్వారా భారత్‌ను మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అంతేగాని, తాను మూడవసారి ప్రధాని అయితే సరుకుల ధరలు పెరగనివ్వబోమని మాత్రం చెప్పలేదు. కానీ 'దేశంలోని ఏ ఒక్క వ్యక్తిని కూడా ఖాళీగా కూర్చోనివ్వొద్దు' అన్నారు. ప్రతి ఒక్కరికీ పనిని కల్పించమన్నారు. ఆయన పూర్తి స్పృహతో ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఊహించిన మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగులకు, సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. వారు ఎప్పటిలాగే అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం-తక్కువ ఆదాయాల వల్ల నలిగిపోతారు. అదానీ వంటి సంపన్నులు వెలిగిపోతారు. అయితే ప్రస్తుత స్థాయిలో ఆర్థిక వ్యవస్థ మూడవ అతి పెద్ద దేశంగా మారడానికి మోడీ అవసరం ఉండదు. యుపిఎ హయాంలో వృద్ధిరేటు సాధించిన వేగంతో కొనసాగి ఉంటే భారత్ ఇప్పటికే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ఉండేది. మోడీ అధికారంలోకి వచ్చాక దాన్ని సాధించడానికి బదులుగా ఆ విజయాన్ని కొద్ది సంవత్సరాలపాటు వెనక్కి నెట్టేశారు.
('గణశక్తి' సంపాదకీయం)